బొత్స లాజిక్ పాయింట్…ఉద్యోగులకు ఇరకాటమేనా..?

మొత్తానికి ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా ఏపీలో సాగుతోంది. తగ్గేదే లే అంటూ ఉద్యోగులు అంటూంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా కాస్త గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పటిదాకా సహనంతో ఉన్న మంత్రులు కూడా…

మొత్తానికి ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా ఏపీలో సాగుతోంది. తగ్గేదే లే అంటూ ఉద్యోగులు అంటూంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా కాస్త గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పటిదాకా సహనంతో ఉన్న మంత్రులు కూడా చర్చలకు పిలిస్తే ఉద్యోగులు ఎందుకు రాలేదు అని రెట్టించి అడుగుతున్నారు. దీని మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే లాజిక్ పాయింటే లాగారు.

కొత్త పీయార్సీ విషయంలో ఉద్యోగులు మొదట ఒప్పుకున్నది నిజం కాదా అని నిలదీశారు. కొత్త ఫిట్ మెంట్ ని వారు అంగీకరించి మరీ తరువాత ఆందోళన చేయడమేంటి అని కూడా అంటున్నారు. ప్రభుత్వం అంటే మీరు కూడా  కాదా అని ఆయన ఉద్యోగులను ప్రశ్నించారు. సర్కార్ అంటే కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు అనుకుంటే ఎలా అని కూడా వారిని టార్గెట్ చేశారు. ఉద్యోగులు చర్చలకు రాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే  ఉత్తరాంధ్రా జిల్లాలో పర్యటిస్తున్న సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేస్తే తాము నాలుగు అడుగులు వేస్తామని కూడా చెబుతున్నారు. మరి గ్యాప్ ఎక్కడ వచ్చింది అన్నది మాత్రం ఎవరూ చెప్పడంలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం అయితే ఉంది. ఈ నెల మొదటి వారంలో సీఎం జగన్ సమక్షంలో 23 శాతం ఫిట్మెంట్ ని అంగీకరించి ఆ మీదట పీయార్సీ బాగుందని పాలాభిషేకాలు చేసిన ఉద్యోగులు తరువాత ఎందుకు రివర్స్ అయ్యారు అన్నదే ప్రభుత్వ వాదన. మరి ఆ పాయింట్ నే లాగి మరీ బొత్స కార్నర్ చేసే ప్రయత్నం చేశారు అంటున్నారు.