మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇవాళ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వుండింది. ఈ మేరకు ఆదివారం కడప ఎంపీకి సీబీఐ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ పేర్కొంది. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ జరగనుంది. మరోవైపు సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి నిర్దేశిత సమయానికి వెళ్లినట్టు తెలిసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో సీబీఐ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఇవాళ్టి విచారణను రద్దు చేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాల్సిందిగా మరోసారి అవినాష్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
దీంతో సీబీఐ కార్యాలయం నుంచి అవినాష్‌రెడ్డి వెనుదిరిగినట్టు వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకుంది. విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అంటే మాత్రం పరిణామాలు మరో రకంగా వుంటాయి. ఒకవేళ అరెస్ట్ లాంటి దుందుడుకు చర్యలొద్దంటే వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. మరి ఏం జరుగుతుందో ఈ రోజు సాయంత్రానికి తేలనుంది.