సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలను సామాన్యులు కూడా నిలదీసే పరిస్థితి. సెలబ్రిటీలు మాట్లాడే మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదనిపిస్తే మాత్రం నెటిజన్లు ఏ మాత్రం విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఇదేంటని గట్టిగా నిలదీస్తున్న సోషల్ మీడియా కాలమిది.
అలాంటి పరిస్థితి బాలీవుడ్ గాయని సోనా మొహపాత్రకు ఎదురైంది. అయితే ఆమె కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. మీటూ ఉద్యమంలో సంచలన కామెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా సోనా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె `ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్` పేరుతో ఓ ఛాలెంజ్ ప్రోగ్రాంను చేపట్టింది. ఇందులో భాగంగా బాధితులనే దోషులుగా నిలిపి వేధిస్తున్న ఘటనల గురించి లోకానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా తన స్వీయ అనుభవాన్ని ఆమె చెప్పుకొచ్చింది. తాను బీటెక్ చదువుతున్నప్పుడు ఓ రోజు సల్వార్ దుస్తులు ధరించి మైక్రోప్రాసెస్ ల్యాబ్‌కు వెళ్తుండగా … అక్కడ ఉన్న సీనియర్లు తన లోదుస్తుల గురించి అందరికీ వినబడేలా కామెంట్లు చేశారని తెలిపింది.
ఓ వ్యక్తి తన దగ్గరగా వచ్చి `ఎక్స్పోజింగ్ చేయకుండా చున్నీ సరిగా వేసుకోవచ్చు కదా` అని ఉచిత సలహా కూడా ఇచ్చాడని పేర్కొంది.
సోనా వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఈ చేదు అనుభవంపై ఓ నెటిజన్ స్పందిస్తూ… “ఇంత బాధపడిపోతున్న మీరు హాట్ హాట్ ఫొటో షూట్లలో ఎందుకు పాల్గొంటున్నారు. క్లీవేజ్ బాగా కనబడే ఫొటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి హాయిగా పాటలు పాడడంపై దృష్టి సారించండి” అని ట్వీట్ చేశాడు.
దీంతో సోనాకు చిర్రెత్తుకొచ్చింది. నెటిజన్ ట్వీట్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇంతకూ సోనా ఏమన్నారంటే … “నా శరీరం.. నా క్లీవేజ్.. నాకు ఎలా నచ్చితే అలా ఉంటా. నీవు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వచ్చినట్టేనా” అని ఆమె సమాధానం ఇచ్చింది. మొత్తానికి నెటిజన్ ట్వీట్, ఆమె సమాధానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.