‘ పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ చేయడాన్ని అభినందించడానికే నేను మాట్లాడుతున్నా. గ్యాప్ లేని రోజు రాజకీయాల్లో ఉండండి. గ్యాప్ వచ్చిన రోజు సినిమాలు చేయండి’.…ఇది ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఇచ్చిన సలహా. ‘పరుచూరి పలుకులులో’ పేరుతో ఓ వీడియోను తన అభిమానులతో ఆయన పంచుకున్నాడు.
‘ వెల్కమ్ టు పవన్‌కల్యాణ్. పవన్‌కు ఒక విషయాన్ని చెప్పాను. మీరు వీధివీధి తిరిగి చెప్పేకంటే ఒక్క మీడియా ద్వారా , పాత్ర ద్వారా అద్భుతంగా వెళ్లిపోతాయి. కర్తవ్యం సినిమా చూసి చాలా మంది మహిళలు పోలీస్ ఆఫీసర్లు కావాలని అనుకున్నారు. సినిమా ప్రభావం అలాంటిది’….పవన్ రాకను సమర్థిస్తూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన మాటలివి.
అలాగే, ఇంకా ఆయన ఏం చెప్పారంటే…
‘ నటన, రచన భగవంతుడు ఇచ్చిన వరం. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అంశాల్ని తెరపై మేము చూపిస్తుంటే అవి నచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కొందరినైతే ఆరాధిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కి ఇమేజ్ ఉంది. అతను ఎంత మంచివాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత కూడా సినిమాలు తీశారు.
1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత , 1994 ఎన్నికల్లో గెలవడానికి మేజర్ చంద్రకాంత్ సినిమా ఎంత ఉపయోగపడిందో మాకు తెలుసు.పవన్ ఎమ్మెల్యే అయినా నటిస్తూనే ఉండాలి. రాజకీయాల్లోకి వెళ్తే మేకప్ వేసుకోవడం తప్పేమి కాదు. పవన్ నిర్ణయాన్ని అభినందించడానికే నేను మాట్లాడుతున్నా’….ఇలా సాగింది పరుచూరి గోపాలకృష్ణ ఆహ్వాన పలుకు.