సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను దాదాపు 15 సంవత్సరాల పాటు అంతర్గతంగా శాసించిన గుజరాత్ నేత అహ్మద్ పటేల్ మరణించారు. అక్టోబర్ లో కరోనా బారిన పడిన 71 సంవత్సరాల వయసున్న ఆయన పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ తో ఈ బుధవారం తెల్లవారుజామున మరణించినట్టుగా ఆయన తనయుడు ట్విటర్ ద్వారా ప్రకటించారు.
ప్రజల నుంచి గెలిచిన నేత కాకపోయినా, ప్రజా బలం లేకపోయినా.. సోనియాగాంధీ రాజకీయ ఆంతరంగిక సలహాదారుగా అనేక వ్యవహారాలను శాసించారు అహ్మద్ పటేల్. దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రాష్ట్రంలో ఎంత ప్రజాబలంతో నెగ్గి వచ్చిన వారు కూడా.. అహ్మద్ పటేల్ కు విలువ ఇవ్వాల్సి వచ్చేది! సోనియాకు వారు ఏం మొరపెట్టుకోవాలన్నా వెళ్లి అహ్మద్ పటేల్ ను కలవాల్సి వచ్చేది!
సోనియాకు తన సలహాలతో పార్టీని ఈయన ఎంత బలోపేతం చేశారో ఎవరికీ తెలియదు కానీ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఇంతటి ధీన స్థితిని ఎదుర్కొనడంలో మాత్రం అహ్మద్ పటేల్ కూ క్రెడిట్ ఉండనే ఉంటుంది. పార్టీని దుంపనాశనం చేయడంలో సోనియాకు దక్కే క్రెడిట్ లో అహ్మద్ పటేల్ కు మెజారిటీ వాటా దక్కుతుంది. చివరి వరకూ అహ్మద్ పటేల్ మాటకు సోనియా చాలా ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. ఆయనను రాజ్యసభకు పంపేందుకు కొన్నేళ్ల కిందట చాలా కష్టపడ్డారు.
గుజరాత్ అసెంబ్లీ కోటాలో అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు ఎన్నిక చేసేందుకు పెద్ద తతంగమే నడిచింది. అహ్మద్ పటేల్ ను రాజ్యసభ ఛాయలకు రానీయకుండా చూడటానికి బీజేపీ చాలా కష్టపడింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన శిబిరంతో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అలా ప్రజాబలం లేని వారి కోసం సోనియా చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇదే సమయంలో ప్రజల బలం కలిగిన వారు కాంగ్రెస్ కు దూరం అయిపోతున్నా పట్టించుకోలేకపోయారు. ఇలాంటి వారి విషయంలో అహ్మద్ పటేల్ ఏం సూచనలు ఇచ్చారో మరి!
ఒకవైపు సోనియాగాంధీ అనారోగ్యంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఢిల్లీ కాలుష్యానికి దూరంగా ఆమె గోవాకు తరలివెళ్లారు. ఇంతలో ఆమె ఆప్తుడు అహ్మద్ పటేల్ మరణించారు.