ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్ విడుదలపై దిల్ రాజు జోస్యం

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం నలుగుతోంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉంది. ఓవైపు థియేటర్లు నడుస్తున్నప్పటికీ, పెద్ద సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వడం లేదు. ఈ మొత్తం…

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం నలుగుతోంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉంది. ఓవైపు థియేటర్లు నడుస్తున్నప్పటికీ, పెద్ద సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వడం లేదు. ఈ మొత్తం వ్యవహారంపై టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించాడు. నేరుగా రిలీజ్ డేట్స్ పై స్పందించకుండా.. పెద్ద సినిమాలన్నీ మరో 3 నెలల్లో థియేటర్లలోకి వచ్చేస్తాయంటున్నారు రాజు.

“నాకు తెలిసి ఫిబ్రవరి నెలాఖరు నుంచి పెద్ద సినిమాల రిలీజ్ లు మొదలైపోతాయి. అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి పరిస్థితులన్నీ నార్మల్ అవుతాయి కాబట్టి పెద్ద సినిమాలన్నీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను అనుకోవడం ఫిబ్రవరి 25 నుంచి మార్చి, ఏప్రిల్, మే వరకు అన్ని పెద్ద సినిమాలు వచ్చేస్తాయి. సమ్మర్ లోపు పెద్ద సినిమాల రౌండ్ పూర్తయిపోతుంది.”

ఇలా పెద్ద సినిమాల విడుదలపై స్పందించారు రాజు. ఆయన చెప్పే లాజిక్ ప్రకారం చూసుకుంటే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లానాయక్, ఎఫ్3 సినిమాలన్నీ మే నెలలోపు థియేటర్లలోకి వచ్చేస్తాయి. అంటే ప్రతి రెండు పెద్ద సినిమాల మధ్య కేవలం  2-3 వారాల గ్యాప్ మాత్రమే ఉంటుందన్నమాట. అటు ఏపీలో టికెట్ రేట్లపై కూడా స్పందించారు రాజు.

“కమిటీ చురుగ్గా పని చేస్తుంది. పెద్ద సినిమాలు రిలీజయ్యే టైమ్ కు ఏపీలో టికెట్ల ఇష్యూ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కమిటీ, ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడిస్తుందనే అంశంపై అన్నీ ఆధారపడి ఉన్నాయి. మేం పాజిటివ్ గా ఉన్నాం. అన్నీ సెట్ అవుతాయని అనుకుంటున్నాను. ఇక రిలీజ్ డేట్స్ విషయానికొస్తే, అందరూ డేట్స్ ఎనౌన్స్ చేస్తారు. ఫైనల్ గా పెద్ద సినిమా కోసం కాంప్రమైజ్ కావాల్సిందే. ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28కి వస్తే నేను ఎఫ్3 వాయిదా వేసుకోవాల్సిందే. అందరం ఓ అండర్ స్టాండింగ్ తో ముందుకెళ్లాల్సిందే. లేకపోతే పెద్ద సినిమాలు రిలీజ్ కష్టం.”

తను నిర్మించిన రౌడీబాయ్స్ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోందని చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టారు దిల్ రాజు. ఫైనల్ రన్ ముగిసేనాటికి రౌడీబాయ్స్ కు 15 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే, తన దృష్టిలో సినిమా సూపర్ హిట్ అయినట్టేనని అన్నారు.