జ‌గ‌న్ స‌ర్కార్ దెబ్బ‌తో దిగొచ్చిన‌…!

దేవునికైనా దెబ్బే గురువు అనే చందంగా ఏపీ స‌ర్కార్ సీరియ‌స్ కావ‌డంతో ట్రెజ‌రీ ఉద్యోగులు దారికొచ్చారు. నిన్న‌టి వ‌ర‌కూ కొత్త పీఆర్సీ ప్ర‌కారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేసేందుకు స‌సేమిరా అంటూ వ‌చ్చిన ట్రెజ‌రీ…

దేవునికైనా దెబ్బే గురువు అనే చందంగా ఏపీ స‌ర్కార్ సీరియ‌స్ కావ‌డంతో ట్రెజ‌రీ ఉద్యోగులు దారికొచ్చారు. నిన్న‌టి వ‌ర‌కూ కొత్త పీఆర్సీ ప్ర‌కారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేసేందుకు స‌సేమిరా అంటూ వ‌చ్చిన ట్రెజ‌రీ ఉద్యోగులు, డీడీవోలు సెల‌వు రోజు కూడా ప‌ని చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

కొత్త పీఆర్సీని ఉద్యోగులు వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న పీఆర్సీకి వ్య‌తిరేకంగా ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో కొత్త పీఆర్సీ ప్ర‌కార‌మే వేత‌నాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల వేత‌నాల‌కు సంబంధించి బిల్లులు ప్రాసెస్ చేయాల‌ని ప్ర‌భుత్వం ట్రెజ‌రీ ఉద్యోగుల‌ను ఆదేశించింది. అయితే ప్రాసెస్ చేసేందుకు ట్రెజ‌రీ, డీడీవోలు మొండికేశారు. దీంతో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా స్పందించింది. 

త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించి క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల్లోపు కొత్త పీఆర్సీ ప్ర‌కారం ఉద్యోగుల వేత‌నాలు ప్రాసెస్ చేయాల‌ని ప్ర‌భుత్వం డెడ్‌లైన్ విధించింది. డెడ్‌లైన్‌ లోపు తమ ఆదేశాలు పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీటీఏ, పీఏవో, జిల్లా కలెక్టర్లను ఆర్థిక‌శాఖ ఉన్న‌తాధికారులు ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలో ట్రెజ‌రీ, డీడీవోలు ఆదివారం సెల‌వు రోజు కూడా విధుల‌కు హాజ‌రై బిల్లులు ప్రాసెస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొద‌టి ప్రాధాన్యం కింద జ‌డ్జిలు, పోలీసులు, మున్సిప‌ల్ ఉద్యోగుల వేతనాల‌కు సంబంధించి బిల్లుల‌ను 11వ పీఆర్సీ ప్ర‌కారం ప్రాసెస్ చేశారు. 

పెన్షనర్ల బిల్లులను ఇప్పటికే ప్రాసెస్ అయింది. ఆ త‌ర్వాత ప్రాధాన్యం కింద మిగిలిన విభాగాల ఉద్యోగుల వేత‌నాల బిల్లుల‌ను ప్రాసెస్ చేస్తున్నార‌ని స‌మాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజ‌రీ కార్యాల‌యాల్లో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘించిన జాబితాలో ఉన్న‌ట్టు స‌మాచారం.