నా ''విగ్రహారాధన'' వ్యాసం చదివాక చాలామంది పాఠకులకు వేదాల గురించి కుతూహలం కలిగింది. వాటిలో ఏముందని కొందరు, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని మరి కొందరు రాశారు. వారి కోసం యీ వ్యాసం. నేను వేదాలు చదవలేదు. నండూరి రామమోహనరావు గారి '''విశ్వదర్శనం'', కొడవటిగంటి కుటుంబరావు గారి ''వేదాలలో ఏమున్నది?'', తెలుగు విశ్వవిద్యాలయం వేసిన విజ్ఞానసర్వస్వం నాలుగో సంపుటం 'దర్శనములు – మతములు' వంటి పుస్తకాల్లో వాటి గురించి చదివానంతే. ఎందుకంటే అవన్నీ మంత్రాలు, స్తోత్రాలు. నాకు బోరనిపించింది.
వేదవాఙ్మయంలో వేదాంతంగా (వేదాల చివరన వచ్చే.. అని అర్థం) చెప్పబడే ఉపనిషత్తులు చాలా యింట్రస్టింగ్గా, ఆలోచింప చేసేట్లు ఉంటాయి. అవి చాలా చదివాను. భగవద్గీత అయితే చాలా సార్లు చదివాను. దానిపై పలు వ్యాఖ్యానాలు చదివాను. వాటిల్లో స్వామి చిన్మయానంద వ్యాసాలు నాకు నచ్చుతాయి. కొన్నేళ్ల క్రితం భగవద్గీత గురించి వివాదం ఏదో వస్తే, అప్పుడు 'భగవద్గీతలో ఏముంది?' అని 2,3 వ్యాసాలు రాశాను. ఇప్పుడు దీన్ని ఒక వ్యాసంలో ముగిస్తాను. వేర్వేరు పుస్తకాల నుంచి ఎత్తి రాస్తున్నాను కాబట్టి దీనిలో రాసినవన్నీ -ట లే! మాటిమాటికీ 'ట' రాయలేక వదిలేస్తున్నాను. వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేద్దామనుకున్నవారు విశాలాంధ్ర వాళ్లు వేసిన దాశరథి రంగాచార్య గారి వేదాల అనువాదాలు చదవవచ్చు.
వేదాలు అపౌరుషేయాలు, (మనుష్యులెవ్వరూ రాయనిది) అంటూంటారు. అది మనం నమ్మనక్కరలేదు. ఎవరూ రాయకుండా కృతులెలా పుడతాయి? ఋగ్వేదం రాసిన మహర్షులే 2 వేల మంది ఉన్నారట. వేదాలన్నీ ఒకేసారి, ఒకే కాలంలో రాయలేదని, వాటిలోని భాషా పరిణామం బట్టి చెప్తారు. మొదటి దానిలోని భాష ఆడంబరంగానూ, పాండిత్య ప్రకర్షతో కూడినదిగా ఉండి క్లిష్టంగా ఉంటుంది. పోనుపోను తక్కినవాటికి వచ్చేసరికి భాష సరళమైంది.
వేదాలు ఎన్ని అంటే నాలుగు అని అందరం చెప్పేస్తాం. కానీ అధర్వణ వేదాన్ని వేదంగా చాలాకాలం గుర్తించ లేదు. నన్నయ భారతం ప్రారంభిస్తూ ''వేదత్రయ మూర్తయః త్రిపురుషాః'' అన్నాడు. ''త్రయీ వై విద్యా, ఋకో యజూంషి సామాని..'' అని శతపథ బ్రాహ్మణం అంది. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలను యజు, సామ వేదాలు ఎక్కువగా తీసుకోగా, అధర్వణ వేదం తక్కువగా (1200) తీసుకుంది. పై మూడూ సమాజంలో పై తరగతుల వారి గురించి సంబంధించి ఉండగా, నాలుగో దానిలో కనబడే జనజీవితం ఎక్కువగా కింది తరగతులకు చెందినది. ప్రతీ వేదంలో నాలుగు విభాగాలుంటాయి – సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకాలు, ఉపనిషత్!
