విశాఖను అది చేస్తాం, ఇది చేస్తామని ప్రతీ ఏటా సదస్సులు నిర్వహించి డప్పా కొట్టిన రోజులు పోయాయి. జనం కూడా ఆ మాటలు విని విసుగెత్తారు. ఇపుడు వారు చూసేది ప్రాక్టికాలిటీ. విశాఖను ముందూ వెనకా ట్యాగ్స్ తగిలించి తమాషా చేసేవారిని అసలు సహించరని కూడా ఇప్పటికే రుజువు అయింది.
అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత తమది మాటల ప్రభుత్వం కాదు చేతలతోనే చూపిస్తామని చెబుతూ వస్తోంది. ఆ దిశగా ఇపుడు అడుగులు పడుతున్నాయి.
విశాఖలో తాజాగా నిర్వహించిన పారిశ్రామిక సదస్సు వాస్తవాలకు అద్దం పట్టింది. ఉన్నది ఉన్నట్లుగా మంత్రులు, అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు. పెట్టుబడులకు ఆహ్వానించారు.
పాలనారాజధానిగా కూడా ఉన్న విశాఖలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తు బంగారంలా ఉంటుందని వైసీపీ మంత్రులు చెప్పారు. కాగా విశాఖకు త్వరలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని విజయసాయిరెడ్డి చెప్పడం సానుకూల పరిణామం. రాష్ట్రానికి 11 శాతం విదేశీ పెట్టుబడులు వస్తే అందులో విశాఖ వాటా భారీగానే ఉందని ఆయన పేర్కొన్నారు.
అలగే క్యాపిటల్ పెట్టుబడులు ఏపీకి 23 శాతం వస్తున్నాయని, అందులో కూడా విశాఖదే అగ్ర తాంబూలమని ఆయన వివరించారు. విశాఖ ఒక బ్రాండ్ అని పెట్టుబడులకు స్వర్గధామమని ఆయన చెప్పారు. ఏపీలో టైర్ వన్ సిటీగా విశాఖ ఉందని, రానున్న రోజుల్లో పెట్టుబడులు వెల్లువలా విశాఖను తాకనున్నాయని విజయసాయిరెడ్డి చెప్పడం విశాఖకు మంచి రోజులు వస్తున్నాయని తెలియచెప్పడమే.