‘వేలెడంత కూడా లేని మిడతలు వివిధ దేశాల్లో లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. కోట్ల మంది ఆహార భద్రతకు పెను ముప్పు కలిగిస్తున్నాయి. మిడతలను కట్టడి చేయడానికి కోట్ల డాలర్లు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం మిడతల దాడికి ఆఫ్రికా విలవిలలాడుతోంది. ఇప్పటికే భారత్‌లో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లలో 3.5 లక్షల హెక్టార్లలో పంటను ఈ కీటకాలు నాశనం చేశాయి’…ఉదయాన్నే ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తా సారాంశం ఇది. ఈ వార్త చదవగానే అర్రె ఆంధ్రప్రదేశ్‌లో మిడతల గురించి రాయడం మరిచారే అనే బాధ, ఆవేదన కలిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ‘ఎల్లో’ మిడతల దండయాత్ర 2014లో ప్రారంభమైంది. అయితే ఇక్కడ మనుషులే మిడతల రూపందాల్చారు. ఆ మనుషులు పసుపు రంగులో ఉంటారు. వారి దండయాత్రకు ఎల్లో మీడియా కూడా తోడైంది. ‘ఎల్లో’ మిడతల్లో మేధావులు ఎక్కువ. అందుకే తమ దండయాత్రకు ఓ చక్కటి పేరు పెట్టారు. దాని పేరే ‘రాజధాని’. ఈ ఎల్లో మిడతల దాడి వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే రక్షకులే భక్షకులు కావడంతో భారత ప్రభుత్వం కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది.
ఎల్లో మిడతలు తాము టార్గెట్ చేసుకున్న 50వేల పైచిలుకు ఎకరాలను దండయాత్ర ద్వారా స్వాధీనం చేసుకున్నాయి. కృష్ణా డెల్టాలో మూడు పంటలు పండే ఆ భూమిలోని దాదాపు 130 రకాల పంటలు…ఎల్లో మిడతల దండయాత్ర పుణ్యమా అని విధ్వంసమయ్యాయి.
అయితే ఈ ఎల్లో మిడతల భరతం పట్టాలని ఓ పాలకుడు వచ్చాడు. స్థల మార్పిడి చేస్తే తిక్క కుదురుతుందని ఆ పాలకుడు అనుకుని అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాడు. భూమిని, పచ్చదనాన్ని తినడానికి బానిసలైన ఎల్లో మిడతలు అందుకు ఒప్పుకోలేదు. రకరకాల పేర్లతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు.
ఇక ఈ మిడతలకు అండగా ఎల్లో మీడియా మిడతలు నిలిచాయి. గోరింతలు కొండంతలు చేయడంలో ఘనత వహించిన ఎల్లో మీడియా మిడతలు సిద్ధహస్తులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 50 రోజులుగా నడుస్తున్న చరిత్ర ఇది. అసలు ఈ ఎల్లో మిడతలను పాలకుడు అనుకున్నట్టు తరిమికొడతాడా లేదా అనేది కాలమే జవాబు చెప్పాలి.