సినిమాను త‌ల‌పిస్తున్న సీబీఐ మాజీ జేడీ తీరు!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌ప‌రం కాకుండా అడ్డుకునేందుకు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రిస్తామ‌ని ఇటీవ‌ల సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అన్న‌ట్టుగానే… ఆ ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. ఇందుకు అమ‌లాపురాన్ని వేదిక చేసుకున్న‌ట్టు ఆయ‌న…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌ప‌రం కాకుండా అడ్డుకునేందుకు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రిస్తామ‌ని ఇటీవ‌ల సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అన్న‌ట్టుగానే… ఆ ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. ఇందుకు అమ‌లాపురాన్ని వేదిక చేసుకున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అమ‌లాపురంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ …ఇక్క‌డి నుంచే విశాఖ స్టీల్ ప్లాంట్ క్రౌడ్ ఫండ్‌ను ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఏదైనా అమ‌లాపురం నుంచి ప్రారంభించాల‌ని అనుకునేవాడిన‌న్నారు. అందుకే ఇక్క‌డి నుంచే సంక‌ల్పించనున్న‌ట్టు ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. రాష్ట్రంలో 8.5 కోట్ల కుటుంబాలున్నాయ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ రూ.100 చొప్పున ఇవ్వ‌గ‌లిగితే నెల‌కు రూ.850 కోట్లు వ‌స్తాయ‌న్నారు. రూ.850 కోట్లు ఒక నాలుగు నెలలు ఇవ్వగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన చేతుల్లో ఉంటుందని ఆయ‌న తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ 100 రూపాయలు ఇవ్వాలని ఆయ‌న విన్న‌వించారు.

మంచి కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన‌ప్పుడు వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారన్నారు. ఏసీ రూములలోను, టీవీల ముందు చెప్పేవారు ఉంటారన్నారు. కానీ తాము మిట్టమధ్యాహ్నం నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రపంచంలోనే చరిత్ర సృష్టించ బోతున్నామని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 8.50 ల‌క్ష‌ల కుటుంబాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్న‌ట్టున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల‌నే త‌ప‌న ల‌క్ష్మీనారాయ‌ణకు ఉన్న‌ట్టు, అంద‌రికీ వుంటుంద‌ని అనుకోలేదు.

అంత భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం సామాన్య విష‌యం కాదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఊహ‌ల‌తో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవ‌డ‌మే సాధ్య‌మేనా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అంతా సినిమాలో మాదిరిగా ప్ర‌జ‌ల నుంచి ఫండ్ వ‌సూలు చేస్తామ‌ని చెబుతున్నార‌ని, ఆచ‌ర‌ణ‌లో సాధ్యాసాధ్యాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. 

సినిమాల్లో అయితే ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పింది సాధ్య‌మ‌వుతుంద‌ని, నాయ‌కులు అప్పీల్ చేస్తే జ‌నం ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే ప‌రిస్థితి లేద‌నే వాళ్లే ఎక్కువ‌.