ఋగ్వేదంలో 10,500 పై చిలుకు మంత్రాలున్నాయి. వాటిని ఋక్కులున్నారు. ఋక్ అంటే స్తోత్రంగా ఉపయోగించే మంత్రం. కొన్నికొన్ని ఋక్కులను కలిపి ఒక సూక్తం అన్నారు. అలాటివి 1000కి పైగా ఉన్నాయి. ఈ ఋక్కులలో కొన్ని స్త్రోత్రాలు, కొన్ని ప్రార్థనలు, కొన్ని మంత్రాలు, కొన్ని ఉత్త పాటలు. ఇవన్నీ ఛందోబద్ధాలు. 17 రకాల ఛందస్సుల్లో రాయబడ్డాయి. దీనిలో 21 శాఖలుండేవట. చివరకు ఒకే శాఖ మిగిలింది. దాన్ని శాకల లేదా ఐతరేయ అంటారు. వేదాల్లో పూజించబడిన దేవుళ్లెవరు అని తెలుసుకోవడం ఆసక్తికరం. అగ్ని (నిప్పు), ఇంద్రుడు (మేఘాలు), వరుణుడు (నీరు), సవిత (వెలుతురు), వాయువు (గాలి), సూర్యుడు (పగలు వెలుగునిచ్చేవాడు), సోముడు (రాత్రి వెలుగు నిచ్చేవాడు) యిత్యాదులు. గమనించండి – వీళ్లందరూ ప్రకృతి శక్తులకు అధినేతలే!
మానవులు ఆ యా దేవుళ్లని ఉద్దేశించి, 'నువ్వు గొప్పవాడివి, మాకు ఐహిక సుఖాలియ్యి, లౌకిక విజయాలియ్యి, ధనధాన్యాలు భోగభాగ్యాలు ఇయ్యి. రోగాలు పోగొట్టు, శత్రువులను నిర్మూలించు' అని ప్రార్థిస్తూ మంత్రాలు రాసి, దేవతలకు ప్రీతి కలిగించడానికి యజ్ఞం చేస్తూ, అవి చదివేవారు. రానురాను యజ్ఞకర్మ సంక్లిష్టమైపోగా, దాన్ని సులభం చేయడానికి ఋక్కులతో బాటు ఉపయోగించడానికి యజుస్ మంత్రాలు రచించారు. అశ్వమేథం, రాజసూయం వంటి అనేక యాగాలను ఎలా నిర్వర్తించాలో యజుర్వేదం తెలుపుతుంది.
యజుర్వేదంలో ఉండే మంత్రాలను యజస్సులంటారు. దీనిలో ఛందోభాగమే కాక, గద్యభాగం కూడా ఉంది. అయితే దాన్నీ మంత్రాల లాగానే చదువుతారు. ఈ వేదం రెండు విధాలు. కృష్ణ, యజుర్వేదం (దక్షిణాదిన ఎక్కువ ప్రాచుర్యం) శుక్ల యజుర్వేదం (ఉత్తరాదిన ఎక్కువ ప్రాచుర్యం). ఈ వేదంలో మొదట 101 శాఖలుండేవి. వాటిలో 2 శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి, 3 (వీటిలో తైత్తిరీయం ప్రసిద్ధం) కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి లభ్యమౌతున్నాయి. .
సామవేదంలోని మంత్రాలను సామాలు అంటారు. వాటిలో 1500 ఋగ్వేదంలోనివే. గానయోగ్యంగా మలిచారు. దీనిలో వేయి శాఖలుంటే మూడు శాఖలు మాత్రం మిగిలాయి. ఆఖరున పుట్టిన వేదం అధర్వణ వేదం. దీనిలో ఆంగిరస్లు అనబడే మంత్రాలుంటాయి. అందులో 20 కాండలు, 6 వేల ఋక్కులు. 732 సూక్తాలు ఉన్నాయి. ఇందులోనూ 9 శాఖలుండేవిట. రెండు శాఖలు మాత్రం మిగిలాయి – శౌనకీయం, పైప్పలాదకం. రెండోది ప్రాచుర్యంలో లేదు. దీని మంత్రాలలో క్షుద్రశక్తులకు, భూతప్రేత పిశాచ్చోటనకు సంబంధించినవి కనబడతాయి. వైద్యశాస్త్రానికి, జ్యోతిశ్శాస్త్రానికి యీ వేదం కుదురు.
యజ్ఞంలో నలుగురు ఋత్విజులు ఉంటారు. ఋగ్వేదం పఠించే ఋషిని హోత, యజుర్వేదం ఆయన్ను ఆధ్వర్యుడు, సామవేదం ఆయన్ని ఉద్గాత, అధర్వ వేదం చదివే ఆయన్ని బ్రహ్మ అంటారు. ఇప్పటిదాకా మంత్రభాగం గురించి చెప్పుకున్నాం. దీన్ని సంహిత (సంకలనం) విభాగం అంటారు. రెండో విభాగం బ్రాహ్మణాలు. బ్రహ్మ అంటే మంత్రం. వేదమంత్రాలకు వివరణగా ఉద్భవించిన విభాగం కాబట్టి బ్రాహ్మణం అంటారు. సంహితలో చెప్పిన యజ్ఞమంత్రాల అర్థాలను వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, దాన్ని ఎలా నిర్వహించాలో చెపుతాయివి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకీ బ్రాహ్మణం ప్రఖ్యాతి చెందాయి. కృష్ణ యజుర్వేదానికి చెందిన బ్రాహ్మణాల్లో తైత్తిరీయ బ్రాహ్మణం, శుక్ల యజుర్వేద బ్రాహ్మణాల్లో శతపథ బ్రాహ్మణం, సామవేద బ్రాహ్మణ్యాలలో తాండ్య బ్రాహ్మణం, అధర్వణ వేద బ్రాహ్మణాలలో గోపథం ప్రసిద్ధమైనవి.
