వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి లాయర్ అవతారం ఎత్తారు. ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించనున్న సంగతి తెలిసిందే. వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.
వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం, మరోవైపు నేడో, రేపో అవినాష్‌ను కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ అవినాష్ కుటుంబానికి మద్దతుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బలమైన వాదన వినిపిస్తున్నారు.
పలు ప్రముఖ చానళ్ల డిబేట్లలో రాచమల్లు పాల్గొని సీబీఐ విచారిస్తున్న తీరును తప్పు పట్టారు. వైఎస్ అవినాష్, ఆయన తండ్రిని ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ కుట్రపూరితంగా విచారిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. మొదట్లో వివేకా కుమార్తె తన తండ్రిని హత్య చేసిన వారిలో టీడీపీ నేతల పేర్లు ప్రస్తావించారన్నారు. మరి వారిని ఇప్పుడు ఎందుకు ఆమె పట్టించుకోలేదని రాచమల్లు ప్రశ్నించడం గమనార్హం. వివేకాను హత్య చేయడం వల్ల వైఎస్ అవినాష్, భాస్కర్‌రెడ్డిలకు వచ్చే ప్రయోజనం ఏంటని నిలదీయడం ఆసక్తికర పరిణామం.
ఈ హత్య వెనుక వివాహేతర, ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరు, వివేకా రెండో భార్య, ఆమె కుమారుడికి ఆస్తి రాయించడం తదితర అంశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశాల్లో సీబీఐ విచారించలేదని ఆయన ఆరోపించారు. న్యాయ పోరాటం చేస్తామని, అంతిమ విజయం తమదే అంటూ గట్టి వాదన వినిపిస్తున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్ అనంతరం ఏ చానల్ చూసినా వైసీపీ తరపున ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బలమైన వాదన వినిపిస్తుండడం చర్చనీయాంశమైంది.