ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కడప గొప్పతనం ఏంటో చాటి చెబుతూ, మరోసారి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసి, కారం పెడ్తామని జాగ్రత్త అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ఇవాళ ఆయన ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజుపై ఆవేశంతో, ఆవేదనతో ఊగిపోయారు. రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే….
“రాయలసీమ వాసులందరినీ బాధించే వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, హద్దులు దాటి, మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలందరినీ బాధించేలా సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. ఒళ్లు బలిసి, కొవ్వెక్కి, నీ నాలుక నీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతోంది సోము వీర్రాజు. నేను ప్రజాస్వామ్యంలో కూడా ఉండకపోయి వుంటే… ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన బాధ్యత గల ఎమ్మెల్యే స్థానంలో లేకపోయి వుంటే, జన్మనిచ్చిన ఈ తల్లి, ఈ కడప గడ్డ మాకు సంస్కారాన్నే నేర్పి ఉండకపోయి వుంటే …ఈ పాటికి నీ నాలుక కోయాల… నువ్వు మాట్లాడిన మాటలకు. ఇంకా నిన్ను సంస్కారయుతంగా మాట్లాడుతున్నామంటే ఈ జిల్లా గొప్పతనం. ఈ భూమి గొప్పతనం, ఈ గాలి గొప్పతనం. మేము తాగే నీళ్ల గొప్పతనం.
కడప జిల్లా ప్రజల గురించి ఏం తెలుసు నీకు. వారి ఆప్యాయతలు, మర్యాదల గురించి, వారి ప్రేమ గురించి, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండే తత్వం గురించి, నమ్మిన వారి కోసం ప్రాణమైనా ఇచ్చే మనస్తత్వం గురించి …ఒక అక్షరమైనా తెలుసా సోము వీర్రాజు? ఈ జిల్లా ప్రజల్ని ఎంత మాటంటే అంత మాట మాట్లాడ్తావా? ఈ జిల్లా ప్రజలు హత్యలు చేసేవాళ్లా? హత్యలు మాత్రమే తెలుసు అంటావా? చంపడం మాత్రమే తెలుసు అంటావా?
ఈ జిల్లా ప్రజలకు ఏం తెలుసో నీ బుద్ధికి గడ్డి పెట్టి నేను చెప్తా. విను నువ్వు. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కడప హృదయం లాంటిది. కలియుగ దైవం ఏడుకొండల వాడు. ఆ దైవం గురించి 32 వేల సంకీర్తనలు రాసి, పాడి ఆ కైకుంఠ వాసుని కూడా అలరించిన వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ జిల్లా వాసే. నువ్వు చదివిన కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు మా జిల్లా వాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన మా వాడు. సామాజిక విప్లవాన్ని రగిల్చి, సమాజంలోని రుగ్మతలు పోగొట్టడానికి పండితులు, పామరులకు సైతం అర్థమయ్యే సరళమైన భాషలో పద్యాలు రాసిన గొప్ప వాగ్గేయకారుడు వేమన మా వాడు. మొట్టమొదటి మహిళా రచయిత్రి మొల్ల మా ఆడబిడ్డ.
శివతాండవం రచయిత పుట్టపర్తి నారాయణాచార్యులు మా వాడు. ఈ సినీ పరిశ్రమను అందించిన ఘనత ఈ జిల్లాది. సినీ పరిశ్రమకు పురుడు పోసిన నాటక రంగానికి మా జిల్లా రాయచోటిలోని సురభి అనే పల్లెటూరు. అద్భుతమైన గాయకుడైన బాలసుబ్రమణ్యాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది మా జిల్లా వాసైన హాస్యనటుడు పద్మనాభం. బ్రిటీష్ వాళ్లకు ఎదురొడ్డి, స్వాభిమానంతో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ఉరికంభానికి తల వేలాడిన వాడు సైరా నరసింహారెడ్డి మా వాడు.
దేవుని గడప శ్రీవారి తొలి గడప మా కడప. కడపకు మొట్టమొదటి పేరు కృపానగరం. మా జిల్లా పేరులోనే కృప ఉంది. మా హృదయాల్లోనే కరుణ ఉంది. పవిత్రమైన మూడు నదుల సంగమం ఈ కడప జిల్లా. ఎన్ని చెప్పాల నీకు ఈ జిల్లా గొప్పతనం గురించి. ఈ జిల్లాలో మూడిళ్లకు ఒక స్వాతంత్ర్య సమరయోధులు జన్మించారు. దేశభక్తిని నరనరాన జీర్ణించుకున్న గొప్పగడ్డ కడప. బుద్ధి మందగించి ఈ జిల్లా ప్రజలు హత్యలు మాత్రమే చేస్తారని మాట్లాడ్తావా?
మరొక్కసారి కడప జిల్లాను గానీ, రాయలసీమ ప్రజలను గానీ హత్యలకు మాత్రమే పరిమితి చేసి …ఈ నాలుగు జిల్లాల గొప్పతనాన్ని, చరిత్రను నువ్వు తెలుసుకోకుండా మాట్లాడితే …నీ నాలుక కోసి, కారం పెడ్తాం. అసలు భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉండే అర్హత నీకు ఉందా? ఇలాంటి వ్యక్తిని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉంది. రాయలసీమతో పాటు ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు సోము వీర్రాజు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి” అని రాచమల్లు తన మార్క్ హెచ్చరికలు, డిమాండ్ చేశారు. రాచమల్లు హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.