సిబిఐ జాయింటు డైరక్టరుగా పని చేసిన లక్ష్మీనారాయణ గారి అమాయకత్వం చూస్తే నవ్వు, ఆశ్చర్యం రెండూ కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి పూర్తికాలం రాజకీయాలకు అంకితం అవుతానంటే యీయన నమ్మారట. పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతున్నానని చెపితే హతాశులై ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నారట! పవన్ సినిమాలు మానేసి ఉండగలరని ఆయన ఎలా అనుకున్నారో అడగాలని ఉంది. పవన్ తన లేఖలో చెప్పినట్లు అతనికి జగన్‌లా పవర్ ప్రాజెక్టులు లేవు, సిమెంటు ఫ్యాక్టరీలు లేవు, దినపత్రికలు, టీవీ ఛానెళ్లు లేవు. చంద్రబాబులా డెయిరీ యిండస్ట్రీ లేదు. పోనీ లక్ష్మీనారాయణ గారిలా నెలసరి పెన్షనూ లేదు. పిల్లలింకా ఎక్కి రాలేదు. కుటుంబ బాధ్యతలున్నాయి. ఇలాటి ఆయన తనను తాను ఎలా పోషించుకుంటాడు? పార్టీని ఎలా బతికించుకుంటాడు? ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా!
ఎన్నికల సమయంలో పవన్ యిచ్చిన అఫిడవిట్ చూడండి. 17.50 కోట్ల అప్పులున్నాయి. కొన్ని సినిమా కంపెనీల (త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక-హాసిని, శ్రీ బాలాజీ మీడియా, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర) వద్ద తీసుకున్న 6 కోట్ల ఋణాన్ని లయబిలిటీ కింద చూపించారా లేదా? అవి ఎలా తీరుస్తారు? వాళ్లు డబ్బిచ్చినది వడ్డీ కోసం కాదు, యీయన వచ్చి వేషాలు వేస్తాడని! ఎవరైనా యిండస్ట్రియలిస్టు అయితే నా బదులు మా పిఏను పంపిస్తాను, మా ఆడిటర్‌ను పంపిస్తాను, అతనే వచ్చి నా తరఫున పని చేసిపెడతాడు అనవచ్చు. కానీ ఓ సినిమా యాక్టరు అలా అనగలడా? ఎన్ని కోట్లు సంపాదించినా 'ఇవాళ నాకు ఆయాసంగా ఉంది, పరిగెట్టలేను, డాన్సు చేయలేను, మా సెక్రటరీ వచ్చి చేస్తాడు' అంటే కుదురుతుందా? తనే స్వయంగా ఓపిక చేసుకుని ఆడాలి, పాడాలి, దెబ్బలాడాలి, ప్రేమించాలి. ఇవన్నీ నాలుగు గోడల (సారీ, మూడు గోడల) మధ్యనే కాదు, ఎండలో, వానలో, మంచులో, కొండల్లో, గుట్టల్లో…!
ఇవన్నీ చేస్తాడు కదాని డబ్బిచ్చినవాళ్లు యీయన కాకుండా వేరే వాళ్లు చేస్తారంటే ఒప్పుకుంటారా? ఈయనే చేసి తీరాలంటారు. అందువలన అఫిడవిట్ చూడగానే అర్థమైంది – పవన్ ఒక కాలు సినిమా పడవలో వేసే ఉంచారని. ఎన్టీయార్ అయితే తన ఎసైన్‌మెంట్‌లు పూర్తి చేసుకుని, సినిమా తెప్పలు తగలేసుకుని, ప్రజాజీవితంలోకి వచ్చారు. వచ్చాక మళ్లీ దురద పుట్టి, పుట్టి మునిగిందనుకోండి, అది వేరే విషయం. పవన్‌కు సినిమాలకు టాటా చెప్పే ఉద్దేశం లేదు. ఉండి వుంటే ముందస్తు ఏర్పాట్లు ఎప్పుడో చేసుకునే వారు. ఎందుకంటే అంతకుముందు ఐదేళ్లగా ఆయన పార్టీ పెట్టి వున్నారు. రెండు పార్టీలను గెలిపించిన ఖ్యాతి పొంది ఉన్నారు. ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు స్పందిస్తున్నారు, స్వయంగా వెళ్లి బాధితులను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రితో సమావేశమౌతూ మంచీచెడ్డా మాట్లాడుతూన్నారు.
