తనకు గిట్టని పాలకుడు వైఎస్ జగన్‌ను, వైసీపీ నాయకుల్ని విమర్శించే క్రమంలో పవన్‌కల్యాణ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు మద్దతు ఇవ్వడం, ఆంధ్రా మంత్రుల్ని తప్పు పట్టే క్రమంలో పవన్‌కల్యాణ్ కొత్త తలనొప్పి తెచ్చుకున్నారు. తద్వారా తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శనకు పెట్టినట్టైంది. అలాగే తెలంగాణ మంత్రికి వెన్నుదన్నుగా నిలబడడంతో కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఇచ్చారన్న ప్రచారానికి బలం కలిగిస్తోందనే వాదన పెద్ద ఎత్తున ముందుకొస్తోంది.
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే తన కొత్తపలుకు కాలమ్‌లో ఆంధ్రాలో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిస్తే రూ.1000 కోట్లు ఇస్తానని పవన్‌కు కేసీఆర్ ఆఫర్ పంపారని రాశారు. ఈ ఆఫర్ రాతలు రాజకీయంగా సంచలనం కలిగించాయి. తాజాగా హరీష్‌రావుకు పవన్ మద్దతుతో మరోసారి ఆర్కే చెప్పిన వెయ్యి కోట్ల ఆఫర్ నిజమే అన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
మంత్రి హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్‌ను కించపరిచేలా కామెంట్స్ చేయడంపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అవాకులు చెవాకులు పేలిన హరీష్‌రావును వదిలిపెట్టి, నోరు అదుపులో పెట్టుకోవాలని ఏపీ మంత్రులకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని ఆయన హితవు చెప్పడంపై వైసీపీ సీరియస్‌గా స్పందించింది.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ పవన్‌ను పొలిటికల్ బ్రోకర్‌గా అభివర్ణించారు. బాబు దత్త పుత్రుడు పవన్ టీడీపీని అధికారంలోకి తేవడం కోసం దేనికైనా తెగిస్తాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాల్సి దెబ్బ తీసినట్టుగా పవన్‌కల్యాణ్ వక్రీకరించి మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గు చేటన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏం చేశావని పవన్‌ను ఆయన నిలదీశారు. ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పవన్ మాట్లాడారన్నారు.
ఆంధ్రా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో పవన్ అడుగు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికి ఏం అర్హత వుందని పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లకు జగన్ కలలోకి వస్తున్నారన్నారు. బ్రోకర్‌లా కాకుండా రాజకీయ నాయకుడిగా మాట్లాడాలని హితవు చెప్పారు. ఇంత వరకూ కులాల మధ్య చిచ్చు పెట్టావన్నారు. ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చావా? అని అడపా శేషు ప్రశ్నించారు. కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆరోపణలు నిజమయ్యేలా పవన్ వ్యాఖ్యలున్నాయన్నారు.
పవన్‌కు ఇష్టమైన ఆర్కే ఇటీవల జనసేనానికి కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు రాసిన రాతల్ని ఆయన గుర్తు చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాకుండా వెయ్యి కోట్ల ఆఫర్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పవన్ తన అజ్ఞానంతో ప్యాకేజీ ఆరోపణల్ని నిజం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తనపై విమర్శలకు తానే కారణమన్న సంగతిని గుర్తించాలి.