రాహుల్ పల్లకీ మోసినా, పరువు పోగొట్టుకున్న బాబు

తన సంకుచిత స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొక విషయం పట్టించుకోని చంద్రబాబునాయుడు వ్రతం చెడగొట్టుకున్నా కూడా ఫలం దక్కించుకోలేకపోయారు. పైగా అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న ఈ రాజకీయ దురంధరుడి వ్యూహాలకు…

తన సంకుచిత స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొక విషయం పట్టించుకోని చంద్రబాబునాయుడు వ్రతం చెడగొట్టుకున్నా కూడా ఫలం దక్కించుకోలేకపోయారు. పైగా అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న ఈ రాజకీయ దురంధరుడి వ్యూహాలకు కాలం చెల్లిపోయిందనడానికి ఇలాంటి దృష్టాంతాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తన అయిదేళ్ల పదవీకాలం ముగుస్తున్న సమయంలో.. చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేకతను, ఓటమి సంకేతాలను పసిగట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యతిరేకత కారణాల్ని మోడీ మీదకు నెట్టేయాలని ప్లాన్ చేశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి.. మోడీని తూర్పారపట్టారు. అందివచ్చిన అవకాశంలాగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తద్వారా… తెలుగుదేశం మూల సిద్ధాంతాలకు భిన్నంగా వ్రతం చెడగొట్టుకున్నారు. అలాగని అక్కడేమీ విజయాలు దక్కలేదు. దారుణమైన పరాభవమే మిగిలింది. ఏపీ ఎన్నికలు వచ్చేసరికి ఆ పొత్తు కూడా మంటగలిసిపోయింది. ఇప్పుడు అదే రాహుల్.. చంద్రబాబును మోడీ తొత్తుగా పరిగణించే పరిస్థితి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్న పీసీసీ కొత్త నాయకత్వం ఢిల్లీలో రాహుల్ ను కలిశారు. పీసీసీ సారథి శైలజానాధ్ సారథ్యంలో వారు వెళ్లి రాహుల్ ను కలవడం జరిగింది. బలోపేతం గురించి మార్గదర్శనం సరేసరి.. అది ఎప్పటికీ జరిగేది కాకపోయినా.. వారు ఆ మాటలతోనే రోజులు నెడుతుంటారు.

కానీ శైలజానాధ్ మీడియాకు వెల్లడించిన దాన్ని బట్టి.. ‘‘రాష్ట్రంలో మూడు పార్టీలూ భాజపా తొత్తులుగా ఉన్నాయని’’ రాహుల్ అన్నారుట. అంటే తెలుగుదేశాన్ని కూడా మోడీ తొత్తుల జాబితాలో రాహుల్  జమకట్టారన్నమాట. గత ఎన్నికలసమయంలో రాహుల్ తో ప్రచార వేదికలను పంచుకుని, రాహుల్ ను ప్రధానిని చేయడం దేశ సమస్యలకు పరిష్కారం అని ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు, చివరికి అదే రాహుల్ నోట.. ‘మోడీ తొత్తు’ అనే కితాబులు పుచ్చుకోవాల్సి వచ్చింది. హతవిధీ… చంద్రబాబుకు ఎంతటి తీవ్రాతి తీవ్రమైన దుస్థితి సంప్రాప్తించినదో కదా!

నేను చిరంజీవి భుజాలపై చేతులు వేసుకొని తిరిగేవాళ్ళం