రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నో విషయాలు దొరుకుతాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా కాదేదీ రాజకీయానికి అనర్హం అని చెప్పొచ్చు. ఏపీలో ఇప్పుడు జిల్లాల విభజన, వాటికి ఎవరి పేర్లు పెట్టాలనే దానిపై రచ్చ రచ్చ జరుగుతోంది కదా. కొత్త కొత్త డిమాండ్లు తెర మీదికి వస్తున్నాయి. ఈ డిమాండ్ల వెనుక తప్పనిసరిగా రాజకీయం ఉంటుంది. రాజకీయ నాయకులు ఉంటారు.
ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల పేర్ల రాజకీయంలో ఓ కొత్త డిమాండ్ తెర మీదికి వచ్చింది. ఈ డిమాండ్ వెనుక రాజకీయం ఉందా? కేవలం అభిమానమే ఉందా? సరిగా చెప్పలేము. అసలు కథ ఏమిటంటే …. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు కదా. ఈ నిర్ణయం వెనుక ఎన్టీఆర్ మీద అభిమానం ఏమోగానీ రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంది. వ్యక్తిగతంగా టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన పార్టీని దెబ్బ తీయాలనే వ్యూహం ఈ నిర్ణయం వెనుక ఉంది.
జగన్ ఈ నిర్ణయం తీసుకోగానే కక్కలేక, మింగలేక ఇబ్బంది పడిన చంద్రబాబు చివరకు స్వాగతించక తప్పలేదు. టీడీపీలో ఉన్న బాలకృష్ణ, బీజేపీలో ఉన్న పురందేశ్వరి మాత్రమే కాకుండా రాజకీయాల్లో లేని మిగిలిన ఎన్టీఆర్ సంతానం కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. మొత్తం మీద చంద్రబాబు చేయలేని పని జగన్ చేశాడని ఎన్టీఆర్ అభిమానులంతా సంబరపడుతున్నారు. ఎన్టీఆర్ నటుడిగా ఎంత పాపులర్ అయ్యారో, రాజకీయ నాయకుడిగా కూడా అంత పాపులర్. రెండు రంగాల్లోనూ హిమాలయాలంత ఎత్తుకు ఎదిగారు. చరిత్ర సృష్టించారు.
కాబట్టి ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకులు కూడా కాదనరు. ఆయన పేరు పెట్టడంలో ఎలాంటి వివాదమూ లేదు. కానీ తాజాగా మరో డిమాండ్ తెర మీదికి వచ్చింది. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో తెరమీదకు వచ్చింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడుతున్న కొత్త జిల్లా అయిన మచిలీపట్నానికి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానుల సంఘం నేతలు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తమ కోరికను దృష్టిలో పెట్టుకొని ఏఎన్ఆర్ జిల్లాగా పేరు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరావు గుడివాడ రామాపురంలో జన్మించారని, ఆయన గుడివాడ ప్రాంతానికి చెందిన వారని, తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగించిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వర రావు అని వారు పేర్కొన్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమను తీసుకు వచ్చే విషయంలో ఎంతో కృషి చేశారని అక్కినేని అభిమానుల సంఘం నేతలు పేర్కొంటున్నారు.
తెలుగు సినీ చరిత్రలో ఏఎన్ఆర్ ఎంతో ఖ్యాతి గడించారని, సినీ రంగంలో ఆయన చేసిన సేవకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన అందుకున్నారని అటువంటి ఆయనకు గుర్తింపుగా జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏఎన్ఆర్ విద్యా, సామాజిక సేవలలో ఎంతో తోడ్పాటు నందించారని వారు కితాబిచ్చారు. తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన మహావ్యక్తి అక్కినేని నాగేశ్వర్ రావ్ అని చెప్పారు.
ఏఎన్నార్ కళా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ అక్కినేని అభిమానుల సంఘం నేతలు చెబుతున్నారు. నిజానికి తెలుగు సినిమా స్వర్ణ యుగంలో ఎన్టీఆర్, అక్కినేని సినీ పరిశ్రమకు రెండు కళ్లలా ఉండేవారు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అక్కినేనిని కూడా రమ్మని ఆహ్వానించారు.
కానీ తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని అక్కినేని తిరస్కరించారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న సమయంలో అక్కినేని పేరు తెర మీదికి రావడంలో రాజకీయం ఉందా? ఆయన కుటంబ సభ్యులు సినీరంగంలో స్థిరపడ్డారుగానీ రాజకీయాల వైపు మొగ్గు చూపలేదు. మరి అక్కినేని అభిమానులే ఈ డిమాండ్ చేశారనుకోవాలా ?