సాధారణంగా రీమేక్ సినిమాను కెలకాలని ఎవరూ అనుకోరు. ఏ మార్పు చేస్తే ఏం జరుగుతుందో అనే భయం. ఒరిజినల్ మూవీతో కంపేర్ చేసి ట్రోలింగ్ చేస్తారనే టెన్షన్. కానీ పింక్ రీమేక్ విషయంలో మాత్రం యూనిట్ ఇలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. భారీ మార్పులు చేసింది. దీనికి కారణం పవన్ కల్యాణ్.
టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఓ ఇమేజ్ ఉంది. అతడి నుంచి వచ్చే సినిమాలకు ఓ స్థాయి ఉంది. కాబట్టి ఈ రీమేక్ ను కూడా అదే స్థాయిలో నిలబెట్టే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు భారీ మార్పులు చేశారు. అవన్నీ కేవలం పవన్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన మార్పులే అని తెలుస్తోంది. ఒరిజినల్ కథ అలానే ఉంచి, పవన్ చుట్టూ చాలా యాక్షన్ సన్నివేశాలు అల్లారు.
పింక్ రీమేక్ కు భారీ మార్పులు చేసిన విషయాన్ని దిల్ రాజు కూడా నిర్థారించారు. ఆల్రెడీ రెండు భాషల్లో సినిమా వచ్చేసిందని, తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది ఈ సినిమా చూసేశారని.. అలాంటప్పుడు ఏదైనా కొత్తగా చెప్పాల్సిందేనని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన రెండు వెర్షన్లకు పూర్తి భిన్నంగా తెలుగు పింక్ ఉంటుందంటున్నాడు.
హిందీ వెర్షన్ లో అమితాబ్, తమిళ వెర్షన్ లో అజిత్ పోషించిన పాత్రల రన్ టైమ్ తక్కువగా ఉంటుంది. తెలుగు వెర్షన్ లో మాత్రం పవన్ స్క్రీన్ ప్రజెన్స్ ను పెంచారు. ఈ దిశగానే మార్పులు ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. మే 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.