ఈ బ్రాహ్మణాల్లో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. శకుంతల కథ, ఊర్వశీపురూరవ కథ, ఉద్దాలక ఆరుణి కథ, ప్రాచీన జలప్రళయం, వైవస్వత మనువు చరిత్ర యిలాటివన్నీ వీటిలో సూక్ష్మంగా ఉన్నాయి. తర్వాత పురాణాలు రాసినవాళ్లు చిలవలు, పలవలు కల్పించి విస్తరింపచేశారు. వేదంలో మూడో భాగం ఆరణ్యకాలు. వానప్రస్థంలో అరణ్యాలలో ఉంటూ ఏయే కర్మలు చేయాలో నిర్దేశిస్తాయి యివి. ఇక వేదాల్లో ఆఖరి భాగం ఉపనిషత్తు. తక్కినవన్నీ కర్మకాండకు సంబంధించినవి కాగా యివి జ్ఞానకాండకు సంబంధించినవి. ఇవి వేదప్రమాణాన్ని ఆమోదిస్తూనే వైదిక కర్మకాండను నిరసిస్తాయి. జంతుబలులతో, నరమేధంతో కూడిన కర్మకాండ ప్రయోజనాన్ని ప్రశ్నిస్తూ 'ఈ విశ్వం ఏమిటి? ఎవరు సృజించారు? మానవుడి జీవిత లక్ష్యం ఏమిటి? అంతిమ సత్యం ఏమిటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి?' అనే విషయాలు చర్చిస్తాయి. భారతీయ తత్త్వశాస్త్రానికి యివే మూలం.
ఉపనిషత్తులు 108 అంటారు. కానీ ప్రధానమైనవి, పురాతనమైనవి పదే. తక్కినవి తర్వాతి రోజుల్లో రాసినవి. అందుకే ఆదిశంకరుడు ఆ పదిటికి మాత్రమే భాష్యం రాశాడు. అవి ఈశ, కేన, ప్రశ్న, ముండక, ఐతరేయ, తైత్తిరీయ, కఠ, ఛాందోగ్య, మాండూక్య, బృహదారణ్యక – ఉపనిషత్తులు. ఇవన్నీ నిర్గుణ బ్రహ్మతత్త్వ విచారణ చేసేవి కాగా, తర్వాత వచ్చిన వాటిల్లో చాలా భాగం సగుణోపాసనను ప్రబోధించాయి. నేను వీటిలో చాలా భాగం చదివాను. ఆసక్తికరంగా ఉంటాయి. వీలైతే చదవండి.
ఇక వేదాలను చదివే విధానం గురించి కూడా కాస్త చెపుతాను. మనకు లిపి ఎప్పుడో వచ్చినా వేదాలను క్రీ.శ. 14వ శతాబ్దం వరకు గ్రంథస్తం చేయలేదు. కేవలం మౌఖికంగానే, గురుశిష్య పరంపరగా భావితరాలకు అందిస్తూ వచ్చారు. అన్ని శతాబ్దాల పాటు శ్రుతంగా (వినడం వలన నేర్చుకోవడం) వుండిపోవడం ప్రపంచంలోనే అరుదైన విషయం. దీనికి కారణం ఏమిటి? వేదమంత్రాలను గానం చేసేటప్పుడు ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే ఉచ్చారణ పద్ధతిలో స్వరయుక్తంగా గానం చేశారు. స్వరంలో కానీ, ఉచ్చారణలో కానీ తేడా వస్తే అర్థం మారిపోతుంది.
