పదమూడు తో పాటే మూడు కూడానూ…?

పదమూడూ మూడూ ఈ అంకెలు బాగున్నాయి. టైమింగ్ రైమింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ పదమూడు ఏంటి, మూడు ఏంటి అంటే చాలా విషయాలే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలీ అంటే ఏపీ అంతా…

పదమూడూ మూడూ ఈ అంకెలు బాగున్నాయి. టైమింగ్ రైమింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ పదమూడు ఏంటి, మూడు ఏంటి అంటే చాలా విషయాలే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలీ అంటే ఏపీ అంతా మూడూ పదమూడు చుట్టూనే ఇపుడు తిరుగుతోంది. ఏపీలో ఇపుడు పదమూడు కొత్త జిల్లాలు వచ్చాయి. అటూ ఇటూ తిరగేసినా నంబర్ వచ్చి పది తరువాత మూడు వద్దనే ఆగింది. దాంతో అది వైసీపీకి లక్కీ నంబరా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే వైసీపీ సర్కార్ వస్తూనే మూడు రాజధానులు అని ప్రతిపాదించింది. ఏపీలో మూడు చోట్లా మూడు రాజధానులను ఏర్పాటు చేయలాని ప్రతిపాదిస్తూ చట్టాన్ని కూడా అప్పట్లో చేశారు. అయితే ఆ చట్టం మీద అమరావతి ఉద్యమకారులు కోర్టుకు వెళ్ళడంతో దాని మీద న్యాయ విచారణ మొదలైంది. అది అలా ఉండగానే ఈ మధ్యనే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసం హరించుకుంది. అయితే అన్నీ సమగ్రంగా చర్చిని మరోమారు మూడు రాజధానుల చట్టాన్ని తీసుకువస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది.

ఇది జరిగి కూడా మూడు నెలలు గడచిపోయాయి. ఇపుడు పదమూడు నంబర్ తో కొత్త జిల్లాలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీంతో ఏపీలో కొత్త జిల్లాల మీదనే వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. ఒక విధంగా రాజధాని అంశాన్ని పక్కన పెట్టేశారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు మూడు రాజధానులు త్వరలోనే  తధ్యమంటూ సంచలన ప్రకటన చేశారు. దానికి రుజువు అన్నట్లుగా పదమూడు ఎలా వచ్చిందో మూడు కూడా అలాగే వస్తుందని గట్టిగా చెప్పుకున్నారు.

చెప్పిన మాట మేరకు పదమూడు కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, అదే వరసలో మూడు రాజధానులను  కూడా త్వరలోనే అమలు చేసి తీరుతామని మంత్రి గారు బల్ల గుద్దుతున్నారు. జగన్ చెప్పిన మాటకు ఎపుడూ కట్టుబడి ఉంటారని చూస్తూ ఉండండి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందని కూడా చెప్పేశారు.

ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా మూడు రాజధానులూ పదమూడు కొత్త జిల్లాలూ ఖాయమని కూడా మంత్రి స్పష్టంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా కొత్త రాజధానులకు అనుకూలా వ్యతిరేకమా చంద్రబాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు అయోమయాన్ని, తన ఊహాలను పక్కన పెట్టి వాస్తవంగా ఆలోచిస్తే ప్రభుత్వం చేసే మంచి అన్నది  ఆయనకు కనిపించి తీరుతుందని కూడా అవంతి సెటైర్లు వేయడం విశేషం.

మొత్తానికి వైసీపీ సర్కార్ మూడు పదమూడు నంబర్లతోనే తన మూడేళ్ల పదవీకాలంలో బాగానే ముందుకు సాగుతోందని అంటున్నారు. మరి మంత్రి గారు చెప్పినట్లుగా పదమూడు తరువాత మూడు కూడా ముందుకు వస్తుందేమో చూడాలి. విపక్షాల మూడ్ ఎలా ఉన్నా సర్కార్ మూడ్ మాత్రం మూడుతోనే  ఉందని అంటున్నారు.