బిగ్‌బాస్-3 అనంతరం ‘ఒక చిన్న విరామం’ తర్వాత పునర్నవి భూపాలం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బిగ్‌బాస్-3 కంటెస్టెంట్, విన్నర్ రాహుల్ సన్నిహితురాలైన పునర్నవి భూపాలం నటించిన చిత్రం ‘ఒక చిన్న విరామం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్‌వర్మ, నవీన్, పునర్నవి భూపాలం, గరీమాసింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు సందీప్ చేగూరి.
హైదరాబాద్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక రాత్రిలో జరిగే కథ ఇది. ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. థ్రిల్లర్ కథాంశంతో అనుక్షణం ఉత్కంఠను పంచుతుంది’ అని తెలిపాడు. రొటీన్‌గా సాగే కథలా కాకుండా ఓ విభిన్న కథను తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టు ఆయన తెలిపాడు. రొటీన్ పంథాను బ్రేక్ చేసినట్టు ఆయన వెల్లడించాడు.
థ్రిల్లర్ , సస్పెన్ష్‌తో నడిచే సినిమా…క్షణక్షణం ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తిస్తుందన్నాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్‌లను ఆదరిస్తున్నారన్నాడు. కొత్త కాన్సెప్ట్‌లను తెర మీదికి తేవాలనే ఆశయంతో ఈ సినిమా తీసినట్టు దర్శకుడు తెలిపాడు.
బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం మాట్లాడుతూ బిగ్‌బాస్ షో తర్వాత తాను మరింత పాపులర్ అయ్యానన్నారు. బిగ్‌బాస్ షో పూర్తయిన తర్వాత తాను నటించిన తొలి చిత్రం ‘ఒక చిన్న విరామం’ అని ఆమె వెల్లడించారు. ఇది తన ఎంతో వైవిధ్యమైన సినిమా అవుతుందని అందరికీ ప్రామిస్ చేస్తున్నట్టు పునర్నవి తెలిపారు. అలాగే ఇది తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.