ఇది మేం చెబుతున్న మేటర్ కాదు. బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ అధికారికంగా వెల్లడించిన రిపోర్ట్ ఇది. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ అనే జర్నల్ లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రకటించారు కూడా. ఓవరాల్ గా ఈ నివేదిక చెబుతున్న విషయం ఏంటంటే.. వారానికి 5 కంటే ఎక్కువ గ్లాసులు రెడ్ వైన్ తీసుకుంటున్న వ్యక్తులు, మిగతా వ్యక్తులతో పోలిస్తే 17 శాతం తక్కువగా కరోనా బారిన పడ్డారట.
యూకే బయోబ్యాంక్ అనే బ్రిటిష్ డేటా బేస్ ను చైనాలోని షెంజన్ హాస్పిటల్ లో విశ్లేషించారు. కరోనా కాలంలో మద్యం తాగే అలవాటు, ఆయా వ్యక్తులు వైరస్ బారిన పడిన సంఖ్య, లక్షణాల్ని విశ్లేషించేందుకు ఈ సర్వే చేశారు. 4,73,957 మంది మద్యం తాగే వ్యక్తుల డేటా బేస్ ను పరిశీలించగా.. అందులో 16,559 మంది కరోనా బారిన పడినట్టు నిర్థారించారు.
వీళ్లలో రకరకాల మద్యం బ్రాండ్లు తాగేవాళ్లున్నారు. అయితే ఎవరైతే ఎక్కువగా తమ జీవిత కాలంలో రెడ్ వైన్ తాగుతున్నారో వాళ్లు, మిగతా వాళ్లతో పోలిస్తే 17శాతం తక్కువగా కరోనా వైరస్ కు గురయ్యారు. ఇప్పుడు చెప్పుకున్న మద్యంలో పోలీఫెనాల్ అనే కారకం ఎక్కువగా ఉంటుంది. ఇది వైరస్ లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని వైద్యులు అంటున్నారు.
ఇక వైట్ వైన్, షాంపేన్ తాగే వారు 8 శాతం తక్కువగా కరోనా బారిన పడినట్టు స్టడీ వెల్లడించింది. ఇదే సమయంలో మరో ఆశ్చర్యకర విషయాన్ని ఈ స్టడీ బయటపెట్టింది. ఎవరైతే రెగ్యులర్ గా బీర్ తాగుతారో, వాళ్లు ఇతరులతో పోలిస్తే 28శాతం ఎక్కువగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.
అయితే ఇప్పుడు చెప్పుకున్న రెడ్ వైన్ కూడా మోతాదుకు మించకూడదంటున్నారు వైద్యులు. ఏ మద్యం అయినా మోతాదుకు మించి తాగితే, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుందని చెబుతున్నారు. వైరస్ నుంచి బయటపడ్డానికి వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గమని చెబుతున్నారు.