ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అంచనాలకు భిన్నంగా వస్తున్న ఫలితాలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠతతో జరుగుతున్న మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ వినోదాన్ని అందిస్తున్నాయి. కేకేఆర్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో రింకూ సింగ్ ఐదు సిక్సర్లతో రెచ్చిపోయిన వైనం ఈ సీజన్ కే హైలెట్ నిలవొచ్చు. ఇక ఆర్సీబీ పై లక్నో జట్టు రెండు వందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం కూడా మరో ఆసక్తిదాయకమైన మ్యాచ్. ఈ సీజన్లో కొన్ని వన్ సైడెడ్ మ్యాచ్ లు ఉన్నప్పటికీ, ఇలాంటి ఆసక్తిదాయకమైన మ్యాచ్ లు లీగ్ పై ఆసక్తిని కొనసాగిస్తూ ఉన్నాయి.
ఒక ఈ సీజన్ లో సత్తా చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఆర్సీబీ జట్టు అనూహ్య పరాజయాలతో ఫ్యాన్స్ ను ఏడిపిస్తూ ఉంది. ప్రతిసారీ సీజన్ ను ఘనంగా ప్రారంభించే నేపథ్యం ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా ఘనంగానే ఆరంభించింది. తొలి మ్యాచ్ ఫలితంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్సాహవంతులయ్యారు. ఇక లక్నో మ్యాచ్ లో కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లో ముందుగా అదరగొట్టింది. ముగ్గురు ప్రధాన బ్యాట్స్ మెన్ రాణించడంతో భారీ స్కోరునే చేసింది. బౌలింగ్ లో కూడా తొలి ఓవర్లలో మ్యాచ్ ను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకున్నట్టుగా కనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో ఆ జట్టు ఓటమి పాలైంది. ఓడిపోయినట్టే అనుకున్న లక్నో జట్టు విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానులు మరోసారి ఖిన్నులయ్యారు.
తమ జట్టు బాగా రాణిస్తోందని ఆనంద పడుతున్న తరుణంలోనే వారికి ఆ మ్యాచ్ ఫలితం నిరాశగా మిగిలింది. అయితే ఆర్సీబీ అవకాశాలు అప్పుడే అయిపోలేదు. కానీ, ఇన్ని సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా చాంఫియన్ గా నిలిచిన జట్టు కాకపోవడంతో.. ఈ సారి అయినా ఆ ముచ్చట తీరుతుందని ఈ సాలా కప్ నమదే గురూ అంటూ పాటలు పాడుకుంటున్న ఆర్సీబీ అభిమానులకు ఈ సారి అయినా ఆ కల తీరుతుందా అనేది మాత్రం మిస్టరీనే!
లక్నోతో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ అభిమానులు కొందరు స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుని తమ బాధను వ్యక్తం చేశారు! ఫస్ట్ సీజన్ నుంచి పోటీలోనే ఉన్నా… ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోవడం ఆర్సీబీ ఫ్యాన్స్ కు లోటుగా మిగిలింది. పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు. అయినా ఎక్కడో ఇంకా అభిమానులకు పూర్తి ధీమా అయితే లేదు. తమ జట్టు గెలిచి ట్రోఫీని అందుకునే వరకూ ఆర్సీబీ అభిమానులు ఈ విషయంలో దేన్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు. వారి అనుభవాలు అలా ఉన్నాయి మరి! ఈ సారి అయినా అభిమానుల ఆకాంక్షను నిలబెట్టడంపై కొహ్లీ అండ్ కో పై చాలా ఆశలే ఉన్నట్టున్నాయి.
ఇక ఒక దశలో ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలో మంచి బ్యాలెన్స్ పాటించిన హైదరాబాద్ యాజమాన్యం ఆ తర్వాత అలాంటి సత్తా ఏదీ చూపలేకపోతోంది. వార్నర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతి సారీ హాట్ ఫేవరెట్ అన్నట్టుగానే బరిలోకి దిగేది. అదే ఊపులో 2016లో ఐపీఎల్ విజేతగా కూడా నిలిచింది. అనూహ్య విజయాలు, సంచలన విజయాలతో ఎస్ఆర్హెచ్ అప్పట్లో అదరగొట్టేది. వార్నర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ వంటి వారి రాణింపుతో ఎస్ఆర్హెచ్ అదరగొట్టేది. అయితే ఎస్ఆర్హెచ్ కు ఆ వైభవం లేదిప్పుడు. 2016, 2017 సీజన్లలో ఆ జట్టు రాణింపు ఇప్పుడు లేదు. ఇప్పుడప్పుడే అలా రాణిస్తుందనే అంచనాలు కూడా సన్ జట్టుపై లేకపోవడం గమనార్హం.
అలాగే స్థానికంగా లెస్ సపోర్ట్ ను కలిగి ఉన్న జట్టు కూడా ఎస్ఆర్హెచ్ కాబోలు. ఈ జట్టును అభిమానించే వారు బాగానే ఉన్నా.. తెలుగు నాట ఉన్న క్రికెట్ అభిమానులు చెన్నై, బెంగళూరు జట్లనే అధికంగా అభిమానిస్తూ ఉందారు. అలాగే ముంబై జట్టుకు కు కూడా తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. హైదరాబాద్ బేస్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ కు ఉండాల్సినంత ఫ్యాన్ బేస్ లేదు.
ధోనీ దీర్ఘకాలంగా కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉండటం వల్ల చెన్నై జట్టుకు తగని ఆదరణ ఉంది. అలాగే తమిళ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చెన్నైను అమితంగా అభిమానిస్తారు. కన్నడీగులకు ఆర్సీబీ అంటే పిచ్చి. అలాగే కొహ్లీ ఆ జట్టుకు ఆడుతుండటం వల్ల కూడా ఆ జట్టుకు మిగతా దేశ వ్యాప్తంగా ఆదరణ ఉంది. రోహిత్ స్టార్ డమ్ ముంబైకి అభిమానగణాన్ని పెంచింది. ఇలా టీమిండియా ప్రధాన ఆటగాళ్ల వల్ల ఆ మూడు జట్లకూ అదనపు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ లోటుతో ఉన్న జట్లు కేవలం స్థానిక ఫ్యాన్ ఫాలోయింగ్ నే కలిగి ఉంటున్నాయి.
-హిమ