వేదపండితులు మంత్రాలు చదివేటప్పుడు అదేమాటను తిప్పితిప్పి అంటున్నట్లు తోస్తుంది. ఎందువలన? మౌఖికంగా తర్వాతి తరానికి అందించేటప్పుడు, కొన్ని పదాలు ఎగిరిపోయి, మాట మారిపోయి, మూలం భ్రష్టమై పోకుండా ఉండడానికి పెద్దలు అనేక రకాలైన పద్ధతుల్లో వాటిని చదివించేవారు. ఉదాహరణకి ఋగ్వేదంలోని మొదటి ఋక్కులోని ''అగ్ని(ఎ), మీళే (బి), పురోహితమ్, యజ్ఞస్య..'' అనే మొదటి లైను ఉందనుకోండి. దీన్ని పద పాఠంలో చదవడం అంటే 'ఎబిసిడి' లా అగ్నిమ్, ఈళే, పురోహితమ్, యజ్ఞస్య.. అన్నమాట. క్రమ పాఠంలో చదవడం అంటే ఎబి, బిసి, సిడి.. అగ్నిమీళే, ఈళే పురోహితమ్, పురోహితమ్ యజ్ఞస్య.. యిలా!
జటా పాఠం లో చదవడమంటే ఎబి, బిఎ, ఎబి, బిసి, సిబి, బిసి.. అగ్నిమీళే, ఈళేగ్ని, మగ్నిమీళే, ఈళే పురోహితమ్, పురోహిత మీళే, ఈళే పురోహితమ్.. దీనిలో ప్రతీ మాట ఆరుసార్లు వస్తుంది. ఇక ఘనాపాఠం మరింత క్లిష్టం. ఎబి, బిఎ, ఎబిసి, సిబిఎ, ఎబిసి, బిసి, సిబి, బిసిడి.. ఫార్ములాలో నడుస్తుంది. చదివినప్పుడు అది 'అగ్నిమీళే, ఈళేగ్నిమ్, అగ్నిమీళే పురోహితమ్, పురోహితమీళేగ్నిమ్, అగ్నిమీళే పురోహితమ్, ఈళే పురోహితమ్, పురోహితమ్ ఈళే, ఈళేపురోహితమ్ యజ్ఞస్య…!' ఇలా వుంటుంది.
ఈ విధంగా అన్ని రకాలుగా వేదాలలో ప్రతి ఒక్క మంత్రాన్ని కంఠస్థం చేయడం వలన అన్ని వేల మంత్రాలను వేలాది ఏళ్లపాటు ఒక్క మాట పొల్లు పోకుండా కాపాడడం జరిగింది. ఇది భరతజాతి గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. ఎన్ని లక్షల, కోట్ల మంది యీ శ్రుతి యజ్ఞంలో పాలు పంచుకున్నారో ఊహించుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. ఇలా వేదాధ్యయనం చేసినవారిని జటాంతస్వాధ్యాయి, ఘనాపాఠి అని వ్యవహరిస్తారు. మన పత్రికల వాళ్లు మొదటిది పెద్దగా వాడకపోయినా రెండోది బాగా వాడతారు. 'మోసం చేయడంలో ఘనాపాఠి' లాటి ప్రయోగాలు కనబడతాయి.
వేదాలు ఎక్కణ్నుంచో ఊడిపడ్డాయనుకోవడం తర్కానికి నిలిచే విషయం కాదు. దీనిలో కొన్ని దశలను పండితులు గుర్తించారు. నానా దేవతలు ఉన్నారని అనుకోవడం ప్రారంభ దశ. ఏ దేవుణ్ని స్తుతించేటప్పుడు నువ్వే సర్వోత్తముడివి అనడం రెండో దశ. నానా దేవతలను, వారి స్వభావాల బట్టి, చేసే పని బట్టి వర్గీకరించడం మూడో దశ. దేవతలందరికీ ఒకే అధిపతి ఉంటాడని, అతనే విశ్వాన్ని సృష్టించాడని అనుకోవడం నాలుగో దశ. 'ఉన్నది ఒకే దేవుడు. అతడే సత్తు, అతన్ని మేధావులు వివిధ రూపాల్లో దర్శిస్తారు' (ఏకం సత్, విప్రాః బహుధా వదన్తి) అనడం ఐదో దశ.
ఈ విశ్వకర్మను మన కోర్కెలు తీర్చేవాడిగా కాకుండా విశ్వాన్ని నియమవంతంగా నడిపేవాడిగా, పాపపుణ్యాల బట్టి సుఖదుఃఖాలను యిచ్చేవాడిగా భావించడం (ఎతికల్ మోనోథీయిజం) అన్నిటి కంటె ఆఖరి దశ. అంటారు. కొందరు దీనితో విభేదిస్తూ మొదటి నుంచీ వేదాలు ఒకే దేవతాత్మను కొలిచారని, వివిధ దేవతలు ఆయన అంగాలుగా, రూపాలుగా భావించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానం కూడా వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇదీ వేదాల గురించి నేను సేకరించిన సమాచారం. దీనిలో తప్పులు దొర్లితే చెప్పండి, తెలుసుకుంటాను.
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)
[email protected]