హైదరాబాద్ అత్తాపూర్ లో నడిరోడ్డుపై పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటన మరవక ముందే మరో ఘోరం జరిగింది. ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా కోసి శవాన్ని సంచిలో కట్టి పడేసిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.
సిటీలో చేపల వ్యాపారి రమేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. 3 రోజులుగా అతడు కనిపించడం లేదు. జూబ్లిహిల్స్ లోని జవహర్ నగర్ ప్రాంతంలో నిన్న రాత్రి గోనె సంచెలో మృతదేహాన్ని గుర్తించారు. అది కిడ్నాప్ కు గురైన రమేష్ దే అని నిర్థారించారు పోలీసులు. రమేష్ కు తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
శనివారం సాయంత్రం రమేష్ కు ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడే వస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన రమేష్ తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతలోనే రమేష్ ఫోన్ నుంచి కుటుంబీకులకు వాట్సాప్ మెసేజ్ లు రావడం మొదలయ్యాయి. 90 లక్షలు డిమాండ్ చేస్తూ మెసేజీలు రావడం మొదలయ్యాయి.
ఓవైపు మెసేజీలు వస్తుండగానే మరోవైపు రమేష్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాప్ అయిన రోజునే రమేష్ ను హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య చేసి మరీ డబ్బుల కోసం డిమాండ్ చేశారు దుండగులు. స్థానికంగా దొరికిన ఆధారాల ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లల్లో ఆరా తీయడంతో పాటు.. రమేష్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.
రమేష్ కు పరిచయస్తుడైన ఓ వ్యక్తి నిన్న ఉదయం నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడి కుటుంబీకుల్ని అదుపులోకి తీసుకున్నారు.