అటు నామినేష‌న్లు.. ఇటు రాజీనామాలు!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుతోంది. మే ప‌దో తేదీన పోలింగ్ కు సంబంధించి ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతూ ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మ‌ధ్య ప్ర‌ధాన పోరులో…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుతోంది. మే ప‌దో తేదీన పోలింగ్ కు సంబంధించి ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతూ ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మ‌ధ్య ప్ర‌ధాన పోరులో పోటాపోటీగా నామినేష‌న్లు కొన‌సాగుతూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ మూడు పార్టీలూ దాదాపు అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించేశాయి. ఒక‌టీ అర మిన‌హాయించి దాదాపు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి.

విశేషం ఏమిటంటే.. నామినేష‌న్ల గ‌డువు ముంచుకొస్తున్నా అభ్య‌ర్థులు అటూ ఇటూ గెంతుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఐదు సార్లు ఎమ్మెల్యే, మాజీ సీఎం జ‌గ‌దీష్ షెట్ట‌ర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డం ఆస‌క్తిదాయ‌క‌మైన ఘ‌ట్టం. త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌లేద‌నే నిర‌స‌న‌తో ఆయ‌న బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ చేరారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్ ఖ‌రారు అయిన‌ట్టే. అలాగే బీజేపీలో టికెట్ ద‌క్క‌లేద‌ని మ‌రో ముఖ్య నేత‌, తాజా మాజీ డిప్యూటీ సీఎం ల‌క్ష్మ‌ణ్ స‌వ‌ది కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. 

ఒక మాజీ ముఖ్య‌మంత్రి, మరో మాజీ డిప్యూటీ సీఎం… ఈ వేడిలో క‌మ‌లం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేర‌డం ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఈ రాజీనామాలు బీజేపీ ని ఇబ్బంది పెట్టేవే. తాము టికెట్ ఇవ్వ‌క‌పోయినా కామ్ గా ఉండాలి త‌ప్ప‌, ఇలా బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని బీజేపీ స‌హించే ప‌రిస్థితుల్లో లేదు. ఈ నేప‌థ్యంలో సీఎం బొమ్మై మాట్లాడుతూ.. వారి రాజీనామాలు త‌మ‌కు పెద్ద న‌ష్టం కావ‌ని ప్ర‌క‌టించుకున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో రికార్డు స్థాయిలో సిట్టింగుల‌కు బీజేపీ టికెట్ల‌ను నిరాక‌రించింది. అటు ఇటు అర‌వై నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించింది. కేవ‌లం మోడీ ఇమేజ్ మీదే ఈ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది త‌మ‌కు మ్యాట‌రే కాద‌న్న‌ట్టుగా ఉంది క‌మ‌లం పార్టీ తీరు. మ‌రి ఈ వేగంతో దూసుకుపోతున్న బీజేపీ ఎలాంటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. 

ఒక జాతీయ పార్టీలో ఇలా ఏకంగా మూడో వంతు చోట్ల పాత వారికి కాద‌ని కొత్త వారికి టికెట్లు ఇవ్వ‌డం సంచ‌ల‌న అంశ‌మే! సాధార‌ణంగా జాతీయ పార్టీలు ఇలాంటి రాజ‌కీయానికి ఆస్కారం ఇవ్వ‌వు. సీనియారిటీకే నేష‌న‌ల్ పార్టీల్లో విలువ ఎక్కువ‌! ప్రాంతీయ పార్టీలు రాత్రికి రాత్రి అభ్య‌ర్థుల‌ను అడ్ర‌స్ లేకుండా చేయ‌గ‌ల‌వు. అయితే జాతీయ పార్టీల వ్య‌వ‌హారం ఇందుకు భిన్నం. మ‌రి క‌ర్ణాట‌క‌లో అలాంటి పెను సంచ‌ల‌నానికి దారి తీసిన బీజేపీ రాజ‌కీయంగా ఎలాంటి ఫ‌లితాన్ని సాధిస్తుందో!