రాజమౌళి, కార్తికేయ తండ్రికొడుకులు అనే విషయం అందరికీ తెలిసిందే. నిజానికి కార్తికేయ అసలు తండ్రి రాజమౌళి కాదు, కానీ చిన్నప్పట్నుంచి కార్తికేయను చూసుకోవడంతో, రాజమౌళికి కార్తికేయ బాగా దగ్గరయ్యాడు. అలా అమ్మను పెళ్లి చేసుకోకముందే, తను ఫాదర్ ఫిగర్ అయిపోయారని అన్నాడు.
“అప్పుడు నాకు 8 ఏళ్లు. ప్రతి రోజూ ఇంటికొచ్చేవాడు. నన్ను, అమ్మను డిన్నర్ కు తీసుకెళ్లేవాడు. కీరవాణి బ్రదర్ గా నాకు ముందు నుంచీ తెలుసు. అలా ఆ ఏడాదిలో నాకు ఆయన ఫాదర్ ఫిగర్ అయిపోయారు. ఒక్క రోజు ఇంటికి రాకపోయినా ఎందుకు రాలేదని అడిగేవాడ్ని. అంత క్లోజ్ నెస్ వచ్చేసింది. అప్పటికే నా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను.”
అమ్మ, రాజమౌళి పెళ్లి చేసుకున్న రోజు తనకు ఏదీ కొత్తగా అనిపించలేదంటున్నాడు కార్తికేయ. జరగాల్సింది ఇదే కదా అనే ఫీలింగ్ వచ్చిందన్నాడు. అంతేకాదు, పరిపూర్ణమైన కుటుంబం అనే భావన కూడా వచ్చిందంట.
“అమ్మతో పెళ్లికి ముందే బాబా (రాజమౌళి) నా తండ్రిగా నా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే కదా జరగాల్సింది అనిపించింది. పెళ్లి తర్వాత ఓ కంప్లీట్ ఫ్యామిలీ అనే ఫీలింగ్ వచ్చింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని నాకు చెప్పకముందు నుంచి మానసికంగా నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఇప్పటికీ రాజమౌళిని నాన్న అని పిలవను, బాబా అనే పిలుస్తాను. కానీ మైండ్ లో ఆయన నా తండ్రి.”
ఏ పని మొదలుపెట్టినా దాని అంతు చూడాలనే లక్షణాన్ని బాబా నుంచి నేర్చుకున్నానని తెలిపాడు కార్తికేయ. ఇప్పటికీ పొద్దున్న లేస్తే, దాన్నే గుర్తు చేసుకొని నిద్రలేస్తానని అంటున్నాడు.