వర్తమాన రాజకీయాలలో దూకుడుగా ఉండడం అనేది చాలా అవసరం! అతిశయం అనేది కూడా అవసరం!! ఈ లక్షణాలను సమర్థంగా వినియోగించుకుని సక్సెస్ సాధించిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
దూకుడు తనం, గోరంతలని కొండంతలు చేయడం అనే చిట్కాలు తెలంగాణ ఉద్యమానికి బాగా ఉపకరించాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా అవే టెక్నిక్స్ వాడుతానంటే కుదరదు. ఉద్యమానికి పరిపాలనకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ విభజన రేఖను గుర్తించకుండా అదే దూకుడు, అదే అతిశయం ప్రదర్శిస్తే ఎదురుదెబ్బలు తప్పవు.
అందుకే 'కొంచెం తగ్గాలి దొర' అంటున్నది ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోనార్క్! తాను అనుకున్నది చేసుకుంటూ, వ్యతిరేకతలను ధిక్కరిస్తూ, తొక్కేసుకుంటూ మున్ముందుకు దూసుకుపోయే నాయకుడు. ‘దూకుడు’ అనేది ఆయన లక్షణం. మాటలో దూకుడూ, చేతల్లో దూకుడూ చూపిస్తుంటారు. ఈ దూకుడు ఉద్యమానికి ఎంతో మేలు చేసింది. కేవలం ఆ దూకుడుతోనే, మొత్తం తెలంగాణ సమాజంలో ఒక ఆవేశాన్ని వ్యాప్తి చేయడంలోనే ఆయన సగం సక్సెస్ సాధించారు. కానీ దూకుడు ఎంతకాలమూ ఉపయోగపడదు.
కేసీఆర్ రెండు దఫాలుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా చాలా ఘనతలను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్షేమం పరంగా తీసుకువచ్చిన అనేకానేక పథకాలు ఉన్నాయి. రైతు బంధు వంటివిఆయన బుర్రలో పుట్టి అనేక ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిన పథకాలు. పథకాల సంగతి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం మీద కూడా కేసీఆర్ తన ఘనమైన ముద్ర వేయగలిగారు. అవినీతి ఆరోపణలు, అందులో నిజానిజాలను పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఇవేవీ మామూలు విషయాలు కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అద్భుతమైన సెక్రటేరియేట్ పూర్తవుతోంది. అమరవీరుల జ్యోతి కూడా అద్భుత నిర్మాణంగా తయారవుతోంది. ఇలాంటివి ఆయన ఖాతాలో ఉన్నాయి.
అంతా బాగానే ఉంది గానీ.. తెలంగాణ మీదినుంచి కేసీఆర్ దృష్టి జాతీయ రాజకీయాల మీదికి మళ్లిన తర్వాత.. ప్రదర్శిస్తున్న దూకుడులో బ్యాలెన్స్ తప్పుతోంది. నిజంగానే దేశాన్ని ఉద్ధరించడానికి, బిజెపిని మట్టి కరిపించడానికి ఆయన జాతీయ రాజకీయాల మాటెత్తుతున్నారా? లేదా, తన కొడుకు కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించడానికి ఈ వ్యూహం అనుసరిస్తున్నారా అనేది పెద్ద చర్చ. కానీ.. భారాస తర్వాత అడుగుల్లో తడబాటు వస్తోంది. అర్థంలేని, నష్టదాయకమైన దూకుడు ఉంది. ఇది తగ్గాల్సిన అవసరం కూడా ఉంది.
బండి అరెస్టుతో ఏం సాధించారు?
తెలంగాణ బిజెపి సారథి బండి సంజయ్ ను అరెస్టు చేయడం ద్వారా కేసీఆర్ ఏం సాధించారనేది అర్థం కావడం లేదు. మేం కూడా కేసులు పెట్టగలం, మేం కూడా అరెస్టులు చేయగలం అని చెప్పుకోడానికి తప్ప ఇందులో మరో అంశం లేదు. పైగా బండి సంజయ్ మీద పెట్టిన కేసులేవీ ఆయనను నేరస్తుడిగా నిరూపించేవి కాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్దేశాన్ని భ్రష్టు పట్టించేవి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉన్నదని, ఆమె అరెస్టు తప్పదని బిజెపి నాయకులు అంటున్న తొలిరోజు నుంచి.. బండి సంజయ్ ను కూడా అరెస్టు చేస్తాం అనే ప్రతిస్పందనలు గులాబీల వైపు నుంచి వచ్చాయి. కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని మధ్యలో రకరకాల కేసులు కూడా ఆయనపై పెట్టారు. కానీ అవేవీ అరెస్టు దాకా వెళ్లలేదు. హఠాత్తుగా పేపర్ లీకేజీ వ్యవహారం వారికి కలిసి వచ్చింది. తక్షణం కేసులు పెట్టి బండి సంజయ్ ను అరెస్టు చేశారు. అరెస్టు– జైలు అనేవి జరిగాయే తప్ప.. బండిసంజయ్ కుట్రపూరితంగా పేపర్ లీక్ చేయించినట్టుగా ఎన్నటికైనా నిరూపించగలరా అనేది అనుమానమే.
