రఘువీరారెడ్డి- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ నాయకుడిగా, మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తుడిగా రఘువీరాకు గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయిన నేపథ్యంలో రఘువీరా కూడా కొన్ని సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన ఈ కీలక నాయకుడు ప్రస్తుతం పొరుగున ఉన్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా తిరిగి యాక్టివ్ ట్రాక్ మీదికి వచ్చారు. బెంగుళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా రఘువీరా ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా రఘువీరా చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఆయన ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి.. రఘువీరా పూర్తిగా కన్నడ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తివంచన లేకుండా కృషిచేస్తాననేది ఆయన మాట. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీని ఒక్క మాట అన్నందుకే రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం తన మనసును కలచివేసిందని రఘువీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ మాటలు ఒక వ్యక్తిని కాదు, ఒక కులాన్ని అవమానించాయనే వాస్తవాన్ని రఘువీరా గ్రహించలేకపోతున్నట్టుంది.
ఆ విషయం పక్కన పెడితే.. రాహుల్ ను అవమానించడం వల్లనే కర్నాటక ప్రజలు కాంగ్రెసుకు పట్టం కడతారని రఘువీరా జోస్యం చెబుతున్నారు. సరే.. కన్నడ ఎన్నికల బాధ్యత చూస్తున్నారు గనుక.. అక్కడ పార్టీ గెలిచి తీరుతుందనే విశ్వాసాన్ని ప్రదర్శించాలి గనుక.. ఇలాంటి మాటలు చెబుతున్నారని అనుకోవచ్చు.
అయితే.. రాష్ట్రంలో రాజకీయాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లు స్తబ్ధంగా ఉండిపోవడానికి.. తన స్వగ్రామం నీలకంఠాపురంలో దేవాలయం నిర్మాణంలో ఉండడమే కారణమని రఘువీరా అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలలో తన భవిష్యత్ ప్రస్థానం గురించి ఆయన చెప్పిన మాటలే కాస్త ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.
‘‘తనను అభిమానించే వారు చెప్పినట్టుగా భవిష్యత్తులో నడుచుకుంటానని ’’ అంటున్న రఘువీరా రెడ్డి యాక్షన్ ప్లాన్ పట్ల రకరకాల ఊహలు తలెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయించే ప్రతి నాయకుడు, ఆ ఘట్టానికి కొంత ముందుగా చెప్పే మాట.. ‘తన అభిమానుల మనోభిప్రాయం ప్రకారం నడుచుకుంటాను’ అనేదే. ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా.. కన్నడ ఎన్నికల తర్వాత.. పార్టీ ఫిరాయించి.. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీనుంచి ప్రస్థానం ప్రారంభిస్తారా అనే ఊహాగానాలు మొదలవుతున్నాయి.
ఇప్పుడు కన్నడ ఎన్నికల కోసం బిజెపిని తిట్టినా, ఏపీలోకి వచ్చేసరికి కిరణ్ లాగా ప్లేటు ఫిరాయించి బిజెపిలో చేరుతారా? లేదా, ఒకప్పట్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చాలా చురుగ్గా ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేపట్టిన రఘువీరా.. అదే జగన్ పంచన పెద్దదిక్కుగా నిలుస్తారా? అటూ ఇటూ కాకుండా.. ఏపీ రాజకీయాల్లోకి వచ్చేసరికి తన సొంత ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటూ ఏ టీడీపీ తీర్థమో పుచ్చుకుంటారా? అనేది అర్థం కావడం లేదు.