‘‘అమరావతి లోనే రాజధాని ఉండాలి.. విశాఖకు తరలిపోకూడదు’’ అనే డిమాండుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలం అయ్యారు. ఆయన చెబుతున్న మాటకు నిజంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉన్నట్లయితే గనుక.. పరిస్థితి ఇలా ఉండేది కాదు. పోరాటాలు ఇంకో రూపం దాల్చి ఉండేవి. ప్రభుత్వంలో పునరాలోచన ఈపాటికే మొదలై ఉండేది. కానీ.. ప్రజల మద్దతు ఏమాత్రం లేని ఒక డిమాండును పట్టుకుని చంద్రబాబు ఊగిసలాడుతున్నారు. పైగా, ఇంట గెలవలేని ఈ డిమాండుతో ఇప్పుడు రచ్చగెలవాలని ఆయన అనుకుంటున్నారు.
అమరావతి ప్రజల దుస్థితిని దేశం దృష్టికి తీసుకువెళ్లండి- అని చంద్రబాబు హితోపదేశం చేస్తున్నారు. అమరావతి గురించి పోరాడుతున్న ఐకాసలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో గానీ.. ప్రస్తుతం సారథ్యం మారింది. జివిఆర్ శాస్త్రి ఐకాసకు కొత్త అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. అమరావతి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తెలియజెప్పాలని చంద్రబాబు ఆయనకు ట్విటర్ ద్వారా మార్గదర్శనం చేస్తున్నారు.
ఐకాస దీక్షలకు చంద్రబాబు కొన్నాళ్లపాటు ప్రత్యక్ష మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాసైన తర్వాత.. కాస్త జోరు తగ్గించారు. మద్దతిచ్చిన రోజుల్లో ఐకాస దీక్షలకు నిధులు సేకరించడానికి అంటూ.. ఆయన రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జోలెపట్టి విరాళాలు కూడా సేకరించారు. తిరుపతి బందరు ఇలా వివిధ చోట్ల ర్యాలీలు నడిపారు. కానీ అన్నీ పేలవంగా ముగిశాయి. అమరావతి తరలిపోతున్నదనే అంశం పట్ల ఆయనలో ఉన్నంత వ్యతిరేకత రాష్ట్ర ప్రజల్లో కనిపించలేదు.
అసలే ఓడిపోయిన పార్టీ.. ప్రజా ఉద్యమాలు నడుపుతూ.. వాటికి కూడా జనం కనిపించకపోతే.. మరింతగా పరువుపోతుందని భయపడి చంద్రబాబు మిన్నకుండిపోయారు. అన్ని ప్రాంతాలు సమానంగాన అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారనడానికి ఇది సంకేతం. అయితే ప్రతిపక్షాలు యాగీ చేయడం మానలేదు.
తమకు బలం ఉన్న రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాల్లో మద్దతు కూడగట్టలేకపోయిన చంద్రబాబు.. దేశం దృష్టికి తీసుకెళ్లమని వారికి హితబోధ చేయడం ద్వారా ఏం సాధించదలచుకున్నారో అర్థం కావడం లేదు.