లాంగ్ గ్యాప్ తర్వాత తొలిసారి హైదరాబాద్ దాటి మరో లొకేషన్ లో అడుగుపెట్టాడు పవన్ కల్యాణ్. ఇన్నాళ్లూ ఈ హీరో సినిమాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే షూటింగ్ జరుపుకున్నాయి. తన రాజకీయ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, అన్ని సినిమాల్ని ఇలానే ప్లాన్ చేశాడు పవన్. కానీ ఓజీ కోసం తొలిసారి హైదరాబాద్ ఆవల షూటింగ్ లో పాల్గొన్నాడు.
ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ సెట్స్ లో పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి జాయిన్ అయ్యాడు. పవన్ సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు.
ఈనెల 15న ఈ షెడ్యూల్ మొదలైంది. నెలాఖరు వరకు కొనసాగుతుంది. పవన్ ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొంటాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తాజా సమాచారం ప్రకారం.. ఈ వీకెండ్ వరకు ఆయన షూటింగ్ లో పాల్గొంటాడు. ఆ తర్వాత తన పొలిటికల్ షెడ్యూల్స్ బట్టి కాల్షీట్లు మారుస్తాడు.
ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలకు కూడా కాల్షీట్లు కేటాయిస్తున్నాడు పవన్. వీటితో పాటు వినోదాయ శితం రీమేక్ ప్రాజెక్టుకు సంబంధించి చిన్న పోర్షన్ పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓజీ సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత, మిగతా సినిమాలకు దశలవారీగా కాల్షీట్లు ఇస్తాడు పవన్. ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ అతడు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టినట్టు నిర్మాత దానయ్య ప్రకటించాడు. ఈ ప్రాజెక్టుకు సుజీత్ దర్శకుడు.