కానీ ఈ ఎపిసోడ్ ద్వారా.. విచక్షణ మరచిపోయి కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా అరెస్టులు చేయిస్తున్నారనే అపకీర్తిని కేసీఆర్ మూటగట్టుకున్నారు. ఇదంతా కేవలం అనవసరమైన దూకుడు ఫలితం.
కవిత పరిస్థితి క్లిష్టమే!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత లోతుగానే ఇరుక్కున్నారని పలువురు విశ్లేషిస్తున్న తీరు గమనించదగ్గది. తాజాగా సుఖేష్ వాట్సప్ చాట్ వివరాలను కూడా బయటపెట్టిన తర్వాత.. కవిత గతంలో ఈడీ విచారణ జరిగిన నాటికంటె లోతుగా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ ఈ విషయంలో చాలా దూకుడు ప్రదర్శించారు. తన కూతురు అరెస్టు అవుతుందని, అరెస్టు అయితే దానిని రాజకీయ వేధింపు చర్యగా సమర్థంగా వాడుకోవాలని.. ఆయన ఆమెను తొలిసారి విచారించడానికంటె ముందే నిర్ణయించుకున్నట్టుగా కనిపించింది. కవిత విచారణకు వెళ్లడానికి ముందే.. అరెస్టు అయిపోతుందనే సంకేతాలను కేసీఆర్ ఇచ్చారు. ఇవంతా వేధింపులు అంటూ ముందుగానే దుమ్మెత్తి పోశారు. అరెస్టు కంటె ముందు కేంద్రంలోని బిజెపి మీద నెపం పెట్టి తిట్టేస్తే ఎందుకైనా ఉపయోగపడుతుందని కేసీఆర్ భావించినట్లుగా కనిపించింది.
కవిత విచారణ సందర్భంగా భారాస ఎంత హడావుడి చేసిందో అందరికీ తెలుసు. సగం మంది భారాస కీలక నాయకులు వెళ్లి ఢిల్లీలో కూర్చున్నారు. భారాస లాయర్ల బృందం వెళ్లింది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఢిల్లీలోనే ఇంట్లోకూర్చుని ఆమెను విచారణకు పంపి మంత్రాంగం నడిపించారు. తిరిగి రావడంలో కూడా.. అర్ధరాత్రి వేళకు కవిత తదితరులు ప్రత్యేకవిమానంలో హైదరాబాదుకు వచ్చి.. ఆ వేళలో కేసీఆర్ ఇంటికి వెళ్లి ఏం జరిగిందో వివరాలు చెప్పి, తర్వాత రిలాక్స్ అయ్యారు.
ఈ వ్యవహారం చూసిన ఎవ్వరికైనా సరే.. భారాస కాస్త అతి చేసినట్టుగా అనిపించింది. తీరా ఈడీ మాత్రం చాలా నింపాదిగా, వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రెండో దఫా విచారణకు రమ్మంది. ఆ సరికి భారాస హడావుడి రాద్ధాంతం చేయడం కాస్త తగ్గింది. ఈలోగా తనను ఇంట్లో విచారించాలని, తాను మహిళ గనుక ఈడీ కార్యాలయానికి రమ్మని అనడం కరెక్టు కాదని కవిత సుప్రీం కోర్టులో దావా వేసి ఇంకాస్త అభాసుపాలయ్యారు. భారాస చేస్తున్న యాగీ మొత్తం సద్దు మణిగింది. ఇప్పుడు సుఖేష్ తో కవిత చేసిన వాట్సప్ చాట్ అంటూ కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి.
