హీరోల్లో 90శాతం మంది మొహమాటపడరు. సినిమా చేయకూడదు అనుకుంటే చేయరంతే. దర్శకుడు ఎవరైనప్పటికీ, తప్పించుకోవాలని ఫిక్స్ అయితే ఇక అంతే. మొన్నటికిమొన్న అర్జున్ విషయంలో విశ్వక్ సేన్ ఏం చేశాడో అందరం చూశాం. ఇక మణిరత్నంతో మహేష్ సినిమా గురించి కూడా అందరికీ తెలిసిందే.
కానీ హీరోయిన్లు ఈ విషయంలో ఇంకా అంత ఎదగలేదు. మరీ ముఖ్యంగా సమంత. ఎన్నో అనుమానాలు, ఇంకెంతో మొహమాటం మధ్య గుణశేఖర్ సినిమాను ఒప్పుకున్నానని గతంలోనే ప్రకటించింది సమంత. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించింది.
ప్రారంభంలో శాకుంతలం సినిమా కథ చెప్పినప్పుడు రిజెక్ట్ చేసింది సమంత. కానీ ఆ తర్వాత దిల్ రాజు రంగంలోకి దిగి సమంతను ఒప్పించారట. దిల్ రాజు ధైర్యం చెప్పడంతో శాకుంతలం పాత్ర చేయడానికి ఒప్పుకున్నానని, స్వయంగా సమంత ప్రకటించింది. ఆ 'ఒప్పించడం' అనే కాన్సెప్ట్ దగ్గరే సమంత తప్పు చేసిందంటున్నారు ఆమె ఫ్యాన్స్.
ఇవాళ్టితో శాకుంతలం కథ ముగిసింది. సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. అటు యూనిట్ కు కూడా విషయం అర్థమై, ప్రచారం ఆపేశారు. ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. అయితే ఫైనల్ గా ఇప్పుడు జరిగిందేంటంటే.. శాకుంతలం ఫ్లాప్, సమంత ఫిల్మోగ్రఫీలోకి చేరిపోయింది. ఆమె మొహమాటమే ఆమెకు ఫ్లాప్ తెచ్చిపెట్టిందంటున్నారు.
గతంలో మహేష్ బాబు ఇలానే గుణశేఖర్ విషయంలో మొహమాటపడ్డాడు. డిజాస్టర్ తర్వాత ఇక మళ్లీ గుణ వైపు చూడలేదు. ఆ లౌక్యాన్ని సమంత ప్రదర్శించలేకపోయింది.
శాకుంతలం తర్వాత పరిస్థితేంటి?
శాకుంతలం ఫ్లాప్ తర్వాత సమంత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మొన్నటివరకు ఫిమేల్ ఓరియంటెండ్ సినిమాలకు ఆమె కేరాఫ్ గా ఉండేది. యూటర్న్, ఓ బేబీ, యశోద లాంటి సినిమాలతో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. శాకుంతలం తర్వాత మరోసారి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలంటే, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.