ఈనాడు, సాక్షి: సరిపోయారు ఇద్దరూ!

రాష్ట్రంలో ప్రజల జీవితాలను చైతన్యవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించాల్సిన రెండు అగ్ర తెలుగు దినపత్రికలను చూస్తే జాలి కలుగుతుంది. పత్రిక అంటే- ప్రజల ప్రయోజనాలు, పత్రికలు అంటే-నిర్మాణాత్మక ప్రతిపక్షం ఇలాంటి నిర్వచనాలు అన్నీ…

రాష్ట్రంలో ప్రజల జీవితాలను చైతన్యవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించాల్సిన రెండు అగ్ర తెలుగు దినపత్రికలను చూస్తే జాలి కలుగుతుంది. పత్రిక అంటే- ప్రజల ప్రయోజనాలు, పత్రికలు అంటే-నిర్మాణాత్మక ప్రతిపక్షం ఇలాంటి నిర్వచనాలు అన్నీ మొన్నటి తరానికి సంబంధించినవి. పత్రికలు అంటే రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే వేదికలు- అనే నిర్వచనాలు కూడా బాధాకరమే అయినా అవి నిన్నటితరానికి సంబంధించనవి. 

ఇవాళ్టి పరిస్థితుల్లో పత్రికలు తమ తమ నేరాలను, దోషాలను, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, సమర్థించుకోవడానికి ఆరాటపడే వ్యవస్థలుగా తేలుతున్నాయి. అయితే ఈ పోకడ సార్వజనీనమైనది కాదు. తెలుగునాట నడుస్తున్న సకలపత్రికలు ఇలాంటి ఖర్మ లేదు. 

వార్తను వార్తగా, వక్రీకరణలు లేకుండా అందిస్తున్న వారు కూడా ఉన్నారు. శోచనీయమైన విషయం ఏంటంటే.. తెలుగులో అన్ని పత్రికల టోటల్ సర్కులేషన్ కంటే.. తమ ఒక్క పత్రిక సర్కులేషన్ అత్యధికంగా ఉంటున్న ఈనాడు, సాక్షి దినపత్రికలు ప్రధానంగా గాడితప్పిపోవడం. తమ సొంత సంస్థల, సొంత వ్యక్తుల నేరాలను కప్పెట్టుకోవడం తప్ప వీరికి వేరే వ్యాపకం లేకుండా పోవడం.

ఈనాడు విషయానికి వస్తే.. మార్గదర్శి రూపంలో చేసిన అవకతవకలకు, అక్రమాలకు, చట్టాల ఉల్లంఘన, లోపాయికారీ వ్యవహారాలకు ఫలితంగా రామోజీరావు జైలు పాలయ్యే పరిస్థితి ఉన్నదని వారికి తెలుసు. ఏపీ సీఐడీ మార్గదర్శి ఆర్థిక బాగోతాలపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. తనను విచారించిన సందర్భంలో రామోజీరావు కూడా.. మార్గదర్శి సంస్థల నుంచి నిధుల మళ్లింపు, తరలింపు వంటి నేరాలు పరోక్షంగా అంగీకరించిన నేపథ్యంలో ఇవాళో రేపో ఆయన అరెస్టు తథ్యం అనేది అందరికీ అర్థమైంది. 

అప్పటినుంచి ఈనాడు ఒకటే ఎజెండా పెట్టుకుంది. ‘రామోజీరావు మహానుభావుడు.. మార్గదర్శి వ్యవహారాల్లో కించిత్ దోషం లేదు’ అని ప్రచారం చేయడమే వారి లక్ష్యం. రామోజీకి అనుకూలంగా, మార్గదర్శికి అనుకూలంగా బాహ్య ప్రపంచంలో ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా సరే.. వారిని ఇంటర్వ్యూ చేసేసి చేంతాడంత స్టోరీలు వేస్తున్నారు. 

మార్గదర్శి సక్రమమే అని చెప్పడానికి రకరకాల వ్యక్తులు, చార్టెర్డ్ అకౌంటెంట్లు, చిట్ కంపెనీ యజమానుల సంఘాల వారు ఇలా అనేక వర్గాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను ప్రచురించడం, తెలుగుదేశం వారు మార్గదర్శిని కీర్తిస్తే చాలు తాటికాయంత అక్షరాలతో ఆ వార్తలు అచ్చొత్తించడం ఇదే పని అయిపోయింది వారికి. మార్గదర్శి అక్రమాలను దాచిపెట్టడం తప్ప ప్రస్తుతానికి ఈనాడుకు వేరే ఎజెండా లేదు.

సాక్షి వ్యవహారం కూడా ఇదే తీరుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయన్నది వారికి కనిపిస్తున్నాయో లేదో మనకు అర్థం కాదు. కానీ పతాక శీర్షికల్లో మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి సత్యసంధత, నిజాయితీ, నిష్కళంకత్వం మాత్రమే చోటు చేసుకుంటున్నది. 

వైఎస్ వివేకా హత్య అనే కేసు నుంచి అవినాష్ రెడ్డిని కాపాడడమే లక్ష్యంగా సాక్షి దినపత్రిక తన సర్వశక్తులూ ఒడ్డి కథనాలు ప్రచురిస్తున్నది. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేస్తోంది, వివేకా కూతురు అల్లుడు చెప్పినట్టుగా దర్యాప్తు చేస్తోందే తప్ప, అల్లుడిని అసలు విచారించడం లేదు అనే వ్యాఖ్యలు ప్రతినిత్యం సాక్షినిండా మనకు కనిపిస్తుంటాయి. చంద్రబాబునాయుడు స్కెచ్ ప్రకారం సీబీఐ దర్యాప్తు చేస్తోందనే కామెడీ ఆరోపణలు కూడా కనిపిస్తాయి. వివేకా హత్య లో అవినాష్ రెడ్డి పాత్ర లేనేలేదని, ఆయన చాలా నిజాయితీగా వివేకా మరణం గురించి పోలీసులకు తానే సమాచారం ఇచ్చి స్వచ్ఛంగా వ్యవహరించాడని ప్రపంచానికి చాటిచెప్పడం వారి టార్గెట్. ఆయన అరెస్టు కాకుండా చూడడం వారి ఆశయం.

పత్రికలు అంటే ప్రజలకోసం పనిచేస్తాయని మనం అనుకుంటాం. ప్రజాసమస్యలకు పెద్దపీట వేస్తాయని భ్రమిస్తాం. కానీ ఇప్పటి ప్రపంచంలో ప్రజల కోసం కాదు కదా.. తమ సొంత వ్యాపారాల కోసం పనిచేయడం అనే దశను పత్రికలు దాటిపోయాయి. తమ తమ ఇతర వ్యాపారాలు, వ్యవహారాల్లో నేరాలను కప్పెట్టుకోవడం తప్ప ఇంకో లక్ష్యం లేదన్నట్టుగా ఈ అగ్రపత్రికలు రెండూ వ్యవహరిస్తున్నాయి. తెలుగు ప్రజలకు ఇది ఖర్మ కాక మరేమిటి?!!