కొత్త జిల్లాలు.. మంత్రి వ‌ర్గ మార్పుచేర్పుల లెక్క‌లో మార్పు!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య‌ను పెంచాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాన్నాళ్లుగానే అనుకుంటూనే వ‌స్తున్నా, ఎందుకో ఆ కార్య‌క్ర‌మం కొంత వాయిదా ప‌డింది. చివ‌ర‌కు…

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య‌ను పెంచాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాన్నాళ్లుగానే అనుకుంటూనే వ‌స్తున్నా, ఎందుకో ఆ కార్య‌క్ర‌మం కొంత వాయిదా ప‌డింది. చివ‌ర‌కు ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. మ‌రి ఈ ప‌ని పూర్తి కావ‌డం లాంఛ‌న‌మే. ఈ జిల్లాల పెంపు కార్య‌క్ర‌మం తో క్షేత్ర స్థాయిలో ర‌క‌ర‌కాల మార్పు చేర్పులు చేసుకుంటూ ఉన్నాయి. అందులో ముఖ్య‌మైన‌ది రియ‌లెస్టేట్ ఊపు!

కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న రాగానే… ముందుగా ఉత్సాహం క‌నిపిస్తున్న‌ది రియ‌లెస్టేట్ వ్యాపారంలో. ఇన్నాళ్లూ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప‌ట్ట‌ణాలుగా ఉన్న వివిధ ఊర్లు జిల్లాలు అవుతున్నాయి. దీని ఫ‌లితంగా… అక్క‌డ రియల్ వ్యాపారం ఊపందుకోనుంది ఇక‌. కొత్త జిల్లా కేంద్రాల చుట్టు ప‌క్క‌ల భూముల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం ఖాయం. 

కొత్త జిల్లాల వార్త అలా వ‌చ్చిందో లేదో.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌క్రియ‌లు తాత్కాలికంగా ఆగిపోయాయంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. అప్పటి వ‌ర‌కూ లావాదేవీల్లో ఉన్న వ్య‌వ‌హారాల‌న్నీ తాత్కాలికంగా ఆగాయి. కొత్త జిల్లా కేంద్రాల‌కు కాస్త స‌మీప ఊర్ల‌లో.. ఎక‌రా ప‌ది ల‌క్ష‌లు, ఇర‌వై లక్ష‌లు చెప్పిన భూములు కూడా ఇప్పుడే అమ్మం అంటున్నారు! 

అదేమంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు వ్య‌వ‌హ‌రం ఒక కొలిక్కి వ‌స్తే ఆ భూముల‌ను మ‌రింత భారీ రేటుకు అమ్ముకోవ‌చ్చ‌నే ధోర‌ణి క‌నిపిస్తోంది జ‌నాల్లో. ఏపీలో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలు అనేకం జిల్లాలుగా మారుతున్నాయి. దీంతో అక్క‌డంతా ఊపు వ‌స్తోంది.

రాయ‌చోటి, పుట్ట‌ప‌ర్తి వంటి నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప‌ట్ట‌ణాలు ఇప్పుడు ఫుల్ గా రియ‌ల్ బూమ్ ను అందుకోనున్నాయి. ఇలాంటి ప‌ట్ట‌ణాల‌కు స‌మీపంలోని గ్రామాలు కూడా ఫుల్ ఖుషీగా క‌నిపిస్తూ ఉన్నాయి. జిల్లాల సంఖ్య పెర‌గ‌డం ద్వారా ఈ వికేంద్రీక‌ర‌ణ జ‌రిగి.. భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం రైతుల‌కూ, రియ‌లెస్టేట్ వ్యాపారుల‌కు కూడా ఉత్సాహాన్ని ఇస్తున్న అంశ‌మే.

ఆ సంగ‌త‌లా ఉంటే.. జిల్లాల సంఖ్య పెంపుద‌ల రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను కూడా మార్చ‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ కేబినెట్ లో కొన్ని జిల్లాల‌కు ఒక్కో మంత్రి చొప్పున ప్రాతినిధ్యం ఉంది. కొన్ని జిల్లాల‌కు రెండు మంత్రి ప‌ద‌వులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని జిల్లాల‌కు మంత్రివ‌ర్గంలో ప్రాతిన‌థ్య‌మే ఉండ‌బోదు! ఫ‌లితంగా అక్క‌డ కొత్త వారికి అవ‌కాశాలు ద‌క్క‌డం లాంఛ‌నంగానే క‌నిపిస్తూ ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ అనంత‌పురం జిల్లా నుంచి ఒకే మంత్రి ఉన్నాడు. పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారాయ‌న‌. ఇప్పుడు అనంత‌పురం జిల్లా రెండుగా మారనుంది. ఒక‌టి అనంత‌పురం కేంద్రంగా, మ‌రోటి పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా శ్రీస‌త్య‌సాయి జిల్లా  ఏర్ప‌డుతోంది. ప్ర‌స్తుత మంత్రి పుట్ట‌ప‌ర్తి జిల్లా ప‌రిధిలోకి వెళ‌తారు. అనంత‌పురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండ‌న‌ట్టే. దీంతో.. అనంత‌పురం జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే ఎమ్మెల్యేల్లో ఉత్సాహం వ‌చ్చిన‌ట్టే. మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాల జిల్లాలో ఎవ‌రికి అవ‌కాశాలు ల‌భిస్తాయో అనేది ఇన్నాళ్ల లెక్క‌. 

ఇప్పుడు అనంత‌పురం జిల్లాలో ఎనిమిది, పుట్ట‌ప‌ర్తి జిల్లాలో ఆరు. వీటిల్లో అధికార పార్టీకి అనంత‌పురం ప‌రిధిలో ఏడు, పుట్ట‌ప‌ర్తిలో ఐదు ఎమ్మెల్యేలున్నారు. ఇలా త‌మ‌కు  అవ‌కాశం ల‌భించ‌డం విష‌యంలో ఎమ్మెల్యేల‌కు సంభావ్య‌త పెరిగిన‌ట్టే. ప‌ద‌వి విష‌యంలో పోటీ త‌గ్గిన‌ట్టే. జిల్లాకు ఒక మంత్రి ప‌ద‌వి లెక్క‌న జ‌గ‌న్ కేబినెట్ ను పున‌ర్వ్య‌స్తీక‌రిస్తే చాలా స‌మీక‌ర‌ణాలు మారిపోతాయి. అన్నీ చిన్న జిల్లాలే కాబ‌ట్టి.. ఒక్కో జిల్లా నుంచి ఇద్ద‌రికి చాన్సులు ఉండ‌వు. ఒక్కో జిల్లా నుంచి ఒక్కోరిని తీసుకుంటే.. స‌మీక‌ర‌ణాల్లో మార్పు క‌చ్చితంగా జ‌ర‌గొచ్చు.