2019లో ఎన్నికలు వస్తాయని ఐదేళ్ల క్రితమే తెలుసు. సొంతంగానో, భాగస్వామిగానో తన పార్టీ పోటీ చేస్తుందని తెలుసు. తను కింగో, కింగ్‌మేకరో అయ్యే అవకాశం ఉందని తెలుసు. కర్మ కాలి రెండూ కాకపోయినా 25, 30 సీట్లతో ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ, అసెంబ్లీకి హాజరవుతూ, తన పార్టీకి దిశానిర్దేశం చేస్తూ, వచ్చేసారి అధికారం మనదే అని క్యాడర్‌ను ఉత్సాహపరుస్తూ, రాష్ట్రంలో పాదయాత్రలూ, నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులూ చేస్తూ ప్రజలను యింప్రెస్ చేస్తూ, అతి క్లిష్టమైన, ఓ పట్టాన అర్థం కాని ద్రాక్షాపాకం లాటి తన ఆలోచనామృతాన్ని మేధావులకు అర్థమయ్యే స్థాయికి డైల్యూట్ చేసి పంచడానికి సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ప్రజల మధ్య ఉండాలని తెలుసు. ప్రజల్లో ఉంటే పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా ఎవరో ఒకరు వచ్చి కలుస్తూనే ఉంటారని తెలుసు. వాళ్ల యిళ్లల్లో పెళ్లిళ్లకు, చావులకు, సమర్తలకు, సీమంతాలకు వెళ్లాలని తెలుసు.
వీటి మధ్య సినిమాలకు సమయం కేటాయించడం అసాధ్యం అని తెలుసు. అందువలన కనీసం రెండేళ్లు ముందుగా ప్లాన్ చేసి, సినిమాలు అవగొట్టుకోవాలని తెలుసు. ఎప్పుడో తీసుకున్న అడ్వాన్సు లైతే సినిమాలు చేయలేనని చెప్పేసి, వాటిని తిరిగిచ్చేసి ఎక్కవుంటు సెటిల్ చేసుకోవాలని తెలుసు. అయినా ఆయన అడ్వాన్సులు తిరక్కొట్టకుండా తన దగ్గరే ఉంచుకున్నారంటే దాని అర్థమేమిటి? 'మీరు నాకు విజయం చేకూర్చకపోయినచో దొడ్డిదారి తెరిచియే ఉన్నది సుమా' అని ప్రజలకు స్పష్టంగా చెప్పినట్లే కదా! (మీరు ఆ దారిలోనే శోభిస్తారు అని సంకేతం యివ్వడానికి ప్రజలు పోటీ చేసిన రెండు చోట్లా ఆయన్ని ఓడించి, ఆయన అభ్యర్థులందరినీ – ఒక్కరిని తప్ప – తిరస్కరించి తాము చెప్పాల్సింది తాము చెప్పేశారు).
