మనం నడచివచ్చిన దారి మరిచిపోతే అంతకన్నా తప్పు మరోటి వుండదు.
మన పట్ల వేరొకళ్లు చేసిన తప్పులే మనం చేస్తే అంతకన్నా తప్పు ఇంకోటి వుండదు.
అన్నింటికి మించి అంతా మనవల్లే అయిపోతుంది అనుకుంటే అంతకన్నా వేరొకటి వుండదు.
అసలు జగన్ ఎందుకు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ ను ఎందుకు వీడారు?
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఈయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అడిగిన దానికి నో అన్నారు.
అంతే కదా?
మరి జగన్ ఇప్పుడు ఎంత మంది ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. ఎంత మంది నాయకులను కలుస్తున్నారు? ఎంత మంది నాయకుల మాటకు సరే అంటున్నారు.
జగన్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగల యాక్సెస్ విజయసాయి రెడ్డి, సజ్జల, వైవి లకు తప్ప మరెవరికి వుంది. కానీ వీళ్లలో ఎవరికి భయంకరమైన రాజకీయ అనుభవం వుంది? రాజకీయాల్లో ఢక్కామక్కీలు తిని అనుభవం పండించుకున్నారు. మరి అలాంటపుడు వీళ్ల సలహాలు తీసుకోవడం మంచిదా? లేక అనుభవం పండించుకున్న వారి సలహాలు మంచివా?
అసలు జగన్ ఎలా అధికారంలోకి వచ్చారు?
పాదయాత్ర చేసినపుడు ఎక్కడిక్కడ టికెట్ లు ఆశించిన వారు, టికెట్ లు ప్రకటించిన వారు ఏర్పాట్లు చేయడం వల్ల. హామీలు ఇవ్వడం వల్ల. ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల.
హామీలు నిలబెట్టుకున్నారు చాలా వరకు..ఓకె. కానీ తనకు సాయం చేసిన, ఎన్నికలకు సాయం పట్టిన నాయకులను నిలబెట్టుకున్నారా? అనుమానమే. ఎన్నికలు అంటే ఒక్కరి యుద్దం కాదు. పోలింగ్ బూత్ కు ఓటర్లను తరలించే కార్యకర్తల నుంచి పోటీ చేసే అభ్యర్ధుల మీదుగా, నాయకుడి వరకు అంతా అవసరమే.
కానీ జగన్ ఏమనుకున్నారు. తాను వుంటే చాలు. హామీలు నిలబెట్టుకుంటే చాలు. నవరత్నాలు చాలు. జనం ఓట్లేసేస్తారు అనుకున్నారు. కానీ మధ్యలో పార్టీ యంత్రాంగం అనేది ఒకటి వుండాలి అని అనుకోలేదు. మీరు మీ పని చూసుకోండి, ఓట్ల సంగతి, గెలుపు సంగతి నేను చూసుకుంటా అంటూ వచ్చారు. తీరా తేడా వచ్చాక ఇప్పుడు వాళ్లనే జనం దగ్గరకు వెళ్లండి అంటూ తరుముతున్నారు.
కమ్మ సామాజిక వర్గం మీద కోపం వుంటే వుండొచ్చు. దాన్ని ద్వేషంగా మార్చుకుని వుంటే వుండొచ్చు. కానీ ఆ వర్గం శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తే ఎలా? వివిధ వ్యవస్థల్లో బలంగా వేళ్లూనికుని పోయిన వర్గం అది. దాంతో మొండిగా, గుడ్డిగా ఢీ కొడితే ఎలా? వారు చేసే ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఒకరిద్దరు తప్ప మిగలలేదు. ఎందుకని? ఇదంతా జగన్ ఇంట్లో పెళ్లి అనుకున్నారు తప్ప, ఇది తమందరి అవసరం అనుకునే పరిస్థితిని జగన్ కల్పించలేకపోయారు.
విశాఖ రాజధాని అన్నారు. నెలకు ఒక్క నాడైనా నైట్ హాల్డ్ చేయగలిగారా? దానికి కోర్డులు అడ్డం కావుగా. క్యాంప్ ఆఫీసు ఎందుకు పెట్టలేకపోయారు. మరి జనం ఎలా నమ్ముతారు. జనాలకు ఏదైనా కళ్ల ముందు కనిపించాలి. జగన్ వేస్తున్న డబ్బులు కనిపిస్తున్నాయి. కానీ అదే విధంగా పనులు కనిపించడం లేదే. కేవలం స్కూళ్లు, ఆసుపత్రులు తప్ప మరేవీ టచ్ చేయలేదు. అంతా అయిపోయిన తరువాత రోడ్లు బాగు చేసారు. సంతోషం.
మొత్తం మంత్రులను మార్చేస్తా అన్నారు. కానీ మళ్లీ కాస్త వెనుకంజ వేసారు. తీసిన వారిని గౌరవంగా చూసుకోగలిగారా? అదీ లేదు. అలంకార ప్రాయం అనే విధంగా వేలాదిగా పదవులు ఇచ్చారు. వారికి సంతృప్తిగా కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు.
జగన్ చెప్పారో తెలియదు. అధికారులు చేసారో తెలియదు. బోలెడన్ని ఓవర్ యాక్షన్ పనులు జరిగిపోయాయి. సినిమా టికెట్ ల దగ్గర నుంచి చిన్న చిన్న అరెస్ట్ ల వరకు. పెద్దగా హాని కరం కాని చిన్న చిన్న పొలిటికల్ గ్యాసిప్ లు రాసినా చాలు పోలీసుల నుంచి ఫోన్ లు. మీడియా నుంచి జగన్ కు మద్దతు ఎలా అందుతుంది?
అధికారులను నమ్ముకున్నారు జగన్. కానీ జగన్ కు తెలియనిది ఏమిటంటే, అధికారులు అధికారంలో వున్నవారికి 80శాతం అండగా వుంటే కనీసం 20 శాతం అన్నా ప్రతిపక్షానికి దగ్గరగా వుంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్లేటు..ఫేట్ తిరగబడుతుందో తెలియదు కనుక.
జనాలకు డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ కీలకమైన ఉద్యోగులను విస్మరించారు. చంద్రబాబు అంటే ఉద్యోగలకు ఏమంత ప్రేమ లేదు. అది గతంలో అనేక సార్లు నిరూపితమైనంది. కానీ ఇప్పుడు జగన్ వైఖరి వారిని చంద్రబాబుకు దగ్గర చేస్తోంది.
ఇలా ఒకటి కాదు. రెండు కాదు. రాసుకుంటూ, లెక్కలు వేసుకుంటూ పోతే జగన్ ఎదిగిన తీరు నుంచి కిందకు జారుతున్న తీరు ఓ మహాభారతమైపోతుంది. జారడం అంటూ మొదలుపెడితే ఇక అన్నీ పాకుడు రాళ్లే.
ఇప్పటికీ కూడా జగన్ తాను చేస్తున్న తప్పులు గుర్తించడం లేదు..అదే అసలు సిసలు పెద్ద తప్పు.