జిల్లాల ఏర్పాటులో ఇది మంచి నిర్ణ‌యం!

కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాటించిన శాస్త్రీయ‌త ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. జిల్లాల విభ‌జ‌న ముందుగా వినిపించిన‌ప్పుడు ఒక్కో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కో జిల్లాగా మారుతుంద‌నేది. అది చాలా సింపుల్. ఏపీలో…

కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాటించిన శాస్త్రీయ‌త ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. జిల్లాల విభ‌జ‌న ముందుగా వినిపించిన‌ప్పుడు ఒక్కో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కో జిల్లాగా మారుతుంద‌నేది. అది చాలా సింపుల్. ఏపీలో 13 జిల్లాలు, పాతిక లోక్ స‌భ నియోవ‌జ‌వ‌ర్గాలు ఉన్నాయి కాబ‌ట్టి, ఒక్కో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చేయ‌వ‌చ్చు అని అనేక మంది అనుకున్నారు. అయితే.. లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటులో మ‌రీ గొప్ప శాస్త్రీయ‌త లేక‌పోవ‌డం, ఈ రెండింటికీ పోలిక లేక‌పోవ‌డంతో.. ఇబ్బందులు త‌ప్పేవి కావు అలా చేసి ఉంటే!

అందుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కాకుండా.. జిల్లాల ఏర్పాటుకు వేరే ప్ర‌క్రియ‌ను అనుస‌రించింది.  ఒక‌వేళ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాల ఏర్పాటును చేప‌ట్టి ఉంటే, కొత్త జిల్లా కేంద్రాల‌కు కొన్ని ఊర్లు చాలా దూరం అయ్యేవి.  అందులో ఒక ఉదాహ‌ర‌ణ‌ను పరిశీలిస్తే.. అనంత‌పురం జిల్లాలో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం లోక్ స‌భ సీటుకు కింద‌కు వ‌స్తుంది. ఒక‌వేళ ఈ లెక్క‌న రాప్తాడు ను పుట్ట‌ప‌ర్తి జిల్లా కింద‌కు వేసి ఉంటే.. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా ప్రాంతానికి పుట్ట‌ప‌ర్తి బాగా దూరం అయ్యేది!

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం.. అనంత‌పురం టౌన్ కు కూత‌వేటు దూరం నుంచి ప్రారంభం అవుతుంది. అనంత‌పురం టౌన్ ఔట్ స్క‌ర్ట్స్ అంతా రాప్తాడు ప‌రిధిలోకి వ‌స్తుంది! అనంత‌పురం టౌన్ చాలా వ‌ర‌కూ రాప్తాడు వైపు విస్త‌రించింది. దీంతో.. రాప్తాడు ప‌రిధిలోని పంచాయ‌తీలను కూడా అనంత‌పురం టౌన్ గా ప‌రిగ‌ణిస్తారు. మ‌రి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లా విభ‌జ‌న చేప‌ట్టి ఉంటే, అనంత‌పురం టౌన్లోని కొంత భాగం పుట్ట‌ప‌ర్తి జిల్లా అయిపోయేది!

అనంత‌పురం ప‌ట్ట‌ణ శివారుల్లోని చాలా ప్రాంతం పుట్ట‌ప‌ర్తి జిల్లా అయిపోయేది. అనంత‌పురం క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం నుంచి ఐదు కిలోమీట‌ర్ల దూరంలోని ప్రాంతం పుట్ట‌ప‌ర్తి జిల్లా అయ్యేది. తాము ఉంటున్న ప‌ట్ట‌ణం కాకుండా అక్క‌డ నుంచి సుమారు వంద‌ల కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న ఊరు వీరి జిల్లా కేంద్రం అయ్యేది!

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా ప్రాంతం ప‌రిస్థితి ఇదే అయ్యేది. వీరికి అనంత‌పురం ప‌ది, ఇర‌వై కిలోమీట‌ర్ల దూరంలో ఉంటే.. పుట్ట‌ప‌ర్తి 80, 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల దృష్ట్యా.. రాప్తాడును పూర్వ‌పు అనంత‌పురం జిల్లా ప‌రిధిలోనే ఉంచారు. వీరికి జిల్లా కేంద్రానికి ప‌ని మీద వెళ్లాల్సిన ప‌రిస్థితుల్లో సుదూరం ప్ర‌యాణించాల్సిన అవ‌స‌రం లేకుండా చూశారు.

కేవ‌లం రాప్తాడు అనే కాదు.. జిల్లాల విభ‌జ‌న‌లో.. శాస్త్రీయ‌త పాటించ‌డంలో,  ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాన్ని చూశార‌ని స్ప‌ష్టం అవుతోంది. అలాగే లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కాకుండా, వేరే శాస్త్రీయ‌త‌తో జిల్లాల విభ‌జ‌న ఏర్పాటు చేయ‌డం ద్వారా రాయ‌ల‌సీమ ఉనికి కూడా మిస్ కాలేదు. నెల్లూరు లోక్ స‌భ సీటు ప‌రిధిలోకి వెళ్లే రాయ‌ల‌సీమ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను రాయ‌ల‌సీమ జిల్లా కేంద్రాల్లో భాగంగానే చేశారు. స్థూలంగా ప్ర‌జ‌ల సౌక‌ర్య‌మే శాస్త్రీయంగా తీసుకుని జిల్లాల విభ‌జ‌న చేప‌ట్ట‌డం స్వాగ‌తించాల్సిన అంశం.