చిన్నప్పటినుంచీ డిటెక్టివ్ నవలలు చదవడం చేత, యిప్పుడు ఇంగ్లీషు క్రైమ్ సీరియల్స్ తరచుగా చూడడం వలన నాకు పోలీసుల గ్రహణశక్తి మీద అపారమైన నమ్మకం. అవతలివాడు చెప్పనిది కూడా వీళ్లు చులాగ్గా గ్రహించేస్తారని, కళ్లలోకి చూసి మనిషి ఎలాటివాడో కనుక్కుంటారని, వాడు కళ్లు దించుకున్నా, తేరిపార చూసి, మనసు పొరల్లోకి తొంగిచూసి నిజానిజాల నిగ్గు తేలుస్తారని అనుకుంటాను. అందుకే పోలీసులంటే భక్తి, భయం రెండూ ఉన్నాయి. సిబిఐ వంటి సంస్థకు జాయింటు డైరక్టరుగా పని చేసిన లక్ష్మీనారాయణ గారు పవన్ విషయంలో ఎలా బోల్తా పడ్డారో నాకు యిప్పటికీ అర్థం కావటం లేదు. పైన చెప్పిన అఫిడవిట్ ఉత్తుత్తి దనుకున్నారా? ఆయన అనవచ్చు – పవన్ పబ్లిక్ మీటింగుల్లో చెప్పిన మాటలు నేను నమ్మాను అని. 'నేను సినిమాలు మానేసి వచ్చాను. ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. నాకు పూట గడవకపోతే మీ యింటికి వస్తే యింత ముద్ద పెడతారు కదా' అని బహిరంగసభలో ఆయన అభిమానులను అడిగారు, నిజమే. వాళ్లూ 'తప్పకుండా అన్నా' అన్నారు. అదీ నిజమే. అది ఒక ఎమోషనల్ బాండింగ్.
అంతమాత్రాన యింత బతుకూ బతికి యీయన నిజంగా యాయవారం కోసం వాళ్లింటికి వెళతాడని, వాళ్లు యీయనికి యింత కబళం పడేస్తే దానితో సరిపెట్టుకోగలుగుతాడనీ అనుకోగలమా? ఆయన తిన్నా ఆయన రష్యన్ భార్యకు మన తిళ్లు సయిస్తాయా? పిల్లల అలవాట్లు ఏమిటో మరి! తన బీదభక్తుల భక్తితీవ్రతను భగవంతుడు అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకునే సమయంలో బక్కబాపడి వేషంలో వచ్చి ఆకలితో చస్తున్నా, అన్నం పెట్టు అంటాడు. పదనాలుగు భువనాలను తన కుక్షిలో దాచుకున్న ఆ దేవదేవుడికి యీ ముద్ద పట్టే చోటుంటుందా? అయినా అదో సరదా, ఓ చిన్న టెస్టు. భక్తుడు 'అంతకంటేనా, యిదిగో ముద్ద' అనగానే దేవుడు తింటాడా? ఠక్కున అసలు వేషంలో ప్రత్యక్షమై యివిగో తరతరాలకు తరగని సిరిసంపదలు అని యిచ్చి వెళతాడు. భక్తుడు ఖుష్. ఇలాటి భక్తులున్నందుకు భగవంతుడూ ఖుష్. అలాగే 'నీ కోసం ప్రాణాలు యిస్తా, నిన్ను ముఖ్యమంత్రిగా చూడడానికే బతికి వున్నా' అనే వీరాభిమానులకు ఓ చిన్న టెస్టు పెట్టారు పవన్. వాళ్లు పాస్ అయ్యారు. అంతమాత్రం చేత తను రికామీగా, ఏ పనీ చేయకుండా రోజంతా కాలక్షేపం చేసి భోజనం వేళకు వాళ్లిళ్లకు వెళ్లి కడుపునిండా భోజనం చేసేద్దామనే దురూహ ఆయనకు ఎంతమాత్రం లేదు.
పవన్‌తో జరిగిన ఆంతరంగిక సమావేశాల్లో లక్ష్మీనారాయణ గారు సన్నిహితంగా కూర్చుని తన చూపులతో పవన్‌ను స్టడీ చేసి ఉంటారు. ఎంత గుబురు గడ్డమైనా, కళ్లను కప్పేయలేదు కదా, బాడీ లాంగ్వేజ్‌ను దాచేయలేదు కదా! కావాలంటే తన అసలు భావాలను మరుగుపరుచుకుని, పైకి మరోలా నటించగల నటనాచాతుర్యం పవన్‌కు ఉంది నిజమే, కానీ లక్ష్మీనారాయణగారు తక్కువవారేం కాదు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టడం చిన్నప్పుడే నేర్చుకుని, ఎంతోమంది మాఫియా వాళ్లపై సాధన చేసిన మనిషి. మరి అలాటాయన సినిమాలు మానేసే విషయంలో పవన్ ఆంతర్యాన్ని గమనించ లేకపోయారంటే పవన్ మనం అనుకున్న దాని కన్నా మహానటుడై ఉండాలి, లక్ష్మీనారాయణ గారు మనం అనుకున్నంత నిపుణుడు కాకుండానైనా ఉండాలి.
