పొత్తు ఓకే.. పక్కన మాత్రం కూర్చోవద్దు

బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కేవలం ప్రెస్ మీట్లలోనే వారితో కలసి కూర్చోడానికి పవన్ ఇష్టపడుతున్నారు. జనంలోకి వెళ్లేటప్పుడు మాత్రం బీజేపీ నేతలు తన పక్కన ఉండకూడదనే నిబంధన పెట్టారట. అందుకే ఈ రెండు పార్టీలు…

బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కేవలం ప్రెస్ మీట్లలోనే వారితో కలసి కూర్చోడానికి పవన్ ఇష్టపడుతున్నారు. జనంలోకి వెళ్లేటప్పుడు మాత్రం బీజేపీ నేతలు తన పక్కన ఉండకూడదనే నిబంధన పెట్టారట. అందుకే ఈ రెండు పార్టీలు కలసి చేద్దామనుకున్న లాంగ్ మార్చ్ వాయిదా పడింది. పవన్, బీజేపీ నేతల మధ్య మాట కలవకే అది వాయిదా పడింది.

తాజాగా పవన్ మరోసారి రాజధాని రైతుల వద్దకు వెళ్లాలనుకున్నారు. అయితే ఈసారి కూడా మేమూ వస్తామని బీజేపీ నేతలు కబురు పంపారు. దీంతో పవన్ మరోసారి అగ్గిమీద గుగ్గిలమయ్యారట. మధ్యే మార్గంగా.. జనసేనలోని చోటామోటే నేతల్ని తీసుకుని వెళ్లమని చెప్పారట. ఆయన మాట ప్రకారమే.. బీజేపీ-జనసేన నేతలు కలసి రాజధాని ప్రాంత రైతుల్ని పరామర్శించి వచ్చారు. వారితో కలసి నిరసన దీక్షల్లో కూర్చుని నినాదాలు చేశారు, ప్రసంగాలు చేశారు. ఈ ప్రోగ్రామ్ పూర్తికాగానే.. పవన్ సింగిల్ గా మరో పర్యటన ఖరారు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

రాజధాని ప్రాంత రైతులు వచ్చి తనను కలిశారని, ఉద్యమానికి మద్దతుగా మరోసారి తనని గ్రామాల్లోకి రమ్మని కోరారని, అందుకే త్వరలో టూర్ ప్లాన్ చేసుకుంటున్నానని పవన్ పేరుతో జనసేన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సినిమాల్లోకి వెళ్లిన తర్వాత ఈమధ్య జనంతో జనసేనానికి కాస్త గ్యాప్ వచ్చింది. అందుకే ఆయన జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు, అదీ బీజేపీ నేతలు పక్కన లేకుండా. అలా బీజేపీని తెలివిగా తన టూర్ నుంచి తప్పించారు జనసేనాని.

ఇప్పుడే ఇన్ని ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే.. ఇక భవిష్యత్ లో బీజేపీతో జనసేన ఎలా కలసి ప్రయాణం చేస్తుందనే అనుమానాలున్నాయి. మొత్తమ్మీద పవన్ కి మాత్రం బీజేపీ నేతలపై ఇంకా గురి కుదరలేదు. బీజేపీ నేతలు తన పక్కన ఉండగా జనంలోకి వెళ్లడానికి ఆయన ఇష్టపడడం లేదు. అందుకే ఒంటరి పర్యటనలను ఫిక్స్ చేసుకుంటున్నారు.

పవన్ తాజా వ్యవహారశైలితో బీజేపీ ఇరకాటంలో పడింది. పవన్ ను పక్కనపెట్టుకొని రాజకీయాలు చేయాలని, పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని ఆ పార్టీ భావించింది. తమకు పట్టు పెరిగిన తర్వాత పవన్ ను పక్కనపెట్టాలనేది ఆ పార్టీ యోచన. ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన విధానం ఇదే. కానీ పవన్, బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఈ ప్రయాణం ఎన్నాళ్లిలా సాగుతుందో చూడాలి.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం