మంచికి మంచి, చెడుకి చెడు ఇదీ జగన్ మాట. తగ్గేదేలే.. అనేది సినిమా డైలాగే అయినా.. తనను జైలుకి పంపించినా.. తగ్గేదే లే అంటూ అప్పటి నుంచి పోరాటం చేస్తూ చివరకు అనుకున్నది సాధించారు జగన్. ఇప్పుడు ఉద్యోగుల బెదిరింపులకి జగన్ ఏమాత్రం బెదిరిపోయే పరిస్థితి లేదని ఆయన గురించి తెలిసినవారు అంటుంటారు.
ప్రస్తుతం ఉద్యోగులు జీతాలు కూడా ప్రాసెస్ చేయకుండా మొండికేసే సరికి ఎస్మా బాణం ప్రయోగిస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే జగన్ లోని మరో కోణాన్ని ఉద్యోగులు చూడాల్సి వస్తుంది. ఉద్యోగుల విషయంలో తానెంత సానుకూలంగా ఉంటున్నాననే విషయాన్ని గతంలో పదే పదే గుర్తు చేసేవారు జగన్.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలో కూడా ముందూ వెనకా ఆలోచించుకోలేదు. ప్రభుత్వానికి జరిగే మేలు కంటే, ఉద్యోగులకు జరిగే మేలు గురించే ఎక్కువగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఐఆర్ విషయంలో కూడా ఉద్యోగులు సంతోషపడేలా 27శాతం ఇచ్చారు.
తీరా ఇప్పుడు పీఆర్సీ విషయానికొచ్చే సరికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అర్థం చేసుకోండి అంటే మాత్రం ఉద్యోగులు మాట వినడంలేదు. చివరికి వాళ్లు సమ్మె చేస్తామన్నప్పుడు కూడా కేసులు పెట్టొద్దని పోలీసులకు చెప్పారు. సమ్మె వాళ్ల హక్కు అంటూ తన పెద్దమనసు చాటుకున్నారు.
సామ, దాన, భేద, దండోపాయం..
చర్చలకు పిలిచి బుజ్జగించాలనుకున్నారు, కానీ ఉద్యోగులు రాలేదు, కొత్త పీఆర్సీ అమలు చేయాలని ఆర్థిక శాఖ కఠిన ఆదేశాలిచ్చింది, కుదరలేదు.. తీరా ఇప్పుడు ఎస్మా అస్త్రం ప్రయోగించడానికి ప్రభుత్వం రెడీగా ఉందనే వాదన వినపడుతోంది. ఇక్కడ ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్లాలని చూస్తుండే సరికి ప్రభుత్వానికి మరో మార్గం దొరకడం లేదు.
ఇటీవలే విద్యుత్ శాఖలో సమ్మెలను నిషేధిస్తూ జీవో జారీ చేశారు. అటు ఆర్టీసీ ఉద్యోగులు కనీసం ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా.. ఏకపక్షంగా రెవెన్యూ, టీచర్లకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ట్రెజరీ ఉద్యోగులు కనీసం పెన్షనర్ల కష్టాలు కూడా పట్టవన్నట్టు జీతాలు ప్రాసెస్ చేయకుండా పక్కనపెట్టారు.
ఈ దశలో ఎస్మా అస్త్రం మినహా ప్రభుత్వానికి వేరే దారి కనపడ్డం లేదు. తొలి దశగా ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. కచ్చితంగా వచ్చి జీతం బిల్లులు ప్రాసెస్ చేయాల్సిందేనంటూ నోటీసులిచ్చారు. చెప్పిన పని చేయకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక ఆఖరి అస్త్రంగా ఎస్మా ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని సంకేతాలిస్తోంది. అదే జరిగితే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మరి అంతవరకు తెచ్చుకుంటారా..? తెగే ముందే మధ్యేమార్గం ఎంచుకుంటారా.. మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.