అంటే బాగోదేమో కానీ, జగన్ విషయంలో కూడా యీయన యిలాగే తబ్బిబ్బు పడ్డారేమోనని అనుమానం. జగన్‌ను ఎంత శోధించినా, సాధించినా విషయాలు రాబట్టలేక పోయారనుకుంటా. దొరికిన వాటితో సరిపెట్టుకుని కేసులు బనాయిస్తే అవి కోర్టు వారికి కన్విన్సింగ్‌గా తోచటం లేదు. అప్పట్లో యీయన చాలా కనిపెట్టేశారని మురిసి, ముక్కలైన వాళ్లం యిప్పుడు ఎక్కడో తేడా కొట్టిందనుకుంటున్నాం. ప్రభుత్వం నుండి వచ్చిన దాని కంటె జగన్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినది ఎక్కువ అయినపుడు క్విడ్ ప్రో కో అనీ, అధికార దుర్వినియోగం అనీ ఎలా అంటారు అని కోర్టు అడుగుతూంటే, నిజమేస్మీ అనిపిస్తోంది యిప్పుడు. ఈయన కటౌట్లకు క్షీరాభిషేకం చేసేటప్పుడు యిది మనకు తట్టలేదేం అనిపిస్తోంది. ఏదీ, ఓ పక్క మీడియా ఊదరగొట్టేస్తూంటే ఏం తోస్తుంది?
మనిషన్నాక పొరపాట్లు సహజం. ఎంత తెలివి ఉన్నా ఒక్కోప్పుడు అక్కరకు రాదు, బుర్ర షికారెళుతుంది. ఎన్నికలకు ముందు పవన్‌ను సరిగ్గా ఎసెస్ చేయలేక పార్టీలో చేరడం, దాని తరఫున ఏకంగా పార్లమెంటు స్థానానికే పోటీ చేయడం అన్నీ జరిగిపోయాయి. నాయకుడే ఓడాడు కాబట్టి తను ఓడడం పరువునష్టమనుకుని బాధ పడనక్కరలేదు. లింగులింగుమని పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మేల్యే ఎటుంటాడో తెలియకుండా పోయింది. పార్టీ అధినేత, ఆయనా సంప్రదించుకోరు, మాట్లాడరు. ఎడమొగం, పెడమొగం. మళ్లీ ఐదేళ్ల దాకా ముఖ్యమంత్రి పదవిని ఆశించే పరిస్థితి లేదు. మధ్యలో స్థానిక ఎన్నికలు వచ్చినా పవన్ స్థాయి పదవి అక్కడ ఎలా ఉంటుంది? ఏదో ఒక జిల్లా పరిషత్‌కు చైర్మన్ అయ్యాను అంటే దర్జా తగ్గిపోదూ? వచ్చే ఐదేళ్లూ పవన్ ఏం చేయాలని లక్ష్మీనారాయణ గారు అనుకుంటున్నారో చెప్పమనండి చూదాం.
