దస్తగిరికి తుపాకీ కావాలంట!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఇప్పుడు అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయంటే, అవినాష్ తండ్రి భాస్కర రెడ్డి అరెస్టు అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారంటే అందుకు ప్రధాన…

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఇప్పుడు అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయంటే, అవినాష్ తండ్రి భాస్కర రెడ్డి అరెస్టు అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారంటే అందుకు ప్రధాన కారణం దస్తగిరి. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఒకరైన దస్తగిరి, అరెస్టు తర్వాత  అప్రూవర్ గా మారారు. కనుక ఇప్పుడు జైలు గొడవ లేకుండా హాయిగా ఇంట్లో ఉన్నాడు. కాకపోతే తనకు ఇప్పుడు తుపాకీ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. తనకు తుపాకీ కోసం అనుమతి ఇవ్వకపోవడం అనేది, పోలీసులు చేస్తున్న కుట్ర అన్నట్టుగా అభివర్ణిస్తున్నాడు. 

వైఎస్ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర రెడ్డి ల పాత్ర వివేకా హత్య వెనుక ఉన్నదనే ఆరోపణలు చేయడం, ఆ కారణంగా అరెస్టు కావడం తెలిసిందే. అయితే.. స్వయంగా హత్య చేసిన వాళ్లలో ఒకడైన దస్తగిరిని అప్రూవర్ గా మార్చుకుని, శిక్ష నుంచి తప్పించుకోవడానికి అతడేదో ఒక సుదీర్ఘమైన కట్టుకథ చెబితే.. అప్రూవర్ వెల్లడించిన నిజాలు అంటూ తమను అన్యాయంగా కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ అవినాష్ రెడ్డి తొలినుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్ వివేకా కుటుంబంలో తగాదాలు ఉన్నాయని, ఆయన హత్యలో అల్లుడు పాత్ర ఉన్నదని, ఆయన కనీసం తనకు తెలిసిన మరణ సమాచారాన్ని పోలీసులకు కూడా చెప్పలేదని అవినాష్ అంటున్నారు. అల్లుడు ప్రలోభాలతోనే దస్తగిరి అప్రూవర్ గా మారినట్టుగా కూడా చెబుతున్నారు. 

అలాంటి దస్తగిరి ఇప్పుడు అవినాష్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నాడు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాష్ నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నాడు. అప్పుడు డబ్బుకు ఆశపడే ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు చేశానంటున్న దస్తగిరి, ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి సీబీఐకు నిజం చెప్పేశానని అంటున్నాడు. ఇప్పుడు డబ్బు అవసరం లేకుండాపోయేంత గొప్పవాడుగా దస్తగిరి ఎలా తయారయ్యాడు? అనేది పెద్ద ప్రశ్న. 

డబ్బు అవసరం లేదు గానీ.. దస్తగిరి తుపాకీ మాత్రం కావాలట. తుపాకీ ఉంటే దస్తగిరి ఏం చేయదలచుకుంటున్నారు. ఎవరినుంచి అయితే ప్రాణహాని అని భయపడుతున్నాడో.. ముందుగా వారి అడ్డు తొలగించుకుంటాడా? అనేవి ఆయన తుపాకీ కోరిక గమనించిన వారికి కలిగే ప్రశ్నలు. రాష్ట్రంలో ప్రాణహాని ఉందని భయపడే ప్రతి వ్యక్తీ ‘నాకు తుపాకీ కావాలి’ అనడం మొదలెడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలంటేనే భయం అనిపిస్తుంది.

వివేకా హత్యలో పాలుపంచుకుని, అప్రూవర్ ముసుగును కవచంలా వాడుకుంటున్న దస్తగిరి.. మీరు తప్పు చేస్తే మీరే జైలుకెళ్తారు, మీ తప్పు రుజువైతే రాజీనామా చేస్తారా అంటూ ఏకంగా సీఎం జగన్ ను, ఎంపీ అవినాష్ ను ఉద్దేశించి ఇలా మాటలు తూలడం వెనుక ఎవరుండి వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారో అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.