ప్రతిపక్ష వాసంలో కూడా తెలుగుదేశం పార్టీ తెంపరితనం ఏ మాత్రం తగ్గుతున్నట్టుగా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లు తమకు నచ్చని రాజకీయ విషయాలను తమదైన రౌడీయిజంతో ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తూ ఉన్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించిందో ఆ పార్టీ వాళ్లే చెప్పుకున్నారు.
తమ రౌడీయిజం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్లు తమ అధినేతతో గొప్పగా చెప్పుకుంటూ వీడియోలకు చిక్కారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బెజవాడ రౌడీలా వ్యవహరించాడని తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమలో ఒకరిని అభినందించుకోవడం కూడా ఆ వీడియోలతో బయటపడింది. అతడు మంత్రులను కొట్టబోయినంత పని చేశాడని.. సహచరులు అభినందించారు!
ఇక మండలిలోనే తమ రౌడీయిజం గురించి తెలుగుదేశం పార్టీ అలా జబ్బలు చరుచుకోగా.. అమరావతి నిరసనలు అంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద దాడికి కూడా వెనుకాడకపోవడం గమనార్హం.
ముందుగా విప్ పిన్నెల్లి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఒక సామాజికవర్గం వారు దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ సురేష్ మీద అదే పార్టీకి చెందిన వారు, అదే సామాజికవర్గానికి చెందిన వాళ్లు దాడికి పాల్పడ్డారు. ఈ రెండు వ్యవహారాల్లోనూ ఒక సామాజికవర్గం వారి పేర్లు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.
ఈ దాడుల సంఘటనలను గమనిస్తే.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఆ సామాజికవర్గం వారు ఎంతలా రగిలిపోతున్నారో స్పష్టం అవుతోంది. అమరావతి విషయంలో ఇతర సామాజికవర్గాల్లో ఏ మాత్రం కించిత్ బాధలేకపోగా.. ఆ ఒక్క సామాజికవర్గం వారు మాత్రం.. ఆఖరికి ఎంపీలు, ఎమ్మెల్యేల మీద దాడికి కూడా వెనుకాడటం లేదని స్పష్టం అవుతూ ఉంది. అధికారంలో లేనప్పుడు తమ మాట చెల్లకపోవడంతో.. అత్యంత అసహనంతో ఇలా నిరసనల పేరుతో.. దాడులకు తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల సామాజికవర్గం తెగించడం గమనార్హం.