మనిషన్నాక వ్యాపకం, కాలక్షేపం ఉండాలి, పైగా పవన్ యింకా రిటైర్ కాలేదు. తన వృత్తిలోనే ఉన్నారు. ఆయన ఓటు బ్యాంకు ప్రధానంగా అభిమానులే. ఆయన కులం అనుకున్నారు కానీ కాదని మొన్నటి ఓటింగు శాతం తేల్చేసింది. అభిమానులను అలరించ గలిగేది సినిమాలే. ఉద్దానం, అమరావతి భూములు వంటి అంశాలు కాదు. మరిన్ని సినిమాలు వేయడం ద్వారా తన ఓటు బ్యాంకును పవన్ పెంచుకుంటున్నారు. అందుకే గతంలో లేని విధంగా చాలా సినిమాలు ఒక్కసారిగా మొదలుపెట్టారు. అఫిడవిట్‌లో పేర్కొన్న నిర్మాణ సంస్థల సంగతి అలా ఉండగానే కొత్తగా దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఎఎం రత్నం సినిమాలు చేస్తున్నారు. ఎక్కువమంది అభిమానులను సంపాదించుకోవడానికే కదా! అలా ఆయన ఓటు బ్యాంకు పెరిగితే ఆ పార్టీలో ఉన్న లక్ష్మీనారాయణ వంటి వారికి లాభమే కదా. అర్థం చేసుకోరూ..!
పైగా డబ్బు అవసరం కూడా ఉంటుంది. ఇదివరకైతే పవన్ 'నేను లేస్తే మనిషిని కాను' అంటూంటే భయపడి అవతలివాళ్లు ప్రత్యేక విమానాల్లో తిప్పేవారు, భారీ సభలూ అవీ ఏర్పాటు చేసేవారు. 2019లో పవన్ లేచి చూపించేయడంతో వాళ్లకు భయం పోయింది. ఇకపై యీయన సొంత డబ్బే పెట్టుకుని తిరగాలి. 2024లో పార్టీ టిక్కెట్టు ఆశించేవాళ్లు సభలకూ వాటికీ పెట్టుబడి పెడతారేమో అనుకుందామంటే జనసేన-బిజెపి పొత్తుల్లో మన నియోజకవర్గం టిక్కెట్టు మనకిస్తారో, బిజెపికి ధారాదత్తం చేస్తారో అనే బెరుకు ఉంటుంది కదా! పవన్ కుటుంబం చిన్నదేమీ కాదు, సొంత ఖర్చులుంటాయి. ఒక స్థాయి మేన్‌టేన్ చేసే బాధ్యత ఉంటుంది. మనలా మిడిమిడి మిడిల్ క్లాసు బతుకులా సర్దుకుపోదామంటే కుదరదు, పబ్లిక్ ఒప్పరు. తనపై యింకా అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పైగా అమరావతిలో శంకుస్థాపన చేసిన యిల్లు పూర్తి చేయాలి. తనకు, తన కుటుంబానికి పోగా, మీలాటి నిజాయితీపరులైన అభ్యర్థులకు ఎన్నికల వేళ నిధులు అంతోయింతో యివ్వాలి.
ఇలా ఆలోచిస్తే పవన్ సినిమాల్లోకి వెళ్లడం ఏ మాత్రం తప్పుగా తోచదు. లక్ష్మీనారాయణగారు అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరం. అయినా బిజెపితో పొత్తు పెట్టుకున్నపుడే ఆయన గ్రహించి ఉండాల్సింది. తన పార్టీ బోగీని బిజెపి యింజన్‌కు తగిలించేసి, తను వేరే పని చూసుకుంటున్నారని. ఈ రాజీనామా అప్పుడే చేసి ఉండాల్సింది. అప్పుడు ఆగి, యిప్పుడు సినిమా మొదలుపెట్టిన ముహూర్తాన, పెళ్లి కూతురు అత్తవారి గడప తొక్కినపుడు తుమ్మినట్లు, రాజీనామా లేఖను బహిరంగంగా విడుదల చేయడం భావ్యం కాదు. పెద్దాయన, నిజాయితీపరుడిగా పేరున్నవాడు, మేధావి వర్గాలకు చెందినవాడు, జీవనవిధానం, ఆలోచనాసరళి ఎలా ఉండాలో పదిమందికి పాఠాలు చెప్పే ఆయన గురించి ఏమనగలం? స్వతహాగా అమాయకుడని అనుకుని సరిపెట్టుకోవడం తప్ప!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)
[email protected]