సామాన్యుడిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారు. టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే స్థాయికి ఎదగడం వెనుక చిరంజీవి ఓ తపస్సు చేశారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి మహావృక్షమైతే, ఆ తర్వాత పుట్టుకొచ్చిన మొక్కలే పవన్‌కల్యాణ్, నాగబాబు, రాంచరణ్…ఇలా ఆ కుటుంబంలో ఎవరైనా కావచ్చు.
చిరంజీవి కృషికి పట్టుదల తోడు కావడంతో విజయం వశమైంది. చిరంజీవి ఏం చేసినా తన ప్రత్యేకతను చాటుకుంటారు. తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలోనూ బిడ్డగా తన స్థానాన్ని మరిచిపోలేదు. అదే అభిమానుల్ని కట్టి పడేసింది. ఇవాళ మెగాబ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు.
ఇటీవల కరోనాబారిన పడిన చిరంజీవి నేరుగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పలేకపోయినందుకు బాధపడ్డారు. కానీ సోషల్ మీడియా వేదికగా తల్లిపై బిడ్డ ప్రేమను చాటుకున్నారు. ఇందులో కూడా వైవిధ్యం కనబరిచారు.
“అమ్మా… నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉంటున్న కారణంగా ప్రత్యక్షంగా నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా శుభాకాంక్షలు చెబుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు… మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ప్రేమతో… శంకర్‌బాబు” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన సతీమణి , తల్లితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారాయన.
అమ్మకు శుభాకాంక్షలను తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ (శంకర్‌బాబు) తో తెలపడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. చిరును కుటుంబ సభ్యులు శంకర్‌బాబు అని పిలిచే సంగతి తెలిసిందే. తల్లి ఆప్యాయంగా పిలిచే శంకర్‌బాబు పేరుతోనే శుభాకాంక్షలు చెప్పడం ద్వారా… తాను ఏ స్థాయికి ఎదిగినా తల్లికి కొడుకునే అనే విషయాన్ని గుర్తు చేశారని అభిమానులు అంటున్నారు.