ష‌ర్మిలలో వాడి, వేడి ఏదీ?

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ మౌనం పాటిస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఇత‌ర ప‌క్షాల్ని కూడా క‌లుపుకుని కేసీఆర్ స‌ర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌రోవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఈ ఏడాది…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ మౌనం పాటిస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఇత‌ర ప‌క్షాల్ని కూడా క‌లుపుకుని కేసీఆర్ స‌ర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌రోవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖ‌రులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ళ్లు మూసి తెరిచే లోపు ఎన్నిక‌లు వ‌స్తాయి. రాజ‌న్న రాజ్యం స్థాపించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ‌లో సొంతంగా రాజ‌కీయ పార్టీని స్థాపించారు.

అయితే చెప్పుకోత‌గిన స్థాయిలో ఆమె పార్టీకి ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. కానీ పార్టీని బ‌లోపేతం చేసుకోడానికి ష‌ర్మిల ప్ర‌య‌త్నాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ష‌ర్మిల పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఆమె పాద‌యాత్ర‌కు అడ్డంకులు ఎదుర‌య్యాయి. అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు శ్రుతిమించ‌డంతోనే అడ్డుకున్నామ‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. అలాగే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించేలా ష‌ర్మిల విమ‌ర్శ‌లున్నాయ‌ని పోలీసులు చెప్పారు. అందుకే పాద‌యాత్ర అనుమ‌తులు ర‌ద్దు చేసిన‌ట్టు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

న్యాయ పోరాటం చేసి పాద‌యాత్ర‌కు అనుమ‌తి తెచ్చుకున్నా పోలీసుల నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదురైంది. ప్ర‌త్యుర్థుల‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే నెపంతో ష‌ర్మిల ఘాటు స్పంద‌న వైఎస్సార్‌టీపీకి స‌మ‌స్య‌లు తెచ్చింది.

ఈ క్ర‌మంలో ష‌ర్మిల పాద‌యాత్ర అట‌కెక్కింది. ఎన్నిక‌ల ముంగిట ష‌ర్మిల త‌ర‌పున త‌గిన రాజ‌కీయ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం లేదు. ఎందుక‌నో ఆమె మౌనాన్ని ఆశ్ర‌యించిన భావ‌న క‌లుగుతోంది. ఇటీవ‌ల ఆమెలో వాడి, వేడి త‌గ్గింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ప్ప‌టి ఉత్సాహం ఆమెలో నెమ్మ‌దిగా త‌గ్గిపోతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. త‌న పార్టీకి త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌క‌పోవ‌డం వ‌ల్ల నిరుత్సాహానికి గుర‌య్యారా? లేక వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లేవైనా ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అనేది తేలాల్సి వుంది.