ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవాలని సీమాంధ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆగలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ తెర మీదికి తెచ్చిన మూడు రాజధానులు కూడా ఏర్పాటు కాకుండా ఎవరూ ఆపలేరని అనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో సుప్రీం కోర్టు ఏం చెప్పిందో ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా దాదాపుగా అదే చెప్పింది. అప్పట్లో రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి.
అప్పుడు సుప్రీం కోర్టు ముందు చట్టం చేయనివ్వండి… తరువాత చూద్దాం అని చెప్పింది. చట్టం చేయకుండా తాము ఆదేశించలేమంది. కానీ రాష్ట్ర విభజన జరిగాక ఆ పిటిషన్ల మీద ఇక విచారణ జరగలేదు. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ఏపీలో రెండేళ్లకు పైగా సాగుతున్న మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో కీలక దశకు చేరుకుంది.
కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు..అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వెనక్కు తీసుకుంది. అదే సమయంలో మరింత సమగ్రంగా బిల్లులను సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. అప్పటికే ఈ బిల్లులు – చట్టాల పైన హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటి పైన హై కోర్టు విచారణ సాగిస్తున్న సమయంలో ప్రభుత్వం ఆకస్మికంగా ఈ బిల్లులను వెనక్కు తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయటం వెనుక ఉద్దేశం న్యాయస్థానం నుంచి విచారణను తప్పించుకోవటమేనని పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఆ చట్టాన్ని రద్దు చేసి…మరోసారి బిల్లులు తీసుకొస్తామంటూ సభలోనే ప్రభుత్వం చెప్పిన విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చే శాసనాధికారం, మళ్లీ దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.
మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్న నేపథ్యంలో… రాజధాని అమరావతి నిర్మాణాన్ని నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాలని కోరారు. మూడు రాజధానుల చట్టాన్ని చేసే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని… దాన్ని రద్దు చేస్తూ మళ్లీ చట్టం చేసే అధికారం అసలే లేదని వాదిస్తూ… రాజధాని వ్యవహారం పార్లమెంట్ పరిధిలోనిదని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.
మూడు రాజధానుల చట్టం, దాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన తాజా చట్టం చెల్లుబాటు కానివిగా ప్రకటించాలంటూ పిటీషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరు హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన న్యాయస్థానం చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్లుందని వ్యాఖ్యానించింది.
చట్టాలు చేయకుండా నిలువరించలేమని, అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సుప్రీం కోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఇప్పుడు హై కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. అంటే మూడు రాజధానుల ఏర్పాటు తప్పు కాదని హై కోర్టు తీర్పు చెబుతుందా?