టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని తన మార్క్ పంచ్‌లతో ఎదురు దాడికి దిగారు. గుడివాడలో క్యాసినో వ్యవహారంలో కొడాలి నానిని ఇరికించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విశ్వ ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కోవిడ్ నుంచి కోలుకుని వచ్చిన మంత్రి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు, లోకేశ్‌ల వ్యవహార శైలిపై నాని దిమ్మ తిరిగే షాకింగ్ కామెంట్స్ చేశారు.
టీడీపీకి సైకిల్ గుర్తు తెచ్చుకునేందుకు చంద్రబాబు ఎలాంటి దిగజారుడు పని చేశారో, అలాగే అమ్మాయిలతో లోకేశ్ సన్నిహితంగా మెలగడంపై నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గుడివాడలో క్యాసినో నిర్వహణపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్యాసినో ఉదంతంపై టీడీపీ రచ్చను నాని తప్పు పట్టారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై ఆయన మండిపడ్డారు.
గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? అని టీడీపీ నేతలపై నాని సెటైర్స్ విసిరారు. గుడివాడలో మూడురోజులు నిర్వహించిన క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని కోట్లు రావాలని ఆయన ప్రశ్నించారు. గుడివాడలో తనను ఓడించడం చేతకాకే లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
గుడివాడ ప్రజలు అమాయకులు కాదన్నారు. వారికి అన్ని విషయాలు తెలుసన్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకమని ఆయన తప్పు పట్టారు. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చానని, వారికి చేతనైంది చేసుకోవాలని మంత్రి కొడాలి నాని అన్నారు.