వాట్సప్ చాట్ లు మాత్రం కవిత పాత్ర ఉన్నదని ప్రజలు అనుకునేలాగానే తయారయ్యాయి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థ ఈడీ చాలా ఆచితూచి వ్యవహరించింది. రెండుదఫాలుగా విచారించినా అరెస్టు చేయలేదు. అప్పట్లో కేసీఆర్ చేసిన హడావుడి వలన.. ఆమె అరెస్టు పట్ల వారికి సానుభూతి వచ్చే అవకాశం ఉన్నదని భావించారేమో తెలియదు. తీరా ఇప్పటికి, జనంలోనే సానుభూతి సడలిపోయిన పరిస్థితి. ఇంకోసారి విచారణకు పిలిస్తే గనుక.. ఖచ్చితంగా కవిత అరెస్టు జరుగుతుందనిపించేలా వాతావరణం తయారైంది. ‘కుక్కను చంపదలచుకుంటే.. ముందుగా అది పిచ్చిదనే ముద్ర వేయాలని’ సామెత చెప్పినట్టుగా.. కవిత అవినీతికి పాల్పడింది అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చే వరకు ఈడీ వేచిచూసిందని అనుకోవాలి. ఈ విషయంలో కేసీఆర్ గానీ, భారాసగానీ తొలినుంచి ప్రదర్శించిన దూకుడు వృథా అయింది.
కన్నడ ఎన్నికల్లో ఊసే లేదే!
కేసీఆర్ తనకు జాతీయ పార్టీ ఉన్నదనే ఆలోచన ప్రకటించిన నాటినుంచి ఆయన వెంట ఉన్న నాయకుడు.. కర్ణాటక జేడీఎస్ నాయకుడు కుమారస్వామి. భారాసను ప్రకటించడానికి ముందునుంచి ఆయన పలుమార్లు హైదరాబాదు వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ కూడా వారి బెంగుళూరు నివాసానికి వెళ్లి విందు సమావేశం జరిపారు. భారాస ప్రకటించాక కేసీఆర్ కు తొలి శాలువా కప్పిన ఇతర రాష్ట్రాల నాయకుడు కుమారస్వామినే. అలాంటిది ఇప్పుడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోంటే.. ఎక్కడా గులాబీ ఊసు వినిపించడం లేదు.
నిజానికి భారాసను ప్రకటించిన తర్వాత.. జాతీయ రాజకీయాల్లోకి తమ తొలిఅడుగుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశిస్తామని, అక్కడ ఖచ్చితంగా కొన్ని సీట్లు గెలుస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాతి పరిణామాల్లో సత్యవతి రాథోడ్ వంటి భారాస మంత్రులు కర్ణాటకలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందని ధ్రువీకరించారు. అదే సమయంలో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల అడుగుల్లో తొలినుంచి వెంట నిలిచిన కుమారస్వామి మాత్రం.. కన్న డ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందని చెబుతూ వచ్చారు.
జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత.. ఓటు శాతం పెంచుకోవడం, అంతో ఇంతో తెలుగు నాయకులకు ఆదరణ ఉన్న, తెలంగాణకు సరిహద్దుల్లో అనేక నియోజకవర్గాలు ఉన్న కర్ణాటక ఎన్నికల్లోకి ప్రవేశించడం చాలా అవసరం అని అందరూ అనుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తొలినాటి ప్రకటనలన్నీ అలాగే ఉన్నాయి.
తీరా ఇప్పుడు కన్నడనాట ఎన్నికలు జరుగుతోంటే అక్కడ గులాబీ చప్పుడు చేయడంలేదు. ఆ రాష్ట్రంలో ప్రధానంగా భాజపా– కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. తాము బరిలోకి దిగి పోటీచేయడం అనేది భాజపా వ్యతిరేక ఓటును చీల్చి వారికి మేలుచేస్తుందనే అభిప్రాయం కేసీఆర్ కు కలిగిఉంటుందని, అందువల్ల ఆయన వెనక్కి తగ్గారని అనుకోలేం. ఎందుకంటే.. రేపు ఏరాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఇలాంటి పరిస్థితే ఉంటుంది.
తెలంగాణ నుంచి భారాస వచ్చి తమ రాష్ట్రాన్ని బాగుచేస్తుందని ఎదురుచూసే ‘శూన్యత’ ఎక్కడా లేదు. అనివార్యంగా భారాసకు పొత్తులు తప్పవు. కన్నడ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పొత్తులు పెట్టుకుని ఉంటే ఇంకో రకంగా ఉండేది. పొత్తులు లేకపోయినా సరే.. తొలినుంచి తమ వెంట నిలిచిన కుమారస్వామి పార్టీకి అనుకూలంగా కేసీఆర్, ఇతర గులాబీ నాయకులు ప్రచారం చేసినా బాగానే ఉంటుందని అంతా అనుకున్నారు.
