ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం.. ఇదీ టీడీపీ నేతలు పాడిన పాట. అలాంటి పాటల్లో అమరావతి ఆల్రెడీ అటకెక్కేసింది. మూడు రాజధానుల అంశంతో అమరావతి ఉద్యమాన్ని మొదలుపెట్టిన టీడీపీ మధ్యలోనే కాడె పడేసింది. మిగతా ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అయిన బాబు అమరావతిని పూర్తిగా పక్కనపెట్టేశారు. కనీసం ట్విట్టర్లో కూడా అమరావతి అనే పేరు ప్రస్తావించడానికే వణికిపోతున్నారు.
ఇక పోలవరం. పోలవరం ప్రాజెక్ట్ తమ హయాంలో 70శాతం పూర్తయిందని, వైసీపీ పనుల్ని అటకెక్కించేసిందని పదే పదే దెప్పిపొడుస్తున్నారు బాబు. కమీషన్ల కోసం తాను పోలవరాన్ని తాకట్టు పెట్టిన విషయాన్ని తొక్కిపెట్టేలాని చూశారు. చివరకు చంద్రబాబుకి ఆ ముచ్చట కూడా తీర్చేస్తున్నారు సీఎం జగన్.
2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు, అనుకున్నదాని కంటే వేగంగా ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయనే విషయం కూడా జనాలకు అర్థమైంది. ప్రాజెక్ట్ వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకి కూడా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ దశలో పోలవరం పూర్తయితే బాబు పరిస్థితి ఏంటనేదే అసలు ప్రశ్న.
అమరావతి ఎలాగూ లేదు, కనీసం పోలవరాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలనుకున్న బాబుకి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు సీఎం జగన్. మధ్యలో చంద్రబాబు ఏ సమస్యను ప్రస్తావించాలనుకున్నా అవన్నీ ఆయన అందుకునేలోపే పరిష్కారమవుతున్నాయి.
టిడ్కో ఇళ్ల వ్యవహారంపై బాబు ఉద్యమాలు చేసినంతసేపు పట్టలేదు వాటి పంపిణీకి ప్రభుత్వం మహూర్తాన్ని నిర్ణయించడం. డిసెంబర్ 25న కోర్టు వివాదాలు లేని ప్రాంతాల్లో పేదలకు పట్టాలు ఇచ్చేసి, ఆ తర్వాత టిడ్కో ఇళ్ల పంపిణీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రులు.
దీంతో ఉనికి కోసం ఉద్యమం చేయాలనుకుంటున్న చంద్రబాబుకి సమస్యే దొరక్కుండా ఉంది. నవరత్నాల అమలుపై వేలెత్తి చూపించే అవకాశం లేదు. అన్న క్యాంటీన్లు ఎత్తేశారనేది పూర్తిగా పాతపాట అయిపోయింది, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శిస్తే.. సచివాలయ ఉద్యోగాలు బాబుని వెక్కిరిస్తున్నాయి.
చివరికి ఐదేళ్ల పాటు ప్రధాన సమస్యలుగా చిత్రీకరించాలన్న అమరావతి, పోలవరం విషయంలో చంద్రబాబుకి గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం పోలవరం డెడ్ లైన్ ప్రకటించడంతో చంద్రబాబుకి ఏంచేయాలో తోచడంలేదు.