పొత్తు మాట కాదు.. మద్దతు వద్దని రాహుల్ చెప్పగలరా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం అనేది అధిష్ఠానానికి కత్తి మీద సాములాగా తయారైనట్టుంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అస్తిత్వాన్ని కాపాడడం అనేది సవాలుగా పరిణమిస్తోంది. పార్టీలో విపరీతమైన ముఠా కుమ్ములాటలు ఒక ఎత్తు. ప్రజల్లో…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం అనేది అధిష్ఠానానికి కత్తి మీద సాములాగా తయారైనట్టుంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అస్తిత్వాన్ని కాపాడడం అనేది సవాలుగా పరిణమిస్తోంది. పార్టీలో విపరీతమైన ముఠా కుమ్ములాటలు ఒక ఎత్తు. ప్రజల్లో సన్నగిల్లుతున్న విశ్వసనీయత మరో ఎత్తుగా కాంగ్రెస్ సతమతం అవుతోంది. 

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన రాహుల్, తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భారాసతో పొత్తు పెట్టుకోదు అనే స్పష్టత ప్రజలకు ఇవ్వాలంటూ సందేశం ఇవ్వడం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం.

కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పన్నెండు మంది భారాసలో చేరిపోయారు. కాంగ్రెసుకు ఓటువేసి గెలిపిస్తే.. వారు ఎంచక్కా అధికార పార్టీలో చేరిపోతారు అనే అభిప్రాయం ప్రజలకు ఏర్పడింది. ఫిరాయించిన నాయకుల కారణంగా పార్టీ విశ్వసనీయత దెబ్బతింది. 

ఈ ఎన్నికల సమయానికి వాతావరణం ఇంకో రకంగా మారుతోంది. బిజెపి- భారాస ప్రధానంగా తలపడుతుండగా, భారాస- కాంగ్రెస్ పార్టీలు రెండూ కుమ్మక్కు అవుతున్నాయని, పొత్తులతో పోటీచేస్తాయని ఒక ప్రచారం నడుస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారును గద్దె దించాలి అనే లక్ష్యం, బిజెపి వ్యతిరేకత అనేవి కాంగ్రెస్, భారాసలకు కామన్ ఎలిమెంట్స్ గా ఉన్నాయి. 

కాంగ్రెస్ తో పొత్తు అనే మాట ప్రచారంలోకి వస్తే.. తెలంగాణలో అది తమపార్టీకి సమాధి కట్టేస్తుందనే భయం కేసీఆర్ లో కూడా ఉంది. అందుకే ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. బిజెపి వ్యతిరేక కూటమిని నిర్మించాలని తపనపడ్డ ప్రతి ప్రయత్నంలోనూ కాంగ్రెసును కూడా దూరం పెట్టాలనే నిబంధనతోనే అడుగులు వేస్తూ వచ్చారు. కానీ.. ఆయన సంప్రదించిన ఇతర పార్టీల నాయకులందరూ కాంగ్రెస్ తో మైత్రికి అనుకూలంగా ఉండేవారే. ఇలాంటి నేపథ్యంలో బిజెపి వ్యతిరేకత అనే కామన్ ఎజెండా కాంగ్రెస్, భారాస మైత్రికి దారితీస్తుందనే ప్రచారం బాగా ఉంది.

ఆ ప్రచారం నుంచి తమ పార్టీని కాపాడుకోవడం కూడా కాంగ్రెసుకు అవసరంగా మారుతోంది. భారాసతో పొత్తు ఉండదనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని తెలంగాణ నాయకులకు రాహుల్ హితోపదేశం చేయడం వెనుక మర్మం అదే. 

భారాసతో పొత్తు ఉండదని గట్టిగా చెబుతారు సరే.. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత.. బిజెపిని కూల్చడానికి భారస మద్దతు కోరకుండా ఉంటారా? బిజెపి వ్యతిరేక కూటమి గద్దె ఎక్కే పరిస్థితి వస్తే.. అప్పుడు భారాసను అంటరాని పార్టీగా చూస్తారా.. లేదా వారి మద్దతు అడుగుతారా? ఇప్పుడు చెబుతున్నట్టే వారిని దూరం పెడతారా? అనే విషయంలో కూడా రాహుల్ స్పష్టత ఇస్తే బాగుంటుంది.