కేంద్రం నుంచి క్లారిటీ.. ఇప్పుడు జగన్ ప్లాన్ ఏంటి?

అంతా ఊహించినట్టే జరిగింది. చంద్రబాబు నక్కజిత్తులు పనిచేయలేదు. మూడు రాజధానుల అంశానికి కేంద్రం పూర్తిగా మద్దతిచ్చింది. రాజధానిని ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ…

అంతా ఊహించినట్టే జరిగింది. చంద్రబాబు నక్కజిత్తులు పనిచేయలేదు. మూడు రాజధానుల అంశానికి కేంద్రం పూర్తిగా మద్దతిచ్చింది. రాజధానిని ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ దిశగా మరింత వేగంగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. 

కేంద్రం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో.. పాలన-అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ ఏం చేయబోతున్నారు.

ప్లాన్-1: ఉద్యోగుల తరలింపు

వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల్ని వీలైనంత త్వరగా విశాఖకు పంపించాలని జగన్ నిర్ణయించారు. ఇక్కడ కూడా ఆయన కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఒకేసారి తరలింపుకు సంబంధించి ఉత్తర్వులు ఇస్తే మళ్లీ న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి డిప్యూటేషన్ అస్త్రాన్ని వాడుకుంటున్నారు. వివిధ శాఖలకు చెందిన కీలకమైన అధికారుల్ని కొందరిని డిప్యుటేషన్ పై, మరికొందర్ని ఆన్-డ్యూటీపై పంపించబోతున్నారు. దీని కోసం కేవలం రెగ్యులర్ జీవోలు జారీ చేస్తే సరిపోతుంది. అదంతా రొటీన్ గానే సాగిపోతుంది.

ప్లాన్-2: క్షేత్రస్థాయిలో ప్రచారం

మూడు రాజధానుల వ్యవహారంపై టీడీపీ-జనసేన-బీజేపీ-కమ్యూనిస్టులు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి. పాలన వికేంద్రీకరణ వల్ల ఎంత సౌలభ్యం ఉంటుంది, ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలి. మరీ ముఖ్యంగా తాజాగా కేంద్రం మద్దతు పలికిన అంశాన్ని కూడా గ్రామస్థాయి వరకు ప్రజలకు చేరువయ్యేలా చేయాలి. దీని కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు ముఖ్యంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కర్ని దాదాపు నెల రోజుల పాటు ఇదే పనిలో పెట్టాలని భావిస్తున్నారు. ఊరూవాడా సభలు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా సాగుతున్న దీక్షల్ని మరింత ఉధృతం చేయాలని ఫిక్స్ అయ్యారు.

ప్లాన్-3: కర్నూలు, విశాఖలో జగన్ బస

మూడు రాజధానుల వల్ల ఉపయోగాల్ని ప్రజలకు వివరిస్తూ, ఉద్యోగుల్ని ఆన్-డ్యూటీపై పంపిస్తూ.. తను కూడా మిగిలిన 2 ప్రాంతాల్లో చురుగ్గా ఉండాలని జగన్ నిర్ణయించారు. కేవలం అమరావతికే పరిమితమైపోకుండా.. ఇకపై కర్నూలు, విశాఖలో కూడా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు జగన్. ఈ మేరకు కొన్ని కీలక సమావేశాల్ని విశాఖ, కర్నూలులో కూడా ఏర్పాటుచేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా ఇకపై పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లతో ఎలాంటి మీటింగ్స్ ఉన్నా అవన్నీ విశాఖలో ఏర్పాటుచేయమని సీఎం అధికారులు సూచించారు.

ఇలా మూడు రాజధానుల అంశంపై చురుగ్గా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నుంచి అధికారుల ఆన్-డ్యూటీ ప్రక్రియ అధికారికంగా మొదలు కానుండగా.. కొన్ని శాఖల కార్యాలయాల తరలింపు ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది.

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది