బస్సు చక్రాలు ఆగితే మాత్రం జగన్ ఆలోచించాల్సిందే..!

జనం అమాయకులేం కాదు, ఏం కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో వారికి బాగా తెలుసు. ఉచితాలే బతికిస్తాయనుకుంటే.. తమిళనాడులో ఐదేళ్లకోసారి అధికారం మారేది కాదు. మరిప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటి..? జగన్ సంక్షేమ…

జనం అమాయకులేం కాదు, ఏం కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో వారికి బాగా తెలుసు. ఉచితాలే బతికిస్తాయనుకుంటే.. తమిళనాడులో ఐదేళ్లకోసారి అధికారం మారేది కాదు. మరిప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటి..? జగన్ సంక్షేమ పథకాలపైనే గట్టి నమ్మకం పెట్టుకున్నారు. జనం తన వెంటే అనుకుంటున్నారు. ఉద్యోగులు సమ్మెకు దిగినా, జనం దీవెనలు తనకున్నాయి కదా అని అనుకుంటున్నారు. మరి జనం ఏమనుకుంటున్నారో జగన్ కి తెలుసా..?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకున్న జగన్ ని ఉద్యోగులు గుర్తు పెట్టుకున్నారా..? పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు సై అంటున్నారు. తమకు అంత మేలు చేసిన జగన్ ని ధిక్కరించి వారు సమ్మెకు పోతారా..? నిజంగానే బస్సు చక్రం ఆగితే మాత్రం జగన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులే అర్థం చేసుకోలేనప్పుడు, రేపు సామాన్య ప్రజలు మాత్రం సంక్షేమ పథకాలను అర్థం చేసుకుంటారా..? తనకు మద్దతుగా నిలుస్తారా..? ఓసారి జగన్ ఆలోచిస్తే మంచిది.

ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందనే మాట వాస్తవం. అదే సమయంలో నవరత్నాలతో తలకు మించిన భారం మీదేసుకున్నారు జగన్. ఎక్కడా ఏ కార్యక్రమం ఆగకుండా కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగులు పీఆర్సీ కావాలి, జీతాలు పెంచాలి అంటున్నారు. భారీగా పెంచలేం కానీ, ప్రస్తుతానికి కొంత పెంచుతున్నాం సర్దుకోండి అన్నారు జగన్. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మేం బాగుంటే చాలనుకుంటున్నారు ఉద్యోగులు. ఈ దశలో జగన్ జనం వైపే నిలబడాలని నిశ్చయించుకున్నారు.

ఉద్యోగులంటే ఏమనుకున్నారు, మా వెనక లక్షలమంది కుటుంబ సభ్యులున్నారు. పీఆర్సీకి ఊ అంటే ఉంటావ్.. ఊఊ అంటే ఊడిపోతావ్.. అంటూ మహిళా ఉద్యోగులు కూడా శాపనార్థాలు పెడుతున్నారు. ఈ దశలో ఉద్యోగుల ఓట్ల కోసం ఆశపడే ఎవరైనా సంక్షేమ పథకాలు పక్కనపెట్టి వారిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ జగన్ అలా చేయలేదు. ఉద్యోగులకు విలన్ గా మారినా పర్లేదు,  సామాన్య ప్రజల గుండెల్లో దేవుడిలా ఉండాలనుకుంటున్నారు.

జగన్ నిర్ణయం కరెక్టేనా..?

జగన్ కి జనం అంటే పిచ్చి, వారి కోసం ఎందాకైనా అంటారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. మరి అదే కృతజ్ఞతా భావం జనంలో కూడా ఉంటుందా..? చివరి వరకూ జనం కూడా జగన్ వైపే ఉంటారా అనేది ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే.. 27శాతం ఐఆర్ ప్రకటించినప్పుడు జగన్ దేవుడన్న నోళ్లే ఇప్పుడు దెయ్యం అంటున్నాయి. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు పాలాభిషేకాలు చేసిన చేతులే.. రేపు 7 నుంచి సమ్మెకు దిగుతామంటున్నాయి. నిరుద్యోగులకు సచివాలయం పోస్ట్ లు ఇచ్చినప్పుడు జగన్ ని ఆకాశానికెత్తేసిన ఉద్యోగులే.. రెండు నెలలు ప్రొబేషన్ ఆలస్యం అయితే నల్లబ్యాడ్జీలు జేబులకి తగిలించుకున్నాయి.

ఏం చేసినా, ఎంత చేసినా.. ఇంకా ఏదో కావాలనే ఆశ ఉద్యోగుల్లోనూ, జనంలోనూ సజీవంగా ఉంటుంది. దాన్ని తృప్తిపరిచే క్రమంలో నాయకుడు విఫలం అయితే అప్పటి వరకూ చేసిన మంచి చెరిగిపోతుంది. మొత్తం గాల్లో కలిసిపోతుంది. మరి జగన్ ఈ కోణంలో ఆలోచిస్తున్నారా? అసలు విషయాన్ని ముందే గ్రహిస్తారా?