కానీ కుమారస్వామికి కేసీఆర్ కు మధ్య ఏం జరిగిందో తెలియదు. జెడిఎస్ విజయాన్ని కూడా భారాస కోరుకుంటున్నట్టుగా లేదు. తమతో ఇంత క్లోజ్ గా మెలిగిన పార్టీతోనే.. పురిట్లోనే విభేదాలు వచ్చేస్తే.. ఈ భారాసను జాతీయ రాజకీయాల్లోకి ఎలా ముందుకు తీసుకువెళతారు అనేది పెద్ద ప్రశ్న. ఆరంభంలో ఉన్న దూకుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
మహారాష్ట్ర నుంచి ఒకటీ అరా నాయకులు హైదరాబాదు వచ్చి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టుగా ప్రతిరోజూ ప్రకటనలు వస్తుంటాయి. కానీ ఇవన్నీ ఉపయోగం లేని చేరికలు. తీరా అక్కడ ఎన్నికలు వచ్చే సమయానికి కేసీఆర్ మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. కాంగ్రెస్ ను వదిలేసి తనతో మాత్రమే జట్టుకట్టాలని ఆయన పట్టుబడితే.. ఇతర రాష్ట్రాల్లో ఎన్ని పార్టీలు భారాసను అసలు పట్టించుకుంటాయో లేదో కూడా తెలియదు.
నష్టమేమిటి?
కేసీఆర్ దూకుడుగా ఉంటే ఉండవచ్చు గాక.. కానీ దానివలన నష్టమేమిటి? అనే ప్రశ్న ఉదయించవచ్చు. ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ సాధించారనే అభిప్రాయంతో కేసీఆర్ కు ప్రజానీకం ఒకదఫా సీఎం చాన్స్ ఇచ్చింది. అంతకంటె ఘనంగా రెండో చాన్స్ కూడా ఇచ్చింది. అంటే ఎక్కువ నమ్మకం వారిలో వచ్చింది. కానీ.. ఇలాంటి దూకుడు, తత్పలితంగా ఎదురుదెబ్బల వలన ప్రజల్లోని ఆ అసమానమైన నమ్మకం సడలిపోయే అవకాశం ఉంది.
బండి సంజయ్ అరెస్టు ఎపిసోడ్ లోనే ప్రభుత్వం కొంత భ్రష్టు పట్టింది. అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఇంకా వివాదస్పదం అయింది. కవితపై ఈడీ విచారణ సందర్భంగా వ్యవహారం గానీ, కన్నడ ఎన్నికల్లో అడుగు పెట్టలేని వైఫల్యంగానీ.. ఇవన్నీ ప్రజల్లో పార్టీ ఇమేజిని పలుచన చేసేవే.
భారాసగా ఇప్పటికిప్పుడు ఎర్రకోటమీద గులాబీజెండా ఎగరేయకపోతే వచ్చిన నష్టమేమీలేదు. కానీ.. ఇలాంటి దూకుడు పర్యవసానంగా ఇమేజి గాయపడి, రాష్ట్రంలో కూడా నష్టం జరిగితేనే అది వారికి ప్రమాదకరం.
ముందే చెప్పుకున్నట్టు దూకుడు ప్రదర్శించడం, అతిశయం చూపించడం, గోరంతల్ని కొండంతలుగా భ్రమపెట్టడం అనేది షార్ట్ టర్మ్ ఫలితాలను మాత్రమే ఇస్తాయి. తెలంగాణ ఉద్యమం కోసం సాగించిన అసమానమైన పోరాటంలో అలాంటి ఫలితాలను కేసీఆర్ పూర్తిగా చవిచూశారు. కానీ.. అవి కలకాలం ఉపయోగపడవు. ఆయన దూకుడు తగ్గాలి. ఇవన్నీ రివర్స్ ఫలితాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే జాతీయ పార్టీగా అవతరించిన తరుణంలో, జాతీయ రాజకీయాల్లో కూడా తన స్థిరమైన, పదిలమైన, ఘనమైన ముద్రను చూపించాలని ఆరాటపడుతున్న నేపథ్యంలో గులాబీ దొర కాస్త దూకుడు తగ్గించడం పార్టీకి శ్రేయస్కరం.
.. ఎల్. విజయలక్ష్మి