కొత్త జిల్లా కేంద్రం పై జ‌గ‌న్ జిల్లాలో నిర‌సన‌!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై పెద్ద వ్య‌తిరేక‌త లేన‌ట్టే. ఈ విష‌యంపై గ‌య్యిమ‌ని అన‌డానికి టీడీపీకి పెద్ద‌గా స్కోప్ లేదు. అంతే కాదు.. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు ద్వారా తెలుగుదేశం పార్టీకి…

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై పెద్ద వ్య‌తిరేక‌త లేన‌ట్టే. ఈ విష‌యంపై గ‌య్యిమ‌ని అన‌డానికి టీడీపీకి పెద్ద‌గా స్కోప్ లేదు. అంతే కాదు.. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు ద్వారా తెలుగుదేశం పార్టీకి జ‌గ‌న్ గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్ పేరును రాజ‌కీయంగా వాడుకుంటూ వ‌స్తున్న త‌రుణంలో, జ‌గ‌న్ ఆయ‌న పేరుకు జిల్లా గౌర‌వాన్ని ఇవ్వ‌డంతో టీడీపీ కిక్కురుమ‌నలేక‌పోతోంది. చంద్ర‌బాబు నాయుడు తీరును జ‌గ‌న్ ఎక్క‌డిక్క‌డ ఎండ‌గ‌డుతున్నారిలా.  

ఇక బీజేపీ ఈ అంశంపై  స్పందిస్తూ.. వికేంద్రీక‌ర‌ణ త‌మ అజెండా అంటోంది! ఇక జ‌న‌సేన చ‌ప్పుడు పెద్ద‌గా లేదు. ఇక కొత్త జిల్లా కేంద్రాలు అవుతున్న ప‌ట్ట‌ణాల్లో ఉత్సాహం క‌నిపిస్తూ ఉంది. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు డైరెక్టుగా ఒరిగే ప్ర‌యోజ‌నాలు పెద్ద‌గా లేక‌పోయినా, రియ‌ల్ బూమ్ తో ఈ మోస్త‌రు ప‌ట్ట‌ణాల్లో ఆస్తుల విలువ‌లు అమాంతం పెర‌గ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది.

ఇక జ‌గ‌న్ నిర్ణ‌యంపై కొన్ని చోట్ల నిర‌స‌న త‌ప్ప‌డం లేదు. ఈ స్వ‌రాన్ని వినిపించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఉన్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాల్సింది అన్నారు బాల‌కృష్ణ‌.  త‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం జిల్లా అవుతుంద‌ని బాల‌కృష్ణ అనుకుని ఉండ‌వ‌చ్చు. అయితే హిందూపురం క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఉంది. రోడ్డు సౌక‌ర్యం అంతంత మాత్రం. 

ధ‌ర్మ‌వ‌రం, క‌దిరి వంటి ప్రాంతాల నుంచి హిందూపురం వెళ్ల‌డం అంత తేలిక కూడా కాదు. అదే పుట్ట‌పర్తికి అన్ని వైపుల నుంచి మెరుగైన రోడ్డు సౌక‌ర్యం ఉంది. స‌త్యసాయి జిల్లా అనే సెంటిమెంట్ ద‌శాబ్దాల నుంచి ఉంది! దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అటే మొగ్గు చూపింది. జిల్లా కేంద్రం కాక‌పోయినా హిందూపురానికి వ‌చ్చిన లోటేమీ ఉండ‌దు.

ఇక జ‌గ‌న్ సొంత జిల్లాలో మరో నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం నుంచి ఈ విష‌యంలో నిర‌స‌న క‌నిపిస్తోంది. అదే రాజంపేట‌. లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న రాజంపేట జిల్లా అవుతుంద‌ని స్థానికులు అనుకున్నారేమో. అయితే అనూహ్యంగా రాయ‌చోటిని జిల్లాగా చేశారు. దీంతో రాజంపేట‌లో నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నిర‌స‌న‌లు చేప‌ట్టింది వైఎస్ఆర్ నాయ‌కులే. 

రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అన్న‌మ‌య్య జిల్లాకు రాజంపేటే కేంద్రం కావాల‌ని అంటున్నారు. లేక‌పోతే అధికారిక ప‌ద‌వులకు రాజీనామాలు అంటూ వైఎస్ఆర్ పార్టీ లోక్ క్యాడ‌ర్ ప్ర‌క‌టించింది. మ‌రి వీరికి జ‌గ‌న్  ఎలా భ‌రోసా ఇస్తారో!