డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది సినీ ప్రముఖులకు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్.. ఈ మేరకు అందర్నీ సచ్ఛీలురుగా ప్రకటించింది. ఆ తర్వాత ఇదే కేసులకు సంబంధించి రంగంలోకి దిగిన ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) కూడా కొన్నాళ్లు విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంతా సద్దుమణిగిందనుకుంటే టైమ్ లో కీలకమైన డ్రగ్ డీలర్ పోలీసులకు దొరికాడు. దీంతో టాలీవుడ్ లో మరోసారి గుబులు రేగింది.
వల పన్ని టోనీని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడ్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈరోజు కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ఈ 5 రోజుల్లో టోనీని పూర్తిస్థాయిలో విచారించబోతున్నారు. ఈ సందర్భంగా టోనీ నోటి నుంచి టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకొస్తే పరిస్థితేంటి? ఆల్రెడీ క్లీన్ చిట్ అందుకున్న ప్రముఖుల పేర్లను టోనీ బయటపెడితే ఏం జరుగుతుంది?
టాలీవుడ్ లో పైకి కనిపించని గుబులు ఇది. ఇప్పటికే ఈ కేసు నుంచి దాదాపు 60 మంది 'విజయవంతంగా' బయటపడ్డారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ తిరిగేస్తున్నారు.. ఈ నేపథ్యంలో టోనీ అరెస్ట్ అవ్వడం, అతడి కంటే ముందు హైదరాబాద్ కు చెందిన అతడి ఏజెంట్లు ఇమ్రాన్, నూర్ ఖాన్ దొరికిపోవడం టాలీవుడ్ ప్రముఖుల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. వీళ్లిద్దరి కాల్ డేటాను ఇప్పటికే పోలీసులు విశ్లేషించారు. దాని ఆధారంగా టోనీని ప్రశ్నించబోతున్నారు.
ప్రస్తుతానికైతే పోలీసుల నోటి నుంచి 'సినీ ప్రముఖులు' అనే పదం రావడం లేదు. కేవలం కొంతమంది వ్యాపారవేత్తలు అనే పదాన్ని మాత్రమే పోలీసులు వాడుతున్నారు. మరీ ముఖ్యంగా నలుగురు వ్యాపారస్తులు టోనీతో డ్రగ్స్ వ్యాపారాన్ని కలిగి ఉన్నారని చెబుతున్నారు. విచారణను ఈ దిశగానే కొనసాగించబోతున్నారు. కానీ అనూహ్యంగా టాలీవుడ్ ప్రముఖుల పేర్లు తెరపైకొస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై అటు పోలీసు అధికారుల్లో కూడా భిన్న వాదనలున్నాయి. ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత టోనీ వాళ్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పేర్లు బయటపెడితే ఏంటి పరిస్థితి?
ప్రస్తుతానికైతే పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టు విప్పే పనిలో మాత్రమే ఉన్నారు. డ్రగ్స్ సరఫరా చెయిన్ ను బ్రేక్ చేయడం వీళ్ల తక్షణ కర్తవ్యం. హైదరాబాద్ తరహాలోనే ముంబయిలో కూడా టోనీకి ఏకంగా 8 మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్లందరి వివరాలు రాబట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టోనీ నైజీరియన్ కాబట్టి, విచారణలో సౌలభ్యం కోసం ఓ ట్రాన్స్ లేటర్ ను ఏర్పాటుచేసుకున్నారు పోలీసులు. సేకరించిన కాల్ డేటా, బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా ప్రశ్నలు సంధించబోతున్నారు. 5 రోజుల తర్వాత తమ విచారణ వివరాల్ని కోర్టుకు సమర్పిస్తారు.