వైఎస్ అవినాష్ ఆఖ‌రి పోరాటం

మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో అరెస్ట్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆఖ‌రి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీబీఐ విచార‌ణ‌కు ఆయ‌న…

మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో అరెస్ట్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆఖ‌రి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీబీఐ విచార‌ణ‌కు ఆయ‌న హాజ‌రు కావాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలంగాణ హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేయ‌డం విశేషం. ఈ పిటిష‌న్ 2.30 గంట‌ల‌కు విచార‌ణ‌కు రానుంది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పు కోసం అవినాష్ ఎదురు చూస్తారా? లేక సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రవుతారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

లంచ్ మోష‌న్ పిటిష‌న్‌లో కుట్ర కోణాన్ని ప్ర‌ధానంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇందులో చంద్ర‌బాబు పాత్ర‌ను కూడా అవినాష్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అలాగే వివేకా వివాహేత‌ర సంబంధాలే హ‌త్య‌కు దారి తీశాయ‌ని బ‌లంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. త‌న‌కే పాపం తెలియ‌ద‌ని ఆయ‌న గ‌ట్టిగా చెబుతున్నారు.  

వివేక కూతురు సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీబీఐ విచార‌ణాధికారి కుమ్మక్క‌య్యార‌ని పిటిష‌న్‌లో ఆరోపించారు. వీళ్లంతా కుట్ర‌ప‌న్ని త‌న‌ను ఇరికిస్తున్నారని అవినాష్‌రెడ్డి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. కేవలం గూగుల్ టే కౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. వివేకా హ‌త్య‌లో త‌న ప్ర‌మేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేవ‌లం అప్రూవ‌ర్‌గా మారిన నిందితుడు దస్తగిరి స్టేట్మెంట్‌ను మాత్ర‌మే సీబీఐ ప్రామాణికంగా తీసుకుంద‌న్నారు.

వివేకా తన రెండో భార్యతో ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ఉండటంతో సునీత కక్ష గ‌ట్టిన‌ట్టు అవినాష్‌రెడ్డి తెలిపారు. వివేకా చెక్ పవర్‌ను సునీత తొలగించారని ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అలాగే బెంగుళూరులో వివేకా ల్యాండ్ సెటిల్మెంట్స్, నిందితులతో కలిసి డైమండ్స్ వ్యాపారం చేశార‌ని పేర్కొన్నారు. మ‌రీ ముఖ్యంగా ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధం ఉంద‌ని, అదే హ‌త్య‌కు దారి తీసింద‌ని పిటిష‌న్‌లో అవినాష్‌రెడ్డి ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. 

త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని ఆయ‌న న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు. మ‌రి హైకోర్తు ఎలా స్పందిస్తుందో చూడాలి. కాసేప‌ట్లో సీబీఐ విచార‌ణ మొద‌లు కానున్న ప‌రిస్థితిలో అవినాష్‌రెడ్డి న్యాయ పోరాటం ఉత్కంఠ రేపుతోంది.