వైఎస్‌ను వ‌దిలేసి ఎన్టీఆర్ జ‌ప‌మేల‌?

ఏపీ అధికార పార్టీ వైసీపీ విచిత్ర పోక‌డ‌ల‌కు వెళుతోంది. వైసీపీ బ‌లం దివంగ‌త వైఎస్సార్ పేరే. ఆయ‌న పేరు కంటే టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త ఎన్టీఆర్‌ను జ‌పిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇంత‌కూ వైసీపీకి…

ఏపీ అధికార పార్టీ వైసీపీ విచిత్ర పోక‌డ‌ల‌కు వెళుతోంది. వైసీపీ బ‌లం దివంగ‌త వైఎస్సార్ పేరే. ఆయ‌న పేరు కంటే టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త ఎన్టీఆర్‌ను జ‌పిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇంత‌కూ వైసీపీకి ఆరాధ్యం వైఎస్సారా లేక ఎన్టీఆరా? అనే సందేహం పార్టీ శ్రేణుల‌కు కలుగుతోంది.

జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. గ‌తంలో పాద‌యాత్ర సంద‌ర్భంగా తాము అధికారంలోకి వ‌స్తే ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకు ఆయ‌న పేరు పెట్టి గౌర‌విస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాట నిల‌బెట్టుకున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డాన్ని కూడా టీడీపీ, దివంగ‌త నేత కుటుంబ స‌భ్యులు స్వాగ‌తించ లేని దుస్థితి. ఎన్టీఆర్‌పై ఆయ‌న పార్టీకి, కుటుంబ స‌భ్యుల‌కు లేని ప్రేమాభిమానాలు వైసీపీకి ఎందుకో ఎవ‌రికీ అర్థం కాద‌ని సొంత పార్టీ శ్రేణులే వాపోతున్నాయి.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఆయ‌న సామాజిక వ‌ర్గీయులు ఓట్లు వేస్తార‌నే భ్ర‌మ‌లో వైసీపీ ఉంటే అంత‌కంటే అజ్ఞానం మ‌రొక‌టి లేదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జానాయ‌కుడిగా, సినీ దిగ్గ‌జంగా ఎన్టీఆర్‌ను గౌర‌వించుకోవడంలో త‌ప్పేమీ లేదు. కానీ అధికార పార్టీకి ఆయ‌నే స‌ర్వ‌స్వం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డ‌మే విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఎన్టీఆర్‌కు పోటీగా వంగ‌వీటి రంగా పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది.

ఆ మాట‌కొస్తే కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గీయులు వంగ‌వీటి రంగాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఎన్టీఆర్ విష‌యంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం అలా ఆరాధించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వంగ‌వీటి రంగా పేరును కృష్ణా జిల్లాకు పెట్టాల‌ని డిమాండ్స్‌ను జ‌గ‌న్ స‌ర్కార్ విస్మ‌రిస్తుందా? దీని వ‌ల్ల ఆ సామాజిక వ‌ర్గ ఓట్లు పోగొట్టుకోదా? ఎన్టీఆర్‌ను ఆద‌రించ‌డం అంటే, వంగ‌వీటిని విస్మ‌రించ‌డం కాదా? అనే ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం ఏం స‌మాధానం చెబుతుంది. 

ఎన్టీఆర్ విష‌యంలో వైసీపీ అతి చేస్తుండ‌డం వ‌ల్లే ఇలాంటి ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఎన్టీఆర్‌ను వైసీపీ స్మ‌రించుకుంటున్న‌ట్టుగా ఏనాడైనా దివంగ‌త వైఎస్సార్‌ను టీడీపీ ప్ర‌శంసించిందా? పైగా వైఎస్సార్ దివంగ‌తులైనా… ఇంకా అవినీతి, ఫ్యాక్ష‌న్ నాయ‌కుడిగా ఆరోపిస్తూనే ఉంది.

వీలైతే వైఎస్సార్ గొప్ప‌త‌నాన్ని ప‌ది మందికి తెలియ‌జేసి రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంద‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన ముఖ్య నాయ‌కుడిని కీర్తిస్తూ పాలాభిషేకాలు, మ‌రొక‌టి చేయ‌డం ఏంట‌నే నిల‌దీత‌లు వైసీపీ శ్రేణుల నుంచి వ‌స్తున్నాయి. 

ఎన్టీఆర్‌పై కుటుంబ స‌భ్యుల ప్రేమ‌ను చూసైనా, వైసీపీ గుణ‌పాఠం నేర్చుకుని , సొంత వాళ్ల‌ను ఆరాధించ‌డం మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.